రూ. 100 కోట్లు.. వెయ్యి ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు చేపట్టిన రెండు వారాల అమెరికా పర్యటన సానుకూలాంశాలతో ప్రారంభమైంది. పర్యటన తొలి రోజులో భాగంగా కేటీఆర్ సోమవారం ఇల్లినాయీస్ రాష్ట్రంలోని షికాగో నగరంలో పలువురు పెట్టుబడిదారులు, సంస్థలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీ టీఎస్ ఐపాస్ ప్రత్యేకతలను వివరించారు. అలాగే ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఉన్న అవకాశాలను వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 100 కోట్లు) పెట్టుబడులు పెట్టడంతోపాటు వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు డిజిటల్ హెల్త్ కేర్ సంస్థ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే రెడ్ బెర్రీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ కాంత్, జెనెసిస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ మోనిఫ్ మాటోక్, సేఫీ హోల్డింగ్స్ సీఈఓ అఫీ హసన్ తదితరులు కేటీఆర్‌తో సమావేశమై పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మీడియాకు ఓ ప్రకటనలో తెలిపింది.
తొలి రోజు బిజీ బిజీగా...
తొలి రోజు పర్యటనలో కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. తొలుత భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయీద్‌తో సమావేశమైన కేటీఆర్.. ఆ తర్వాత ఇల్లినాయీస్ డిప్యూటీ గవర్నర్ ట్రే చిల్డ్రెస్‌తో భేటీ అయ్యారు. ఇల్లినాయీస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నడుమ భాగస్వామ్యానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఫార్మా, ఐటీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. టీ హబ్‌తోపా టు తెలంగాణ ప్రభుత్వ విధానాలను అభినందించిన ట్రే చిల్డ్రెస్.. ఇన్నోవేషన్ రంగంలో పెట్టుబడులకు పలు ఇల్లినాయీస్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తమ రాష్ట్రంలోని షి కాగో నగరంతో తెలంగాణకు.. ముఖ్యంగా హై దరాబాద్ నగరానికి ప్రత్యేక అనుబంధముందన్నారు. పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు.. భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయీద్ విందు ఏర్పాటు చేసి జ్ఞాపికను అందజేశారు.
ఇండియానా గవర్నర్‌తో కేటీఆర్ భేటీ
షికాగో నుంచి ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానాపోలిస్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్ తో సమావేశమయ్యారు. అనంతరం ఇండియానాపోలిస్-హైదరాబాద్ సిస్టర్ సిటీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ర్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారికి వివరించారు. ఇండియానాపోలిస్‌తో రాష్ట్రానికున్న సాంస్కృతిక, వ్యాపార సంబంధాలపై మంత్రి ప్రసంగించారు. తొలి రోజు పర్యటనలో మంత్రి వెంట పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఉన్నారు.