నేటి నుంచి కీసర బ్రహ్మోత్సవాలు
పూర్తయిన ఏర్పాట్లు
వచ్చేనెల 2వ తేదీ వరకు జాతర
కీసర, న్యూస్‌లైన్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కీసరగుట్ట దేవాలయంలో మంగళవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, ఆచార్య పుల్లేటీకుర్తి గణపతిశర్మ ప్రధాన సంధానకర్తగా వైదిక కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం ఉదయం 11గంటలకు ఆలయ చైర్మన్ తటాకం రమేష్‌శర్మ దంపతులచే విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విక్పరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్ఠాపనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతిరాగాలాపన, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం, పరాకస్తవం, రాత్రి 8 గంటలకు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి స్వామివారి ఊరేగింపు ఉంటాయి.
పకడ్బందీ ఏర్పాట్లు..
కీసరగుట్ట జాతరకు ఆరులక్షలమంది యాత్రికులు వస్తారని అధికారులు, ఆలయ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. జాయింట్ కలెక్టర్ చంపాలాల్ ఆధ్వర్యంలో జాతర కోఆర్డినేషన్ కమిటీ సోమవారం సాయంత్రం మరోసారి జాతర ఏర్పాట్లను సమీక్షించింది. మహాశివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
వీవీఐపీ పాస్‌లు లేవు..
ఈ ఏడాది జాతరలో వీవీఐపీ పాస్‌ల విధానాన్ని ఉపసంహరించారు. ఈ పాస్‌ల జారీపై ఆలయ చైర్మన్, జిల్లా అధికారులు ఎన్నోసార్లు చర్చించి చివరికి పాస్‌లు ఇవ్వరాదని నిర్ణయించారు. దర్శనానికి వచ్చే ముఖ్యులను రిసెప్షన్ కమిటీ ద్వారా వీవీఐపీ ప్రత్యేక గేటు ద్వారా పంపనున్నారు. రూ.250, రూ.100 ప్రత్యేక దర్శనాలతో పాటు అభిషేక భక్తులకు అదనంగా మరో క్యూలైన్ ఏర్పాటు చేశారు.
భక్తులకు లోటు రాకుండా చర్యలు ..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి దర్శనం కోసం కీసరగుట్టకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆలయ చైర్మన్ తటాకం రమేష్‌శర్మ తెలిపారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కలిగేలా ప్రధానంగా దృష్టి సారించామన్నారు.