tv cabinet
-
టీవీ రేట్లకు రెక్కలు..!!
న్యూఢిల్లీ: టీవీలకు కూడా కరోనా వైరస్ (కోవిడ్–19) సెగ తగలనుంది. టీవీల్లో కీలకమైన ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానళ్ల సరఫరా తగ్గి, కొరత పెరిగిపోతుండటంతో మార్చి నుంచి రేట్లు 10 శాతం దాకా ఎగియనున్నాయి. ప్రధానమైన ఈ భాగాన్ని దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. టీవీ యూనిట్ రేటులో దాదాపు 60 శాతం భాగం టీవీ ప్యానళ్లదే ఉంటుంది. చైనా కొత్త సంవత్సరం సెలవులను దృష్టిలో ఉంచుకుని చాలామటుకు కంపెనీలు ముందస్తుగానే వీటిని నిల్వ చేసుకున్నాయి. కానీ ఊహించని విధంగా కరోనా వైరస్ ప్రబలడం, ఉత్పత్తి.. సరఫరా దెబ్బతినడంతో ప్యానళ్ల కొరత ఏర్పడింది. చైనాలో కొన్ని ఫ్యాక్టరీలు తిరిగి తెరుచుకున్నప్పటికీ, అర కొర సిబ్బందితోనే పనిచేస్తున్నాయి. దీంతో ప్యానళ్ల ధరలు దాదాపు 20 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ‘చైనాలో కరోనా వైరస్ సంక్షోభం వల్ల ముడిసరుకులకు భారీ కొరత నెలకొంది. ఓపెన్ సెల్ ప్యానళ్ళ ధరలు ఏకంగా 20 శాతం ఎగిశాయి. దీంతో మార్చి నాటికి టీవీల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి‘ అని ఎస్పీపీఎల్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా చెప్పారు. భారత్‌లో థామ్సన్ టీవీలకు ఈ సంస్థ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ లైసెన్సీగా వ్యవహరిస్తోంది. టీవీ ప్యానళ్ల కొరత కారణంగా టీవీల రేట్లూ పెరగవచ్చని పానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ‘పరిస్థితి మెరుగుపడితే ఏప్రిల్ నుంచి రేట్లు స్థిరంగానైనా ఉండవచ్చు లేదా ఇదే ధోరణి కొనసాగితే 3–5% దాకా పెరగవచ్చు‘ అని చెప్పారు. ఫ్రిజ్‌లు.. ఏసీలు కూడా.. రాబోయే వారాల్లో ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు కూడా పెరుగుతాయని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా చెప్పారు. ‘మార్చి ప్రారంభం నుంచి టీవీల రేట్లు పెరుగుతాయి. ఆ తర్వాత ఫ్రిజ్‌లు, ఏసీల ధరలూ పెరుగుతాయి. డీప్ ఫ్రీజర్ల రేట్లు ఇప్పటికే 2.5 శాతం పెరిగాయి‘ అని ఆయన చెప్పారు. చాలా కంపెనీలు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు అవసరమైన కంప్రెసర్లను ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. మరో 3 నెలల్లో సాధారణ స్థాయికి... ఉత్పత్తి, సరఫరా మళ్లీ సాధారణ స్థాయికి రావాలంటే కనీసం ఒక త్రైమాసికమైనా పడుతుందని మార్వా వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ఫ్రాస్ట్ అండ్ సలివాన్, పరిశ్రమ సమాఖ్య సీఈఏఎంఏ అధ్యయనం ప్రకారం.. 2018–19లో 1.75 కోట్ల యూనిట్లుగా ఉన్న టీవీ మార్కెట్ 2024–25 నాటికి 2.84 కోట్లకు చేరగలదని అంచనా. టీవీలో కీలకమైన ఓపెన్ సెల్ ప్యానల్, చిప్స్ ప్రధానంగా చైనాతో పాటు తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి మార్కెట్ల నుంచి దిగుమతవుతున్నాయి. భారత్‌లో అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. దేశీ తయారీని ప్రోత్సహించేందుకు, టీవీల ఖరీదును తగ్గించేందుకు ఓపెన్ సెల్ ప్యానళ్లపై కేంద్రం దిగుమతి సుంకాలను తొలగించిందని నివేదిక వివరించింది. -
హాథ్‌వేపై రిలయన్స్ కన్ను
