tribal department
-
గిరిజన ఆణిముత్యం.. నీట్లో ఆల్ఇండియా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్
దహెగాం: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ కూలీ కూతురు. చిన్న తనంలోనే తండ్రి మృతి చెందగా తల్లి కూలీ పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించింది. తండ్రి క్యాన్సర్‌తో ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో ఆ పసి మనసులో అప్పటి నుంచే డాక్టర్ కావాలని తలపించింది. మా నాన్నలాగా ఎవరు మృతిచెందవద్దనే ఉద్దేశంతో పట్టుదలతో చదివి ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో 427 మార్కులు సాధించగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్ కై వసం చేసుకుంది. కొలవార్ తెగలో వైద్య విద్యను పూర్తి చేస్తే తొలి విద్యార్థిని సంగర్ష్ స్రవంతి కానుంది. కుటుంబ నేపథ్యం.. కుమురంభీం జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన సంగర్ష్ శంకర్, బుచ్చక్కలకు ఐదుగురు ఆడపిల్లలే. అందులో ఐదో సంతానమైన స్రవంతి 1 నుంచి 5వ తరగతి వరకు చంద్రపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివింది. 6 నుంచి 10వ తరగతి వరకు దహెగాంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదివింది. పదిలో 8.2 జీపీఏ సాధించింది. 9వ తరగతి చదువుతున్న క్రమంలో తండ్రి శంకర్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. శంకర్‌కు సరైన వైద్యం అందక చనిపోయాడని ఇరుగుపొరుగు వారు అనేవారు. అప్పుడే ఆమెలో డాక్టర్ కావాలనే ఆలోచన మొదలైంది. దీంతో బంధువుల సహకారంతో డీఆర్‌డీఏను సంప్రదింది హైదరాబాద్‌లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో సీటు సాధించింది. ఇంటర్ బైపీసీలో 934 మార్కులు సాధించింది. కుంగిపోకుండా చదివి.. ఇంటర్ పూర్తి చేసిన స్రవంతి డాక్టర్ కావాలని కోరిక ఉండగా ప్రైవేటులో నీట్ శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేక గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్రాల్డ్లో నీట్ శిక్షణ తీసుకుంది. మొదటి ప్రయత్నంలో నీట్లో సీటు కోల్పోయింది. అయినా కుంగిపోకుండా అధైర్యపడకుండా పట్టుదలతో చదివి రెండోసారి 427 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు సాధించి వైద్య విద్యకు ఎంపికై ంది. వైద్య విద్య పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కొలవార్ తెగలో మొదటి మహిళగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. నా బిడ్డను డాక్టర్‌గా చూడాలనుకున్నా నా భర్త ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిండు. నాకు ఐదుగురు ఆడపిల్లలే. నలుగురు పిల్లల పెండ్లీలు చేసినా. స్రవంతి ఐదవ బిడ్డ ఆమె చిన్నప్పటి నుంచి మంచిగ చదువుకుంటుంది. స్రవంతిని డాక్టర్ చదివించాలని నా కోరిక నేను కూలీ పనులు చేసుకుంటు ఆమెను చదివిపిచ్చినా మేము కష్టపడినట్లు నా బిడ్డ కష్టపడవద్దని ఆమెను చదివిపించి డాక్టర్ చేయాలని అనుకున్న. స్రవంతి డాక్టర్ అయితందని అందరు అంటురు. నాకు ఆనందంగా ఉంది. – బుచ్చక్క, స్రవంతి తల్లి, చంద్రపల్లి పేదలకు వైద్యం అందిస్తా సరైన వైద్యం అందక మా నాన్న చనిపోయినట్లు ఊర్లో అందరూ అనేవారు. అప్పటి నుంచే డాక్టర్ కావాలని అనుకున్న. కష్టపడి చదివితే సాధించవచ్చని అనుకుని నీట్ మొదటి సారి రాస్తే ర్యాంక్ రాలేదు. అయినా బాధపడకుండా రెండో సారి కోచింగ్ తీసుకుని ప్రయత్నం చేయగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. నాన్న లేకపోయినా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నిరుపేదలకు వైద్యం అందిస్తా. – స్రవంతి, చంద్రపల్లి -
సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మెచ్చుకున్నారు. గిరిజనులపై సీఎం వైఎస్ జగన్‌కి ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధిని ఆయన కొనియాడారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఏపీ ప్రభుత్వం గిరిజనుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించేందుకు పార్లమెంట్ సమావేశాల తర్వాత ఏపీకి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించగా.. త్వరలోనే రాష్ట్రానికి వస్తానని కేంద్ర మంత్రి అర్జున్ ముండా చెప్పారని రవిబాబు మీడియాతో చెప్పారు. ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని, గిరిజన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, గిరిజన ఆరోగ్యం, విద్య, నిరుద్యోగ నిర్మూలన వంటి కార్యక్రమాలను రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,31,420 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసిందని, గిరిజన ఉప ప్రణాళిక కింద 2020–21కి రూ.5,177 కోట్లు కేటాయించిందని, విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పాడేరులో వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాల, ప్రతి ఐటీడీఏ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర సంస్థలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి వివరించినట్టు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, పునరావాస చర్యలనూ కేంద్ర మంత్రికి వివరించినట్లు రవిబాబు వెల్లడించారు. -
అభివృద్ధే అంతిమ లక్ష్యం!
