విజేతలు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. వివరాలను సీసీఎల్ఏ వెబ్సైట్లో ఉంచారు. వీఆర్వో పరీక్షల్లో మండల కేంద్రమైన చెన్నూరుకు చెందిన టి.వెంకట సుధాకర్ అనే అభ్యర్థి (హాల్ టిక్కెట్ నెం.111107772) జిల్లా టాపర్‌గా నిలిచారు.
బీసీ-బి కేటగిరికి చెందిన ఆయన 97 మార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచారు. ఇక ఓసీ కేటగిరిలో వేముల మండలం గొల్లలగూడూరు గ్రామానికి చెందిన వైఎన్ హరినాథరెడ్డి (హాల్ టిక్కెట్ నెం. 111109961) అనే అభ్యర్థి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆయన 97 మార్కులు సాధించారు. జిల్లాలో 27 వీఆర్వో ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఓసీ జనరల్‌కు 4, ఓసీ మహిళకు 3, ఓసీ మాజీ సైనికులకు చెందిన మహిళకు 1 కేటాయించారు.
ఇక ఎస్సీ జనరల్‌కు 3, ఎస్సీ మహిళకు 2, ఎస్టీ జనరల్‌కు 2, ఎస్టీ మహిళకు 1, బీసీ గ్రూప్-ఏ జనరల్‌కు 2, బీసీ-బీ జనరల్‌కు 3, మహిళకు 1, బీసీ-డి జనరల్‌కు 2, మహిళకు 1, బీసీ-ఇ జనరల్‌కు 2 పోస్టులు కేటాయించారు. పరీక్షల్లో సాధించిన మార్కులను బట్టి రోస్టర్ ప్రకారం ఆయా వర్గాలకు ఉద్యోగాలను కేటాయించనున్నారు. ఈనెల 2వ తేదీన నిర్వహించిన పరీక్షలకు 24,981 మంది (87.16 శాతం) హాజరయ్యారు. అదేరోజు జిల్లాలోని 128 వీఆర్ఏ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 1119 మంది (90.24 శాతం) హాజరయ్యారు. మహిళల కంటే పురుషులే ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు తెలుస్తోంది.
గ్రూప్సే లక్ష్యం..
గ్రూప్స్ బాగా రాసి మంచి పోస్ట్ సాధించడమే నా లక్ష్యం. రోజులో ఎక్కువ సమయం చదివేందుకే కేటాయిస్తున్నా.. వీఆర్వో పోస్టులో చేరి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తా.
- వెంకటసుధాకర్, చెన్నూరు
గ్రామీణులకు సేవ చేస్తా..
ఇంజనీరింగ్ చదివినా.. గ్రామీణులకు సేవ చేయాలన్నదే నా కోరిక.. మంచి ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో గ్రూప్-1 సాధిస్తా.
-హరినాథరెడ్డి, గొల్లలగూడూరు