ముంబై: గిగాఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ క్రమంలో.. ఇతర కంపెనీల కొనుగోళ్లపైనా దృష్టి పెట్టింది. తాజాగా దేశీయంగా అతి పెద్ద కేబుల్ ఆపరేటర్ హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సం బంధించి చర్చలు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డీల్ పూర్తిగా కుదురుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించాయి. అయితే, రిలయన్స్ మాత్రం హాథ్‌వేను కచ్చితంగా దక్కించుకోవాలనే భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. సుమారు రూ. 2,500 కోట్ల మేర వ్యాల్యుయేషన్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో డెన్ కొనుగోలుకు యత్నం .. కేబుల్ టీవీ రంగానికి చెందిన సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సమీర్ మన్‌చందా ప్రమోటరుగా ఉన్న డెన్ నెట్‌వర్క్స్‌ను కొనేందుకు ప్రయత్నించింది. చర్చలు తుది దశ దాకా కూడా జరిగాయి. కానీ ఆ డీల్ కుదరలేదు. దీంతో.. తమ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కింద తమ గిగాఫైబర్ ప్రాజెక్టును సొంతంగానే ప్రారంభించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఏదైనా భారీ మల్టీ–సిస్టమ్ ఆపరేటర్ (ఎంఎస్‌వో)తో పాటు కొన్ని చిన్న సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా త్వరితగతిన కార్యకలాపాలు విస్తరించాలన్నది కంపెనీ వ్యూహం. వాటికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుని వీడియో, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. కానీ కీలకమైన మార్కెట్లలో స్థానిక కేబుల్ ఆపరేటర్స్ (ఎల్సీవో) నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుండటంతో .. యూజర్ల ఇళ్ల దాకా కనెక్టివిటీని విస్తరించే విషయంలో రిలయన్స్ జియోకి సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో గిగాఫైబర్ ప్రాజెక్టు ప్రవేశపెట్టడంలో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేయాలన్న ప్రణాళికను కంపెనీ మళ్లీ పరిశీలించడం ప్రారంభించినట్లు సంబంధిత వ్యక్తి తెలిపారు. ఒకవేళ హాథ్‌వేని గానీ చేజిక్కించుకోగలిగితే జియో బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలకు గట్టి ఊతమే లభించగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ‘ఆర్‌ఐఎల్‌కి ఇప్పటికే ఎంఎస్‌వో లైసెన్సు ఉండటంతో పాటు ఫైబర్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించింది. ఇక కావాల్సినదల్లా స్థానిక కేబుల్ ఆపరేటర్ల మద్దతు మాత్రమే. ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేసిందంటే చాలు ఈ సమస్య పరిష్కారమైనట్లే‘ అని ప్రముఖ బ్రోకరేజి సంస్థ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హాథ్‌వే కథ ఇదీ .. కేబుల్ బ్రాడ్‌బ్యాండ్, కేబుల్ టీవీ సర్వీసులు అందిస్తున్న హాథ్‌వే కేబుల్‌లో ప్రమోటరు రహేజా గ్రూప్‌నకు 43.48 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ దాదాపు 1.1 కోట్ల డిజిటల్ కేబుల్ టీవీ కనెక్షన్లతో పాటు 8 లక్షల బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. జూన్ త్రైమాసికం గణాంకాల ప్రకారం హాథ్‌వే బ్రాడ్‌బ్యాండ్ ప్రతి యూజరుపై సగటున నెలకు (ఏఆర్పీయూ) రూ. 710 ఆదాయం ఉంటోంది. మార్చి ఆఖరు నాటికి సంస్థకు రూ. 1,617 కోట్ల రుణభారం ఉండగా.. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 500 కోట్ల మేర తగ్గించుకోవాలని భావిస్తోంది. రాబోయే ఏడాదిన్నర కాలంలో హాథ్‌వే ప్రమోటర్లు.. ఈక్విటీతో పాటు దీర్ఘకాలిక అన్సెక్యూర్డ్ రుణాల రూపంలో రూ. 350 కోట్లు సమకూరుస్తున్నారు. ఇప్పటికే జూలైలో తొలి విడతగా రూ. 100 కోట్లు ఇవ్వగా, మరో రూ. 100 కోట్లు ఆగస్టు ఆఖరు నాటికి ఇవ్వనున్నట్లు గతంలో కంపెనీ వర్గాలు తెలిపాయి. మరో రూ. 150 కోట్లు 2020 మార్చి నాటికి లభించనున్నాయి. రాబోయే రోజుల్లో కార్యకలాపాల ద్వారా మరో రూ. 150 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.డీల్ వార్తల నేపథ్యంలో బుధవారం హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ షేరు బీఎస్ఈలో సుమారు 9 శాతం పెరిగి రూ. 27.60 వద్ద క్లోజయ్యింది. -
మీ టీవీ... మరింత ఠీవిగా!