సిద్ధాంతం ప్రకారం గిరిజనాభివృద్ధి సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతో పాలనపై దృష్టి వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ ఐటీడీఏ పీవో జ ల్లేపల్లి వెంకటరావు ప్రశ్న: డిప్యూటీ తహశీల్దార్ నుంచి పీఓగా వివిధ స్థాయిల్లో ఉద్యోగ బాధ్యతల్లో అనుభవాలు ఏమిటి? జవాబు: 1996లో పాలకొండ తహ శీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా అటుపై ఎలక్షన్ అధికారిగా, రాజాం, సంతకవిటి, పాతపట్నం, వంగర తహశీల్దార్‌గా, జిల్లా కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పని చేశారు. అనంతరం విశాఖ జిల్లా పాడేరు డిప్యూటీ కలెక్టర్‌గా చేసి విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురంలో ఆర్డీఓగా రెండు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించాను. ఈ అనుభవం ఐటీడీఏ అభివృద్ధికి దోహదపడుతోందన్న నమ్మకం ఉంది. పీఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక్కడి స్థితిగతులను ఎలా అర్థం చేసుకున్నారు? గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన అనుభ వంతో పీఓగా పూర్తిబాధ్యతలతో సీతంపేట సబ్‌ప్లాన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో దశలవారీగా పర్యటిస్తున్నాను. గిరిజనుల సమస్యలను నేరుగా అధ్యయనం చేస్తున్నాను. తెలుసుకున్న, తెలుసుకోవాల్సిన అన్ని స్థితిగతులను స్వయంగా పర్యవేక్షిస్తాను. అటుపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సింది ఎంతో ఉందని గుర్తించాను. ప్రస్తుత ఎపిడమిక్ సీజన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలేమిటి? ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని అంశాలపై దృష్టిసారించదలిచా. అందులో ప్రధానమైనది గిరిజనుల ఆరోగ్యం. అందులో భాగంగానే గత అనుభవాలను నెమరవేసుకుని ఈ సీజన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాం. ఐటీడీఏ పరిధిలో గల 926 పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 900 పంచాయతీల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా మలాథియాన్ స్ప్రేయింగ్ చేయించాం. విద్యార్థులకు దోమతెరలు అందిస్తున్నాం. దోమలు వృద్ధి చెందకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏటా ఇవన్నీ జరుగుతున్నా.. గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? ఐటీడీఏ పరిధిలోని వైద్యాధికారులతో సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తాం. సీజన్ పూర్తయ్యేవరకు వైద్యశిబిరాలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వనున్నాం. ప్రతి గిరిజనుడి ఆరోగ్యంపై దృష్టిసారించేలా కార్యచరణ రూపొందించాం. సీతంపేట క్లస్టర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 21న సీతంపేటలో వైద్యసిబ్బందితో సదస్సు, 22న మెళియాపుట్టి, పాతపట్నం, టెక్కలి వైద్యసిబ్బంది, మలేరియా సిబ్బంది, ఎంపీడీవో సంయుక్తంగా పలాసలో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటాం. నాన్‌షెడ్యూల్డ్ ఏరియాను షెడ్యూల్డ్‌లో కలపాలన్న ప్రతిపాదనపై మీ స్పందన? ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే దృష్టిసారిస్తాం. ఏజెన్సీ ప్రజలకు ఏనుగులు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిపై మీ చర్యలు? ఏనుగుల ద్వారా నష్టపోయిన వారికి సకాలంలో పరిహారం అందేలా చూస్తున్నాం. ఏజెన్సీలో ఏనుగులు సంచరించేందుకు కొంత ప్రదేశాన్ని కేటాయించేలా అటవీశాఖాధికారులతో కలిసి సంయుక్తంగా చర్యలు చేపడతాం. గిరిజన విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు? ఐటీడీఏ పరిధిలో గురుకులాలు, ఆశ్రమ, పోస్టుమెట్రిక్, వసతిగృహాలతో పాటు అన్ని పాఠశాలల సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తాం. మెనూ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడుకి 100 రోజుల సమయం కేటాయిస్తాం. రక్షిత నీరు, రహదారులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఎలా పరిష్కరిస్తారు? క్షేత్ర పర్యటనలో భాగంగా ఈ సమస్యను గుర్తించాం. అన్ని గిరిజన గ్రామాలకు సురక్షితమైన నీటిని అందించేందుకు సంబంధిత శాఖ అధికారులతో చర్చనున్నాం. