కొండను ఢీకొన్న విమానం
* 54 మంది మృతి
* ఇండోనేసియాలో దుర్ఘటన
* శకలాలు లభ్యం
జకార్తా: ఇండోనేసియా వైమానిక చరిత్రలో మరో దుర్ఘటన! తూర్పు ఇండోనేసియాలోని పపువా ప్రాంత రాజధాని జయపుర నుంచి 49 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ఆదివారం ఓకిస్‌బిల్ నగరానికి బయలుదేరిన ట్రిగనా ఎయిర్‌లైన్స్ విమానం గమ్యానికి కొద్దిదూరంలోనే కొండను ఢీకొట్టి కూలిపోయింది. విమానంలోని మొత్తం 54 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదం జరిగిందని, విమాన శకలాలను ఓక్‌బపే జిల్లాలోని ఓ గ్రామస్తులు కనుగొన్నారని అధికారులు వెల్లడించారు. 45 నిమిషాల్లో గమ్యానికి చేరుకోవాల్సిన విమానం ప్రతికూల వాతావరణంలో చిక్కుకొని చివరి 9 నిమిషాల ప్రయాణ సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. విమానాన్ని ల్యాండ్ చేసేందుకు వీలుగా ఎత్తు తగ్గించుకునేందుకు అనుమతివ్వాలంటూ పైలట్ నుంచి చివరిసారిగా ఏటీసీకి విజ్ఞప్తి అందింది.
విమానం ఓ కొండను ఢీకొని కుప్పకూలినట్లు బింటాంగ్ జిల్లాలోని ఓక్‌బపే గ్రామస్తులు చెప్పారు. ప్రమాదానికి ముందు విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగిరిందన్నారు. దీంతో సహాయ సిబ్బంది గాలింపునకు బయలుదేరారు. అడవి, కొండలు, ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపును మధ్యలోనే నిలిపేసి సోమవారం తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. శకలాల గుర్తింపునకు మరో విమానాన్ని ఆ ప్రాంతానికి పంపినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా అదీ వెనక్కి వచ్చేసింది. దుర్ఘటనకు ముందు పైలట్ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు అందలేదని ప్రభుత్వం తెలిపింది.
ఓకిస్‌బిల్ అడవి మీదుగా విమానం ప్రయాణించే సమయానికిభారీ వర్షం, బలమైన గాలులు, దట్టమైన పొగమంచు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటిదాకా ట్రిగనా ఎయిర్‌కు చెందిన 14 విమానాలు తీవ్ర ప్రమాదాలకు గురయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలను పాటించడంలేదన్న కారణంతో యూరోపియన్ యూనియన్ తమ గగనతలంలో ఈ విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం విధించింది. కాగా, ఆదివారం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ సమీపంలోనూ నమీబియాకు చెందిన ఓ చిన్న వైద్య విమానం కూలిపోయి ఐదుగురు మరణించారు. ఓ రోగి, అతడి కూతురును వైద్య సిబ్బంది తరలిస్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన జరిగింది.