సాక్షి, హైదరాబాద్: ఏ ఇంట్లోకి ప్రవేశించినా ప్రతి ఒక్కరి చూపు పడేది టీవీ క్యాబినెట్ మీదే. అందుకే టీవీ ఏదైనప్పటికీ గోడకు బిగించారా? లేక ప్రత్యేకంగా డిజైన్ చేయించారా అని గమనించేవారు బోలెడంతమంది. దీంతో చాలామంది టీవీ యూనిట్‌ను ఆధునికంగా తీర్చిదిద్దడం మీదే దృష్టి సారిస్తున్నారు. మరి, ఇందుక్కావల్సిన ప్రణాళికలేమిటి? దీనికెంత ఖర్చవుతుంది? టీవీ యూనిట్‌ను ఇంట్లోని ఏ ప్రాంతంలో బిగించాలనే విషయంలో గృహ యజమానులకు కొంత స్పష్టత ఉండాలి. ఇంట్లో వేసే ఫర్నిచర్‌కు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. టీవీ ఒకవైపు, ఫర్నిచర్ మరోవైపు ఉండకూడదు. అందరూ సులువుగా టీవీ చూసేలా జాగ్రత్తపడాలి. కొందరేం చేస్తారంటే ఖాళీ గోడ కన్పిస్తే చాలు అక్కడ టీవీ యూనిట్‌ను పెట్టమంటారు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు. టీవీ యూనిట్‌కు వైరింగ్ జాగ్రత్తగా చేయించాలి. ఎంత ఖరీదైన టీవీకొన్నా క్యాబినెట్ చేయించినా బయటికి వైర్లు వేలాడుతుంటే ఇబ్బందే. డీటీహెచ్, డీవీడీ ప్లేయర్, ఏసీ, టీవీలకు సంబంధించి వైరు, రిమోట్లు ఎక్కువే ఉంటాయి. ఇవి బయటికి కన్పించకుండా చూసుకోవాలి. టీవీ వెనకా ఒకటిన్నర అంగుళాల మందం గల పైపు ఏర్పాటు చేసి అందులో నుంచి డీవీడీ, డీటీహెచ్‌లకు కనెక్షన్ ఇవ్వాలి. టీవీకి స్పీకర్లు బిగించేవారు ఆ వైర్లు కూడా కనిపించకుండా చూసుకోవాలి. యజమాని అభిరుచి మీద టీవీ యూనిట్ ఖర్చు ఆధారపడి ఉంటుంది. తక్కువ కావాలంటే మార్కెట్లో పాతికవేలకూ దొరుకుతుంది. రూ.10 లక్షలు పెట్టి తయారు చేయించుకునే వారూ ఉన్నారు. చాలా మంది ఏంచే స్తారంటే పెద్దగా హంగులకు వెళ్లకుండా గోడకు ముదురు రంగు వేసి దానికో టీవీని బిగించి దాని కింద 3 లేదా 4 అర ల బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఫ్లాట్‌లో నివసించేవారు టీవీ క్యాబినెట్, క్రాకరీ యూనిట్‌ను విడివిడిగా బదులు ఒకేచోట ఏర్పాటు చేసుకుంటే స్థలం కలిసొస్తుంది. ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నవారు ఈ రెండింటినీ ఎదురెదురుగా ఉండేలా డిజైన్ చేయడం కొత్త పోకడగా మారింది. ఫ్లాట్లలో తలుపు ఎత్తు 7 అడుగుల దాకా ఉంటుంది. కాబట్టి దీనికి సరిపడేలా ఎత్తులో టీవీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 7్ఠ8 అడుగుల సైజులో దీన్ని రూపొందిస్తే సుమారు రూ. 60 వేల దాకా ఖర్చవుతుంది. అలంకరణ వస్తువులపై ఎల్ఈడీ, స్పాట్ లైట్లు పెట్టుకోవచ్చు.