పాక్ నుంచి కాపాడండి : బలుచిస్తాన్ వాసులు
న్యూయార్క్ : పాకిస్తాన్లో మానవ హక్కులు మంటగలిసిపోతున్నాయని నినదిస్తూ బలూచిస్తాన్ వాసులు బుధవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బలుచిస్తాన్పై పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న బాంబు దాడులను ఆపాలంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్య్రం కావాలంటూ బలుచిస్తాన్ వాసులు డిమాండ్ చేశారు. బలూచ్ ఫ్రీడం కార్యకర్తలు, మానవహక్కుల కార్యకర్తలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.పాకిస్తాన్లో పశ్చిమ భూభాగంగా ఉన్న ఈ ప్రాంతంపై ఆ ప్రభుత్వం వివక్ష చూపుతూ వారి హక్కులను కాలరాస్తున్న క్రమంలో, బలుచిస్తాన్ వాసులు స్వాతంత్య్ర హక్కుల కోసం గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు.
పాక్ తమపై చేస్తున్న దాడులనుంచి రక్షించాలని వారు కోరుతున్నారు. అంతర్జాతీయ వ్యవహారమని బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నాయకుడు మజ్దాక్ దిల్షాన్ బలూచ్ పేర్కొన్నారు. అరబ్ ప్రపంచం, యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా లాంటి బలమైన దేశాలు, కూటములు బలూచిస్తాన్ విషయంలో పాక్పై ఆంక్షలను విధించాలని దిల్షాన్ కోరుతున్న సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం చేస్తున్న ఈ వివక్షపూర్వక చర్యలపై బలుచిస్తాన్ ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని మోదీ కూడా ప్రకటించారు.