పారిశ్రామికం పరుగులు
ఏడాదిన్నరలో రూ.24,698 కోట్ల పెట్టుబడులు
- విద్యుత్, ఫార్మా రంగాల్లో పెట్టుబడుల వెల్లువ
- రెండోస్థానంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు
- మూడో వంతు పెట్టుబడులు విద్యుత్ రంగంలోనే
- టీఎస్ఐపాస్ కింద 1,798 కంపెనీలకు అనుమతులు
- అందులో ఉత్పత్తులు ప్రారంభించినవి 1,029
-1.11 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం అంచనా
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొలి ప్రయత్నం ఫలించింది. నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకు(ఏడాదిన్నర) రాష్ట్రానికి దాదాపు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు తరలివచ్చా యి. ప్రధానంగా విద్యుత్, ఫార్మా రంగాలకు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేం దుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఐటీ సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు పెట్టుబడుల్లో రెండోస్థానంలో నిలిచాయి. కోత లేకుండా నిరాటంకంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం... కొత్త విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన, విద్యుత్ కొనుగోలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు, సౌర విద్యుత్ ప్లాంట్లు, సంబంధిత పరికరాల తయారీ కంపెనీల స్థాపనకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల మొత్తంలో మూడో వంతు ఈ రంగంలోనే కేంద్రీకృతమవటం గమనార్హం.
విద్యుత్ రంగం ఫస్ట్: విద్యుత్ రంగంలో రూ.8,718 కోట్ల పెట్టుబడులతో 85 కంపెనీలు నెలకొల్పేందుకు అనుమతులు జారీ అయ్యాయి. ఫార్మా పరిశ్రమకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న హైదరాబాద్‌లో మరిన్ని కొత్త కంపెనీల విస్తరణ ఖాయమైంది. ఫార్మా, కెమికల్ రంగంలో రూ.4,022 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 152 కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి ముందుకు వచ్చాయి. ఈ రెండు రంగాల తర్వాత ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల స్థాపనకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపారు. దేశంలోనే పేరొందిన ఐదు ఐటీ కంపెనీలు రూ.2,647 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో తమ కార్యకలాపాల విస్తరణకు ముందుకు వచ్చాయి. వీటితో అత్యధికంగా 22,300 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమెజాన్, కాగ్నిజెంట్, ఓఎన్జీసీ ఐటీ సర్వీసెస్, సిఫీ టెక్నాలజీస్, మహావీర్ డెవెలపర్స్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఈ యూనిట్ల నెలకొల్పేందుకు వివిధ జిల్లాల్లోని పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తు చేసుకున్నారు. ఈ రంగంలో రూ.2,166 కోట్లతో కొత్త యూనిట్ల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందు కొచ్చారు.
ఉత్పత్తులు ప్రారంభించిన 1,029 కంపెనీలు
ఇప్పటివరకు టీఎస్ఐపాస్ సింగిల్ విండో విధానంలో మొత్తం 1,798 కంపెనీలు అనుమతులు పొందాయి. కేవలం 15 రోజుల్లోనే వీటికి అవసరమైన అనుమతులు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని కొత్త పంథాను అమలు చేసింది. వీటిలో ఇప్పటికే 1,029 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. మరో 334 కంపెనీల స్థాపన తుది దశలో ఉందని.. ఒకటీ రెండు నెలల్లోనే అవి ఉత్పత్తి దశకు చేరుకుంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అనుమతులు పొందిన వాటిలో 42 కంపెనీలు ఇప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. 393 కంపెనీలు ఇప్పుడిప్పుడే నిర్మాణ ప్రక్రియ చేపట్టాయి. ఇప్పటివరకు అనుమతి తీసుకున్న కంపెనీల పెట్టుబడుల మొత్తం రూ.24,698 కోట్లకు చేరింది. వీటి ద్వారా 1.11 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అనుమతులు పొందిన వాటిలో అత్యధికంగా 336 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, 212 ఇంజనీరింగ్ కంపెనీలు, 171 ఆగ్రో బేస్డ్ కంపెనీలు, 163 ప్లాస్టిక్, రబ్బర్ కంపెనీలున్నాయి.
రంగారెడ్డిలోనే ఎక్కువ
రాజధానికి దగ్గర ఉండటంతో పాటు ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాల్లోనే పెట్టుబడులకు మొగ్గు చూపారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7,012 కోట్ల విలువైన కంపెనీలు నెలకొల్పనున్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లో రూ.6,462 కోట్ల విలువైన కంపెనీలకు అనుమతులు జారీ అయ్యాయి. వరంగల్ రూ.3,309 కోట్ల పెట్టుబడులతో మూడో స్థానంలో నిలిచింది. ఇంచుమించుగా అదే స్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లా నాలుగో స్థానంలో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ కొత్త కంపెనీల స్థాపనలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.