వైద్యుల నిర్లక్ష్యంతో వివాహిత మృతి
పాల్వంచ రూరల్(ఖమ్మం): విషజ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన వివాహితకు ఆస్పత్రిలో సరైన వైద్యం అందించకపోవడంతో.. ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆమె మృతికి ఆస్పత్రి వర్గాలే బాధ్యత వహించాలని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ రూరల్ మండలం మామిడిగూడెంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సురేష్(25), అనూష(22) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో అనూష అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. చికిత్స నిమిత్తం ఉల్వనూరులోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. నర్సులే ఆమెకు వైద్యం అందించారు. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించడంతో.. కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. దీంతో అనూష మృతికి ఉల్వనూరు ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని ఆందోళ నకు దిగారు.