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాలపై దృష్టిసారించాం. ఇంజనీరింగ్ అధికారులతో మమేకమై పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తాం. గిరిజన దర్బార్ నిర్వహణపై మీ అభిప్రాయం? గిరిజన దర్భార్‌లో వచ్చిన సమస్యలు మరోసారి పునరావృతం కాకుండా, అర్జీదారులకు కాలయాపన లేకుండా వచ్చిన అర్జీలను 15 రోజుల్లో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. సవరభాష, సంస్కృతి ప్రాచుర్యం పెంచేందుకు వారి సంఘ నేతలతో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రతిపక్ష నేతలను, ప్రజాప్రతినిధులను అధికారిక సమావేశాలకు పిలవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారు? ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అమలు ప్రజాప్రతినిధుల సమక్షంలోనే చేపడతాం. రాజకీయాలకు అతీతంగా గిరిజన అభివృద్ధిపై అన్ని పార్టీల సహకారాన్ని, సూచనలను పాటిస్తాం. -
మేడారంపై గిరిజన శాఖ నిర్లక్ష్యం
సాక్షిప్రతినిధి, వరంగల్: గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విషయంలో గిరిజన సంక్షేమ శాఖ దారుణంగా వ్యవహరిస్తోంది. మేడారం పరిసరాల్లో మెరుగైన ఏర్పాట్లు చేసి జాతర గొప్పదనాన్ని అందరికీ తెలిసేలా చేయాల్సిన ఆ శాఖకు.. కనీసం సాధారణ పనులు చేసేందుకు చేతులు రావడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లలో తన వంతుగా చేపట్టే పనులకు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) రూ.10 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. కోటి మంది భక్తులు వచ్చే జాతరకు రూ.10 కోట్లు అంటే.. కచ్చితంగా మంజూరవుతాయని ఐటీడీఏ భావించింది. కానీ, ఐటీడీఏ కోరిన నిధుల్లో 50 శాతమే మంజూరయ్యే పరిస్థితి ఉందని గిరిజన శాఖ చెప్పి ప్రణాళిక ఖర్చును రూ.5.80 కోట్లకు తగ్గించింది. దీంట్లో రూ.4.99 కోట్లు రోడ్ల అభివృద్ధికి, రూ.1.56 కోట్లు తాగునీటి సరఫరా పనులకు కేటాయించింది. నిధులను తగ్గించిన ఆ శాఖ.. మంజూరు విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తోంది. జాతర దగ్గరపడుతున్నా ఇప్పటికి కేవలం రూ.1.42 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మేడారంలోని గిరిజన గురుకుల కళాశాల నుంచి వనం రోడ్డు వరకు 600 మీటర్ల బీటీ రోడ్డు వేసేందుకు రూ.42 లక్షలు, ఊరట్టం కాజ్వే నుంచి గ్రామానికి 800 మీటర్ల సీసీ రోడ్డుకు రూ.52 లక్షలు చొప్పున ప్రణాళికలో పెట్టారు. చిలుకలగుట్టకు వెళ్లే 800 మీటర్ల సీసీ రోడ్డు వెడల్పునకు రూ.48.50 లక్షలు, దొడ్ల నుంచి కొండాయి బ్రిడ్జి వరకు 1.5 కిలో మీటర్ల బీటీ రోడ్డుకు రూ.1.10 కోట్లు, ఆర్అం డ్బీ పరిధిలోని మేడారం నుంచి చిలుకలగుట్ట కు ఉన్న 1.50 కిలో మీటర్ల రోడ్డుకు రూ.1.20 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. అలా గే మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌజ్ మరమతులకు రూ.6 లక్షలు, కాటేజీకి రూ.4 లక్షలు, క్యాంప్ ఆఫీసుకు రూ.3 లక్షల వెచ్చించాలని నిర్ణయించారు. అరుుతే గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల రాకపోవడంతో ఈ పనులు ముందుకుసాగడంలేదు. మేడారం జాతరలో కీలకంగా వ్యవహరించే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సర్పరాజ్ నెల రోజులుగా సెలవులో ఉ న్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవ య్య ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగం అధికారి సైతం ప్రస్తుతం సెలవులోనే ఉన్నారు. పూర్తి స్థాయి అధికారులు లేకపోవడంతో ఐటీడీఏ పనుల పర్యవేక్షణ జరగడంలేదు.