UN agency
-
చిన్నారుల ప్రాణం తీసిన దగ్గు మందు..మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఊరట!
69 మంది చిన్నారుల మరణానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ అనుమానం వ్యక్తం చేసిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో పదుల సంఖ్యలో చిన్నారుల మరణాలకు మైడెన్ ఫార్మా తయారు చేసిన డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమానం వ్యక్తంచేసింది. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన దగ్గు మందు సిరప్‌ల నుండి తీసిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలలో టెస్టులు నిర్వహించగా అందులో ఎలాంటి తప్పు లేదని తేలింది. కాబట్టి, తన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వ అనుమతి కోరినట్లు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఈ సందర్భంగా మైడెన్ ఫార్మా మేనేజింగ్ డెరెక్టర్ నరేష్ కుమార్ గోయల్ మాట్లాడుతూ.. భారతీయ నియంత్రణ, న్యాయ వ్యవస్థలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మేం ఎలాంటి తప్పు చేయలేదు. ‘మేం ఇప్పుడు ఫ్యాక్టరీని పునప్రారంభించేలా అధికారులను కోరుతున్నాం. కానీ అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. అనుమతుల కోసం మేం ఇంకా వేచి ఉన్నాం అని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నెలలో 69 మంది పిల్లల మరణాలకు మైడెన్ ఫార్మా కంపెనీ దగ్గు,జలుబు సిరప్లు సంబంధం కలిగి ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక అనుమానం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు హర్యానాలోని సోనేపట్‌లోని మైడెన్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీలో మెడిసిన్ తయారీని నిలిపివేశారు. దగ్గు మందుపై కేంద్రం టెస్టులు నిర్వహించింది. ఈ తరుణంలో డిసెంబర్ 13న ఇండియన్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ వీజీ సోమాని..డబ్ల్యూహెచ్ఓకి లేఖ రాశారు. ఆ లేఖలో మైడెన్ ఉత్పత్తి చేసిన దగ్గు మందులపై టెస్టులు నిర్వహించాం. ఆ నమోనాలు సంస్థ వెల్లడించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్నట్లు కనిపెట్టాం. వాటిలో చిన్న పిల్లలో తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీసే డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాలు నమోనాలు లేవని గుర్తించామని పేర్కొన్నారు. పరీక్షల ఫలితాలను తదుపరి చర్య కోసం నిపుణుల బృందానికి పంపామని డబ్ల్యూహెచ్ఓకి రాసిన లేఖలో సోమాని తెలిపారు. చండీగఢ్‌లోని రాష్ట్ర ప్రభుత్వ రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ ఈ పరీక్షలను నిర్వహించిందని ప్రభుత్వం ముందుగా తెలిపింది. ఆ లేఖపై డబ్ల్యూహెచ్ఓ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు అక్టోబర్‌లో యూఎన్ ఏజెన్సీ మైడెన్ తయారు చేసిన ఉత్పత్తులలో విషపూరితమైన, తీవ్రమైన కిడ్నీలను నాశనం చేసే డైథైలిన్ గ్లైకాల్,ఇథిలీన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించిన విషయం తెలిసిందే. -
ప్రపంచ సంస్థలపై డ్రాగన్ పట్టు
ఒక రాజ్యంపై పట్టు సాధించడం కన్నా, అన్ని రాజ్యాలపై ప్రభావం చూపే సంస్థపై పట్టు సాధిస్తే? సరిగ్గా చైనా ఇదే సూత్రాన్ని అవలంబిస్తోంది. దీనివల్ల తాను ఆడించినట్లు ప్రపంచాన్ని ఆడించవచ్చని చైనా అధినాయకత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర సఫలమయ్యాయని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అదేంటో చూద్దాం! ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థలపై పట్టుకోసం చైనా యత్నిస్తోందని, దీనిద్వారా స్వీయ ప్రయోజనాలు పొందాలని చైనా ఆశిస్తోందని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకొచ్చాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లను ఏవిధంగా చైనా కబ్జా చేసేందుకు యత్నిస్తోందో బ్రిటన్‌కు చెందిన పార్లమెంటరీ ఫారెన్ అఫైర్స్ కమిటీ నివేదిక వివరించగా, పలు ఐరాస ఏజెన్సీల్లో చైనా పౌరులు కీలక స్థానాల్లో ఉన్నట్లు గేట్‌వే హౌస్ నివేదిక తెలిపింది. కీలకమైన స్థానాల్లో పాగా వేయడం, ఇందుకోసం సామ, భేద, దానోపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రపంచ సంస్థలపై చైనా పట్టుజిక్కించుకుంటోందన్న అనుమానాలను ఈ నివేదికలు బలపరుస్తున్నాయి. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ సంస్థల స్థాపక నియమావళికి వ్యతిరేకమే కాక, చైనాకు అవి ఆయుధాలుగా మారతాయనే ఆందోళనలు పెరిగాయి. ఆరింటిపై కన్ను ప్రపంచ దేశాల్లో చాలావాటికి సభ్యత్వాలున్న కీలకమైన అరడజను సంస్థలపై బ్రిటన్‌కు చెందిన 11 మంది ఎంపీలు తయారు చేసిన నివేదిక దృష్టి సారించింది. ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్‌పోల్, అంతర్జాతీయ మానవ హక్కుల హైకమిషనర్ ఆఫీసు(ఓహెచ్సీహెచ్ఆర్)లాంటి ముఖ్యమైన సంస్థల్లో చైనా ప్రాముఖ్యత పెరుగుతున్న తీరును వివరించింది. ఇందుకు పలు ఉదాహరణలు సైతం ఉన్నాయని తెలిపింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)లో నైన్త్ డీజీ కోసం 2019లో జరిగిన ఎన్నికలను నివేదిక ఉదహరించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమకు కామెరూన్ దేశం నుంచి రావాల్సిన 7.8 కోట్ల డాలర్ల అప్పును చైనా మాఫీ చేసింది. అనంతరం నైన్త్ డీజీ పదవికి పోటీ నుంచి కామెరూన్ అభ్యర్థి తప్పుకున్నారు, దీంతో చైనా అభ్యర్థికి ఈ పోస్టు దక్కింది. ప్రస్తుతం ఐరాసకు చెందిన 15 విభాగాల్లో నాలిగింటికి(ఎఫ్ఏఓ, ఐటీయూ, ఐసీఏఓ, ఐడీఓ) చైనావాళ్లే అధిపతులుగా ఉన్నారని, వేరే ఏ దేశానికి చెందిన వారు ఒక్క విభాగానికి మించి అధిపతులుగా లేరని వివరించింది. 2019లో డబ్ల్యూఐపీఓను కూడా చైనా చేజిక్కించుకునేదే కానీ చివరి నిమిషంలో అమెరికా అడ్డంపడింది. డబ్బుతో కొనేస్తుంది కీలక ఆర్గనైజేషన్లను చేజిక్కించుకోవడంలో చైనా ఎక్కువగా నిధులు, ఆర్థిక సాయం మార్గాన్ని ఎంచుకుంటోంది. సాధారణంగా ఇలాంటి సంస్థలకు ఆయా దేశాలు వాటి ఆర్థిక స్థితిని బట్టి నిధులు ఇస్తాయి. ఇదికాకుండా లక్ష్యసాధన కోసం వీటికి వివిధ దేశాలు విరాళాలు ఇస్తుంటాయి. చైనా దీన్ని తనకు అనువుగా మలచుకుంటోందని గేట్‌వే నివేదిక చెబుతోంది. 2010–19 కాలంలో చైనా చేసే స్వచ్ఛంద విరాళాలు 346 శాతం పెరిగాయి. దీంతో ఐరాస సంస్థలు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు నిధులు లభించినట్లవుతుంది, ఎక్కువగా విరాళమిచ్చినందుకు సాధారణంగానే చైనా చెప్పినట్లు ఈ ప్రాజెక్టులు ప్రభావితమవుతుంటాయి. నిజానికి యూఎస్ తదితర దేశాలిచ్చే నిధులతో పోలిస్తే చైనా ఇచ్చేది తక్కువే కానీ తక్కువ ఇచ్చి ఎక్కువ ప్రభావం చూపడం చైనా విధానమని ఒక మాజీ అధికారి వివరించారు. అలాగే కొన్నిమార్లు కొన్ని ఆయాచితంగా కలిసివచ్చి సంస్థలపై చైనా పట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంటాయి. ఉదాహరణకు డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ ప్రభుత్వం నిధులు తగ్గించగానే, ఆపన్న హస్తం చాచినంత ఫోజుకొట్టి చైనా కొంతమేర నిధులిచ్చి పట్టు పెంచుకుంది. బైడెన్ ఈ పరిస్థితిని చక్కదిద్దే పనులు చేపట్టారు కానీ పోయిన పట్టు తిరిగి రాలేదని నిపుణులు తెలిపారు. అలాగే ఇంటర్‌పోల్‌లో చైనా తక్కువ నిధులిచ్చినా ఎక్కువ ప్రభావం చూపే స్థితిలో ఉంది. దీంతో పలు దేశాలకు చెందిన నేరçస్తులపై జారీ చేసే రెడ్‌కార్నర్ నోటీసులను ప్రభావితం చేయగలదని చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌పై సైతం పట్టు పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థల్లో టాప్–3 స్థాయిలో చైనా ఉంది. ఇప్పటికైతే ఈ రెండిటిపై యూఎస్, ఈయూ పట్టు చాలా గట్టిగా ఉందని గేట్‌వే నివేదిక తెలిపింది. పరోక్షంగా కూడా ప్రభావం కొన్ని సంస్థల్లోని కీలక పదవిలో చైనీయులు లేకున్నా, ఇప్పుడున్నవారి