సహాయక కోచ్‌గా రాణీ రాంపాల్
న్యూఢిల్లీ : జాతీయ మహిళల హాకీ జట్టు ఫార్వర్డ్ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌ను భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) సహాయక కోచ్‌గా నియమించనున్నారు. కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్న రాణీ సేవలను మరింతగా ఉపయోగించుకోవాలనే భావనలో సాయ్ ఉంది. దీనికి తగ్గట్టుగా తమ నియామక నిబంధనలను సడలించి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. 2010 ప్రపంచకప్‌లో కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తను భారత జట్టులో చోటు దక్కించుకుని వార్తల్లోకెక్కింది. అదే ఏడాది ఎఫ్ఐహెచ్ మహిళల యువ క్రీడాకారిణి అవార్డు కోసం నామినేట్ అయిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది.
‘ప్రస్తుత తరంలో రాణీ రాంపాల్ అత్యద్భుత క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు. ఇటీవలి వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఒలింపిక్ బెర్త్ దక్కించుకోవడంలోనూ కీలక పాత్ర పోషించింది. వర్ధమాన క్రీడాకారులకు తన సేవలు ఉపయోగపడితే మరింత మేలు చేకూరనుంది. అందుకే ఆమెకు ఈ పదవిని ఆఫర్ చేశాం’ అని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. శిక్షణ శిబిరాలు, టోర్నీలు లేని రోజుల్లో రాణీ రాంపాల్ ఈ బాధ్యతను తీసుకోనుంది.