మీ టీవీ... మరింత ఠీవిగా!
సాక్షి, హైదరాబాద్: ఏ ఇంట్లోకి ప్రవేశించినా ప్రతి ఒక్కరి చూపు పడేది టీవీ క్యాబినెట్ మీదే. అందుకే టీవీ ఏదైనప్పటికీ గోడకు బిగించారా? లేక ప్రత్యేకంగా డిజైన్ చేయించారా అని గమనించేవారు బోలెడంతమంది. దీంతో చాలామంది టీవీ యూనిట్‌ను ఆధునికంగా తీర్చిదిద్దడం మీదే దృష్టి సారిస్తున్నారు. మరి, ఇందుక్కావల్సిన ప్రణాళికలేమిటి? దీనికెంత ఖర్చవుతుంది?
టీవీ యూనిట్‌ను ఇంట్లోని ఏ ప్రాంతంలో బిగించాలనే విషయంలో గృహ యజమానులకు కొంత స్పష్టత ఉండాలి. ఇంట్లో వేసే ఫర్నిచర్‌కు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. టీవీ ఒకవైపు, ఫర్నిచర్ మరోవైపు ఉండకూడదు. అందరూ సులువుగా టీవీ చూసేలా జాగ్రత్తపడాలి. కొందరేం చేస్తారంటే ఖాళీ గోడ కన్పిస్తే చాలు అక్కడ టీవీ యూనిట్‌ను పెట్టమంటారు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు.
- టీవీ యూనిట్‌కు వైరింగ్ జాగ్రత్తగా చేయించాలి. ఎంత ఖరీదైన టీవీకొన్నా క్యాబినెట్ చేయించినా బయటికి వైర్లు వేలాడుతుంటే ఇబ్బందే. డీటీహెచ్, డీవీడీ ప్లేయర్, ఏసీ, టీవీలకు సంబంధించి వైరు, రిమోట్లు ఎక్కువే ఉంటాయి. ఇవి బయటికి కన్పించకుండా చూసుకోవాలి. టీవీ వెనకా ఒకటిన్నర అంగుళాల మందం గల పైపు ఏర్పాటు చేసి అందులో నుంచి డీవీడీ, డీటీహెచ్‌లకు కనెక్షన్ ఇవ్వాలి. టీవీకి స్పీకర్లు బిగించేవారు ఆ వైర్లు కూడా కనిపించకుండా చూసుకోవాలి.
- యజమాని అభిరుచి మీద టీవీ యూనిట్ ఖర్చు ఆధారపడి ఉంటుంది. తక్కువ కావాలంటే మార్కెట్లో పాతికవేలకూ దొరుకుతుంది. రూ.10 లక్షలు పెట్టి తయారు చేయించుకునే వారూ ఉన్నారు. చాలా మంది ఏంచే స్తారంటే పెద్దగా హంగులకు వెళ్లకుండా గోడకు ముదురు రంగు వేసి దానికో టీవీని బిగించి దాని కింద 3 లేదా 4 అర ల బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు.
-
ఫ్లాట్‌లో నివసించేవారు టీవీ క్యాబినెట్, క్రాకరీ యూనిట్‌ను విడివిడిగా బదులు ఒకేచోట ఏర్పాటు చేసుకుంటే స్థలం కలిసొస్తుంది. ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నవారు ఈ రెండింటినీ ఎదురెదురుగా ఉండేలా డిజైన్ చేయడం కొత్త పోకడగా మారింది. ఫ్లాట్లలో తలుపు ఎత్తు 7 అడుగుల దాకా ఉంటుంది. కాబట్టి దీనికి సరిపడేలా ఎత్తులో టీవీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 7్ఠ8 అడుగుల సైజులో దీన్ని రూపొందిస్తే సుమారు రూ. 60 వేల దాకా ఖర్చవుతుంది. అలంకరణ వస్తువులపై ఎల్‌ఈడీ, స్పాట్ లైట్లు పెట్టుకోవచ్చు.