ద్వారా చైనా పలు విధాలుగా పరోక్ష లబ్ది పొందుతోందని గేట్‌వే నివేదిక తెలిపింది. ఉదాహరణకు డబ్లు్యహెచ్‌ఓ అధ్యక్షుడైన టెడ్రోస్ చైనీయుడు కాదు. కానీ ఆయన ఎన్నికకు చైనా 2017లో మద్దతిచ్చింది. అంతకుముందు ఆయన ఇథియోపియా మంత్రిగా పనిచేశారు. ఆఫ్రికాకు చెందిన ఈ దేశంలో అత్యధికంగా చైనా పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు ఈ సంస్థకు పదేళ్ల పాటు అధ్యక్షత వహించిన మార్గరెట్ ఛాన్ హాంకాంగ్‌కు చెందినవారు. దీంతో డబ్లు్యహెచ్‌ఓ నుంచి చైనాకు ఎంతగా మద్దతు వస్తుందో అవగతమవుతోందని నివేదికలు తెలిపాయి. కొన్ని సంస్థల్లో పట్టు కోసం కొన్నిదేశాలపై చైనా దౌర్జన్యపూరిత డిప్లమసీ మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపాయి. -
ప్రొఫెసర్‌కు మరణశిక్ష; పాక్‌ను అభ్యర్థించిన ఐరాస
సాక్షి, ఇస్లామాబాద్ : దైవ దూషణ ఆరోపణలపై ప్రొఫెసర్‌కు మరణ శిక్ష విధించడాన్ని ఐరాస మానవ హక్కుల కమిషన్ పాకిస్తాన్‌ను తప్పుపట్టింది. మరణశిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అపహాస్యమైనదిగా పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ప్రొఫెసర్ జునైద్ హఫీజ్‌కు హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, హైకోర్టు న్యాయమూర్తులు హఫీజ్‌ను నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. అసాధారణ కేసులలో మాత్రమే మరణ శిక్ష విధించాలని, లేకపోతే తిరుగులేని సాక్ష్యం అయినా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. హఫీజ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు కనుక శిక్షను అమలు చేయడమంటే ఈ చర్య ఏకపక్ష నిర్ణయంతో పాటు అంతర్జాతీయ చట్టానికి విరుద్దమని వారు తెలిపారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను చట్టబద్ధంగా వినియోగించే వ్యక్తులకు దైవ దూషణ చట్టాలు అడ్డంకిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, హఫీజ్‌ను ఐరాస మత స్వేచ్ఛా కమిషన్ ప్రపంచ బాధితుల జాబితాలో చేర్చింది. 2013లో మహమ్మద్ ప్రవక్తపై ప్రొఫెసర్ జునైద్ హఫీజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మిలిటెంట్ ఇస్లామిస్ట్ పార్టీకి చెందిన విద్యార్థులు ఆరోపించారు. 95 శాతం ముస్లింల జనాభా ఉన్న పాకిస్తాన్లో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే మరణ శిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో ఉదారవాద, లౌకిక అభిప్రాయాలు కలిగిన హఫీజ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అతని తరపు న్యాయవాది ఆరోపించారు. అంతకు ముందు 2014లో హఫీజ్ తరపున వాదించడానికి అంగీకరించిన న్యాయవాది రషీద్ రెహ్మీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ ఘటనలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా నిందితులుగా పేర్కొనలేదు. చదవండి : పాక్ : దైవదూషణ కేసులో ప్రొఫెసర్‌కు మరణశిక్ష -
2012లో 4.5 లక్షల మంది హత్య
ఒక్క ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మంది హత్యకు గురయ్యారా అంటే అవుననే అంటున్నాయి ఐక్యరాజ్యసమితి లెక్కలు. 2012 ఒక ఏడాదిలో 437,000 మంది హత్యకు గురైయ్యారని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని డ్రగ్స్ అండ్ క్రైమ్ లెక్కల విభాగం గురువారం వెల్లడించింది. సర్వే నివేదికను గురువారం విడుదల చేసింది. హత్యల జాబితాలో అమెరికా అగ్రస్థానం అక్రమించగా ఆఫ్రికా ఆ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. ఆసియా, ఐరోపా దేశాలు చివరిస్థానాలలో నిలిచాయని పేర్కొంది. హత్యకు గురైన వారిలో 30 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారని చెప్పింది. హత్యకు గురైన ప్రతి పది మందిలో ఎనిమిది మంది పురుషులు హత్య కావించబడ్డారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గృహ హింస వల్ల15 శాతం మంది మహిళలు చనిపోయారని పేర్కొంది.