పారిశ్రామిక ప్రగతిపై ఆశలు
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏడాది కాలంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ క్షేత్రస్థాయిలో వాటి అమలుపై దృష్టిసారిస్తూనే.. మరోవైపు పారిశ్రామిక ప్రగతి వైపు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలో అపారంగా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన ప్రో త్సాహం అందించడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది.
ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేందుకు ఇప్పటికే నిబంధనలను సడలించిన సర్కారు తాజాగా శుక్రవారం నూతన విధానాన్ని ప్రకటించింది. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో నూతన పారిశ్రామిక విధానం పేరిట భారీ సదస్సును నిర్వహించి పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలు, ఎదురవుతున్న సమస్యలు, రుణాల మంజూరు, సర్కారు విధివిధానాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పరిశ్రమలను విరివిగా స్థాపించేందుకు కఠినతరంగా ఉన్న కొన్ని నిబంధనలను సడలించుకొని పారిశ్రామిక ప్రగతిని మరింత వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు.
ఫెర్టిలైజర్, పవర్, టెక్స్టైల్స్, సిమెంట్ పరిశ్రమలకు పెద్దపీట
జిల్లాలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు కొత్తగా 42 యూనిట్లకు వివిధ శాఖల నుంచి 59 అనుమతులు మంజూరు చేశారు. రూ.24.79 కోట్లతో వీటిని అమలు చేస్తున్నారు. వీటి ద్వారా 460 మందికి ఉపాధి లభించనుంది. జిల్లాలో ఇప్పటివరకు వర్క్‌షాప్‌లు, దాణా కేంద్రాలు, గ్రానైట్ పరిశ్రమలు, రైస్‌మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. నూతన పారిశ్రామిక విధానం అమలయ్యూక పరిశ్రమలను నెలకొల్పేందుకు జిల్లాలో 55 వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఇప్పటికే జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు గుర్తించారు. వీటి ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. ప్రధానంగా ఫర్టిలైజర్, విద్యుత్, టెక్స్టైల్స్, సిమెంట్ పరిశ్రమలను నెలకొల్పితే పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థికాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
= ఇప్పటికే రామగుండంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. మరో 2400 మెగావాట్ల పనులను నల్గొండ జిల్లా దామరచెర్లకు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. అరుుతే జిల్లాలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి అనువైన ప్రదేశమని గుర్తించడంతో మిగతా 2400 మెగావాట్ల ఉత్పత్తి పనులు సైతం రామగుండంలోనే జరగనున్నాయని తెలుస్తోంది.
= బసంత్‌నగర్‌లో ఉన్న కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ వంటి కర్మాగారాలు నెలకొల్పేందుకు జిల్లా అనువుగా ఉందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. జగిత్యాల డివిజన్ పరిధిలోని చాలా గుట్టల్లో సున్నపురాయి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయని, సిమెంటు పరిశ్రమకు అనుకూలమని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
= సిరిసిల్లలో ఇది వరకే టెక్స్టైల్స్ పార్కు ఉన్నా ఆశించిన మేర అభివృద్ధి జరగకపోవడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. దీంతో సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ టెక్స్టైల్స్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి సిరిసిల్లను వస్రోత్పత్తిని కేంద్రంగా, టెక్స్టైల్స్ పరిశ్రమ కొత్త శోభను సంతరించుకొనేలా తీర్దిదిద్దాలని వ్యూహరచన చేశారు.
= రామగుండంలో మూసివేసిన ఎఫ్‌సీఐ స్థానంలో రూ.5వేల కోట్ల పెట్టుబడితో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం నిర్మాణానికి సంబంధించిన పనులు చురుకుగా జరుగుతున్నారుు. ఫర్టిలైజర్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోని అనేక సమీక్షలు చేశారుు. ఇటీవలనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎఫ్‌సీఐని సందర్శించి పునరుద్దరణ పనులు వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. పై నాలుగు ప్రాధాన్య రంగాల్లో విరివిగా పరిశ్రమలు వచ్చి జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి సర్కారు శ్రీకారం చుట్టింది.
అనుమతుల్లో జాప్యం జరుగదు
ఇక నుంచి పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక యువతకు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించడం, 15 రోజుల నుంచి 45 రోజుల్లో ఏ ప్రాజెక్టుకైనా అనుమతులు లభించేలా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర ఉండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు వెంట వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అనుమతుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో లాగా కార్యాలయాల చుట్టూ పరిశ్రమల అనుమతి కోసం తిరగాల్సిన పనిలేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం నిరుద్యోగ నిర్మూలన, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.