దిష్టి తీస్తామని.. రూ. 76 వేలతో పరార్!
గృహిణికి కి‘లేడీ’ల టోకరా
మాదాపూర్: ఁమీ పాపకు దిష్టి తగిలింది, పూజలు చేసి దిష్టి తీస్తాం*.. అని మాయమాటలు చెప్పి ఇద్దరు మాయ్ఙలేడీ*లు రూ. 76 వేలతో ఉడాయించారు. మాదాపూర్ సీఐ శశాంక్‌రెడ్డి కథనం ప్రకారం.. స్థానిక అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉండే వ్యాపారి శివరామిరెడ్డి (60) ఇంటికి సోమవారం ఉదయం 7.30కి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వచ్చారు. తాము దగ్గరలో ఉండే గుడిలో పూజలు చేస్తామని, బోనాల పండుగ సందర్భంగా ప్రసాదం చేసేందుకు బియ్యం, బెల్లం కావాలని అడిగారు. మీకు శుభం జరుగుతుందని శివరామిరెడ్డి భార్యకు బొట్టు పెట్టారు. ఆమె బియ్యం తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా వారు కూడా ఆమె వెనుకే వెళ్లారు. ఁ్ఙమీ పాపకు ఆరోగ్యం బాగలేదు.. దిష్టితీయాలి. పూజ చేసి దిష్టి తీస్తే శుభం జరుగుతుంది. ఇంట్లో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు పూజలో పెట్టండి** అన్నారు. దీంతో ఆమె అమ్మాయి ఫీజు చెల్లించేందుకు తెచ్చిన రూ. 76 వేలు వారి బుట్టలో పెట్టింది.
వారు డ బ్బును వస్త్రంలో మూట కట్టి.. బుట్టలో పెట్టి పూజ చేసినట్టు నటించారు. తర్వాత ఆ మూటలను ఆమెకు ఇచ్చి కబోర్డులో పెట్టి.. తాము వెళ్లాక తెరవమని చెప్పారు. అపార్ట్మెంట్ కింది వరకు పసుపు నీళ్లు చల్లాలని శివరామిరెడ్డి భార్యను కూడా తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత ఆమె వచ్చి మూటను విప్పగా డబ్బులు లేవు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరు పెద్ద బొట్టు పెట్టుకొని, పట్టుచీర కట్టుకొని ఉందని, వయసు సుమారు 45 ఏళ్లు ఉంటాయని, మరో మహిళకు 30 ఏళ్లు ఉంటాయని, తెలుగు బాగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలకు చిక్కిన ఆ అగంతుకురాళ్ల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.