హాథ్‌వేపై రిలయన్స్‌ కన్ను |   Reliance Industries looking to Hathaway | Sakshi
Sakshi News home page

హాథ్‌వేపై రిలయన్స్‌ కన్ను

Published Thu, Oct 4 2018 12:53 AM | Last Updated on Thu, Oct 4 2018 12:53 AM

  Reliance Industries looking to Hathaway - Sakshi

ముంబై: గిగాఫైబర్‌ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ క్రమంలో.. ఇతర కంపెనీల కొనుగోళ్లపైనా దృష్టి పెట్టింది. తాజాగా దేశీయంగా అతి పెద్ద కేబుల్‌ ఆపరేటర్‌ హాథ్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ సంస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సం బంధించి చర్చలు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డీల్‌ పూర్తిగా కుదురుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించాయి. అయితే, రిలయన్స్‌ మాత్రం హాథ్‌వేను కచ్చితంగా దక్కించుకోవాలనే భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. సుమారు రూ. 2,500 కోట్ల మేర వ్యాల్యుయేషన్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 

గతంలో డెన్‌ కొనుగోలుకు యత్నం .. 
కేబుల్‌ టీవీ రంగానికి చెందిన సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సమీర్‌ మన్‌చందా ప్రమోటరుగా ఉన్న డెన్‌ నెట్‌వర్క్స్‌ను కొనేందుకు ప్రయత్నించింది. చర్చలు తుది దశ దాకా కూడా జరిగాయి. కానీ ఆ డీల్‌ కుదరలేదు. దీంతో.. తమ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కింద తమ గిగాఫైబర్‌ ప్రాజెక్టును సొంతంగానే ప్రారంభించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఏదైనా భారీ మల్టీ–సిస్టమ్‌ ఆపరేటర్‌ (ఎంఎస్‌వో)తో పాటు కొన్ని చిన్న సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా త్వరితగతిన కార్యకలాపాలు విస్తరించాలన్నది కంపెనీ వ్యూహం. వాటికి ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించుకుని వీడియో, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. కానీ కీలకమైన మార్కెట్లలో  స్థానిక కేబుల్‌ ఆపరేటర్స్‌ (ఎల్‌సీవో) నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుండటంతో .. యూజర్ల ఇళ్ల దాకా కనెక్టివిటీని విస్తరించే విషయంలో రిలయన్స్‌ జియోకి సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో గిగాఫైబర్‌ ప్రాజెక్టు ప్రవేశపెట్టడంలో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేయాలన్న ప్రణాళికను కంపెనీ మళ్లీ పరిశీలించడం ప్రారంభించినట్లు సంబంధిత వ్యక్తి తెలిపారు. ఒకవేళ హాథ్‌వేని గానీ చేజిక్కించుకోగలిగితే జియో బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళికలకు గట్టి ఊతమే లభించగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ‘ఆర్‌ఐఎల్‌కి ఇప్పటికే ఎంఎస్‌వో లైసెన్సు ఉండటంతో పాటు ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించింది. ఇక కావాల్సినదల్లా స్థానిక కేబుల్‌ ఆపరేటర్ల మద్దతు మాత్రమే. ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేసిందంటే చాలు ఈ సమస్య పరిష్కారమైనట్లే‘ అని ప్రముఖ బ్రోకరేజి సంస్థ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

హాథ్‌వే కథ ఇదీ .. 
కేబుల్‌ బ్రాడ్‌బ్యాండ్, కేబుల్‌ టీవీ సర్వీసులు అందిస్తున్న హాథ్‌వే కేబుల్‌లో ప్రమోటరు రహేజా గ్రూప్‌నకు 43.48 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ దాదాపు 1.1 కోట్ల డిజిటల్‌ కేబుల్‌ టీవీ కనెక్షన్లతో పాటు 8 లక్షల బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. జూన్‌ త్రైమాసికం గణాంకాల ప్రకారం హాథ్‌వే బ్రాడ్‌బ్యాండ్‌ ప్రతి యూజరుపై సగటున నెలకు (ఏఆర్‌పీయూ) రూ. 710 ఆదాయం ఉంటోంది. మార్చి ఆఖరు నాటికి సంస్థకు రూ. 1,617 కోట్ల రుణభారం ఉండగా.. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 500 కోట్ల మేర తగ్గించుకోవాలని భావిస్తోంది. రాబోయే ఏడాదిన్నర కాలంలో హాథ్‌వే ప్రమోటర్లు.. ఈక్విటీతో పాటు దీర్ఘకాలిక అన్‌సెక్యూర్డ్‌ రుణాల రూపంలో రూ. 350 కోట్లు సమకూరుస్తున్నారు. ఇప్పటికే జూలైలో తొలి విడతగా రూ. 100 కోట్లు ఇవ్వగా, మరో రూ. 100 కోట్లు ఆగస్టు ఆఖరు నాటికి ఇవ్వనున్నట్లు గతంలో కంపెనీ వర్గాలు తెలిపాయి. మరో రూ. 150 కోట్లు 2020 మార్చి నాటికి లభించనున్నాయి. రాబోయే రోజుల్లో కార్యకలాపాల ద్వారా మరో రూ. 150 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.డీల్‌ వార్తల నేపథ్యంలో బుధవారం హాథ్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ షేరు బీఎస్‌ఈలో సుమారు 9 శాతం పెరిగి రూ. 27.60 వద్ద క్లోజయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement