టీవీ ఆర్టిస్టుల బైక్ ర్యాలీ
పాల్గొన్న మేయర్ నన్నపునేని, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కార్పొరేటర్లు
హరితహారం గ్రీన్‌ఫండ్ కోసం రూ.3,78,116 విరాళాల సేకరణ
హన్మకొండ : హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుల్లితెర కళాకారులతో కలిసి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 50వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీని కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి క్రాస్ రోడ్డు వద్ద గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. టీవీ ఆర్టిస్టులు విజయ్, లోహిత్, అభినవ్ సర్దార్, మున్నా ఫేం శ్రీధర్‌రావు, సై ఫేం షైన్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నేహనగర్‌లోని వంద ఫీట్ల రోడ్డులో మొక్కలు నాటి, హరితహారం గ్రీన్‌ఫండ్ కోసం విరాళాలు సేకరించారు. అనంతరం కాలనీలో నిర్వహించిన సమావేశంలో మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. గ్రీన్‌ఫండ్ కోసం కళాకారుడు హైదరాబాద్ తల్వార్ రూ.51వేలు విరాళంగా ప్రకటించారు. కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన పది నెలల జీతాన్ని గ్రీన్‌ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. స్నేహనగర్ అభివృద్ధి కమిటీ రూ.లక్ష, తెలంగాణ జాగృతి మహిళా విభాగం అర్బన్ కన్వీనర్ అనితారెడ్డి రూ.లక్ష, రాజిరెడ్డి, బాలగౌడ్ కలిసి రూ.51 వేలు, రిటైర్డ్ టీచర్ వెంకటేశ్వర్లు రూ.11 వేలు, వెంకన్న రూ.5,116 విరాళాలుగా అందించారు. మెుత్తంగా రూ.3,78,116 విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు నక్క లింగయ్య, ఆకుల మధుకర్, సతీష్, పులి సారంగపాణి, మనోహర్‌రావు, పాకనాటి మోహన్‌రెడ్డి, రాంప్రసాద్, కోగిల మహేష్, నర్సింగరావు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.