వివాహేతర సంబంధానికి అడ్డు వచ్చాడని..
సాక్షి, తుని(తూర్పు గోదావరి) : వివాహేతర సంబంధానికి తరచూ అడ్డుతగులుతున్నాడన్న అక్కసుతో కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. తండ్రి, ప్రియుడు, ప్రియుడి స్నేహితుడి సహాయంతో భర్త హత్యకు ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేసి చివరికి జైలు పాలైంది. ఆమెకు సహకరించిన వారు కూడా కటకటాల పాలయ్యారు. ఈనెల 17వతేదీ రాత్రి తుని మండలం డి.పోలవరం బస్టాప్‌లో పడుకున్న చిల్లపల్లి అప్పారావు (38) హత్య గ్రామంలో సంచలనం కలిగించింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ కొత్తూరి కిషోర్‌బాబు, రూరల్ ఎస్సై గణేష్ కుమార్ ఇలా వెల్లడించారు. (బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం)
వారి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కలవచర్ల గ్రామానికి చెందిన చల్లపల్లి అప్పారావు(38) ఈనెల 17న హత్యకు గురయ్యాడు. 18న సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యలో పాల్గొన్న వంకల చినగవరయ్య(గున్నయ్య) బుధవారం గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోగా, అతడిని విచారించగా హత్యతో సంబంధం ఉన్న చినగవరయ్య, చల్లపల్లి వేణు, వనశెట్టి ముసలయ్య(మురళి), లావేటి భానులను అరెస్టు చేశామన్నారు. చల్లపల్లి అప్పారావుకు తుని మండలం డి.పోలవరం గ్రామానికి చెందిన వేణుతో వివాహమైందని, స్వగ్రామంలో ఇతడిపై లైంగిక దాడి, దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. (దారుణం : బాలుడిపై సామూహిక అత్యాచారం)
దీంతో అప్పారావు, భార్య వేణు మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా ఉండడంతో, వేణు తునికి చెందిన వనశెట్టి ముసలయ్య (మురళి) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందన్నారు. భర్త గ్రామానికి వచ్చిపోతుండడం వేణు, మురళీలకు ఇబ్బందిగా మారింది. దీంతో కాపురాన్ని తుని పట్టణంలోకి వేణు మార్చింది. భర్తను పూర్తిగా వదిలించుకోవాలని భావించిన వేణు తన ప్రియుడు మరళి, అతడి స్నేహితుడు లావేటి భాను, తండ్రి గున్నయ్యలతో కలసి హత్యకు ప్రణాళిక సిద్ధం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఎప్పటిలాగే మద్యం సేవించి గ్రామానికి వచ్చిన అప్పారావును మామగారైన గున్నయ్య బస్టాప్‌లో పడుకోబెట్టాడు. తర్వాత మురళి, భానులు వెళ్లి లారీ కమాన్ప్లేటుతో బలంగా తలపై కొట్టి హత్య చేశారన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు అప్పగించినట్టు తెలిపారు.