పూరీలో కుప్పకూలిన రెండస్థుల భవనం
ఒడిశాలోని పూరీ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున రెండు అంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారి బాలికలు కూడా ఉన్నారని చెప్పారు. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు.
ఆ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు, పురపాలక సంఘం ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఆ భవనంలోని వారంతా నిద్రిస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. దాదాపు శతాబ్దం క్రితం ఆ భవనం నిర్మించారని భావిస్తున్నట్లు వారు వివరించారు. కుప్పకులిన భవనం యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, అలాగే అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు.