Triple Talaq Ban
-
బహుభార్యత్వంపై విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: ముస్లింలు అనుసరిస్తున్న బహుభార్యత్వం, నిఖా హలాలాకు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై తమ వైఖరి చెప్పాలంటూ కేంద్రం, లా కమిషన్లకు నోటీçసులిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం 2017లో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ బహుభార్యత్వం, నిఖా హలాలాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది. ఈ రెండు అంశాలపై మరో ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది. ఇస్లాం ప్రకారం ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. నిఖా హలాలాను అనుసరించి భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడినే వివాహం చేసుకోరాదు. వేరే వ్యక్తిని పెళ్లాడి అతనితో విడాకులు తీసుకున్నాకే మొదటి భర్తను పెళ్లాడేందుకు అనుమతిస్తారు. వీటిని వ్యతిరేకిస్తూ.. స్త్రీ, పురుషులకు సమన్యాయం కోరుతూ కేసువేశారు. -
ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా : ఎన్డీయే ప్రభుత్వంపై సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ..హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికే ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదని, దానిపై ప్రభుత్వం చట్టం అమలు చేయాలని మాత్రమే కోరిందని వివరించారు. ట్రిపుల్ తలాక్ చెల్లుబాటులో లేనపుడు 3 సంవత్సరాల జైలు శిక్ష ఎలా వేస్తారని ప్రశ్నించారు. కామన్ సివిల్ కోడ్‌ను క్రిమినల్ కోడ్‌గా మార్చడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మతానికి సంబంధించిన పర్సనల్‌లాలో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో అడ్డుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ కానివ్వమని చెప్పారు. -
తలాక్ లాక్.. ఇప్పుడు విడాకులు ఎలా?
సాక్షి, ఆగ్రా: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఆరు నెలలపాటు నిషేధం విధించటంతో ఇస్లాం వివాహ చట్టాల్లో విడాకుల అంశం సుప్తావస్థలో ఉండిపోయింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలను అన్వేషించే పనిలో పడ్డారు ఇస్లాం మత పెద్దలు. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లోని మదరసాలు సరైన పద్ధతిలో విడాకులు తీసుకోవటం ఎలా అన్న అంశం అవగాహన కల్పించేందుకు సిద్ధమైపోయాయి. ‘సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మత పెద్దలతో మదరసాలలో భేటీ అవుతున్నాం. ఆ చర్చా కార్యక్రమాల్లో విద్యార్థులు కూడా పాలు పంచుకుంటున్నారు. సరైన తలాక్ విధానం ఎలా ఉండాలి? అన్న అంశంపై అన్ని చోట్లా సదస్సులు నిర్వహిస్తాం. విడాకులు తీసుకోవటం ఎలా అన్న విధానంపై విద్యార్థుల ద్వారా ముస్లిం పురుషులకు అవగాహనం కల్పిస్తాం. ’ అని సున్ని బరెల్వి వర్గ నేత మౌలానా సుబుదిన్ రజ్వీ తెలిపారు. ప్రస్తుతం విడాకులపై స్పష్టమైన పద్ధతి లేకపోవటంతో కొన్ని సమస్యలు తలెత్తటం సహజం. అయితే మహిళలు పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించకపోవటమే ఉత్తమం అని సుబుదిన్ సూచించారు. ఇక ముస్లిం విడాకుల విధానాన్ని ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని ముఫ్తీ ముద్దాసర్ ఖాన్ అనే మరో మదరసా నిర్వాహకుడు వ్యాఖ్యానించారు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మరోసారి వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో ఈసారి ప్రభుత్వానికే ఆ అంశం వదిలేయటం ఉత్తమమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఆగ్రాలో 200 మదరసాలు ఉండగా, అందులో 150 మదరసాలు అలీఘడ్లోనే ఉన్నాయి. వీటిల్లో ప్రతి శుక్రవారం మీటింగ్‌లు నిర్వహించి విడాకుల విధానంపై ఓ రూపకల్పన చేయనున్నారు. తొలుత మదరసాల్లో వీటిని పాఠ్యాంశాలుగా బోధించిన విద్యార్థుల ద్వారా అవగాహన సదస్సులను నిర్వహిచనున్నారు.