ఏకోపాధ్యాయుడే...
ఇది మడకశిర మండలం గుర్రపుకొండ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 1-5 తరగతుల విద్యార్థులు 90 మంది దాకా ఉన్నారు. ఇక్కడ చదువు చెబుతున్న వ్యక్తి పేరు పక్కీర్‌నాయక్. ఈయన ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయుడు కాదు. ఆర్డీటీ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రైవేటు టీచర్. ఈ పాఠశాలకు మూడు ఉపాధ్యాయ పోస్టులు మంజూరైనా.. ప్రస్తుతం పని చేస్తోంది మాత్రం ఏకోపాధ్యాయుడే.
దీంతో ఈ ఏడాది జూన్ మొదటివారంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఒక ఉపాధ్యాయుడు ఉంటే చదువులెలా సాగుతాయని, టీసీలిస్తే తమ పిల్లలను బయట పాఠశాలల్లో చేర్పిస్తామని గొడవ చేశారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. పేద పిల్లలు చదువుతున్న పాఠశాల దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆర్డీటీ ఒక వలంటీర్‌ను నియమించింది. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) మరో వలంటీర్ శ్రీరాంనాయక్‌ను నియమించింది. రెగ్యులర్ ఉపాధ్యాయుడికి వీరిద్దరు తోడుకావడంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది.
అనంతపురం ఎడ్యుకేషన్ : యూనిఫైడ్ డి స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్)-2013 నివేదిక ప్రకారం జిల్లాలో ఒకట్రెండు కాదు.. ఏకంగా 864 పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు ఉన్నారు. వీటిలో 830 ప్రాథమిక, 34 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అనారోగ్యమో లేక వ్యక్తిగత, కుటుంబ పనిమీదనో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడూ సెలవు పెడితే ఆరోజు ఆ స్కూలు విద్యార్థులకూ సెలవే.
సరిహద్దు మండలాల్లో అధికం
డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేసినప్పుడు కొద్దిరోజులు అన్ని స్కూళ్లలోనూ ఉపాధ్యాయులు కనిపిస్తారు. తర్వాత కొద్దిరోజులకు సరిహద్దు మండలాల నుంచి బయటకు వస్తున్నారు. ప్రతిసారీ ఇదేతంతు. ఫలితంగా సరిహద్దు మండలాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోంది. అన్ని మండలాల్లోనూ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నా..సరిహద్దు మండలాల్లోనే ఎక్కువగా కన్పిస్తున్నాయి. మడకశిర, గుడిబండ, రొళ్ల మండలాల్లో ఒక్కో మండలంలో 40 చొప్పున ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే అమరాపురంలో 22, అగళి 21, గాండ్లపెంట 21, నల్లచెరువు 23, తనకల్లు 30, నంబులపూలకుంట 14, తలుపుల 23, గుమ్మఘట్ట 18, కంబదూరు 16, బ్రహ్మసముద్రం 10, కుందుర్పి 19, శెట్టూరు 19, బొమ్మనహాళ్ 17, డీ.హీరేహాళ్‌లో 13 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. కొన్నిచోట్ల మాత్రం ఎస్ఎంసీలు, గ్రామస్తుల చొరవతో వలంటీర్లను నియమించుకున్నారు.
రిలీవ్ కోసం ఎదురుచూపు
2013లో జరిగిన సాధారణ బదిలీల్లో చాలామంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఇద్దరు, ముగ్గురు పని చేస్తున్న పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉండి.. తక్కిన ఇద్దరు బదిలీపై వెళ్లారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లోనూ పలువురు బదిలీ అయ్యారు. అయితే..స్కూళ్లు మూతపడతాయన్న కారణంతో వారిని రిలీవ్ చేయడం లేదు. వారంతా రిలీవ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏకోపాధ్యాయ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్ల సమస్యలు అన్నీఇన్నీ కావు. ఏదైనా అవసరం పడి సెలవు కావాలంటే వీలు పడడం లేదు. నరకం అనుభవిస్తున్నామని వారు వాపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో సెలవుపై వెళితే మాత్రం ఆ రోజు పిల్లలకూ హాలిడే ప్రకటించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల మాత్రం బోధనతో సంబంధం లేని క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ)లతో చదువు చెప్పిస్తున్నారు.
వారంతా శిక్షణకు దూరం
ఏకోపాధ్యాయులు ప్రభుత్వం ఇస్తున్న శిక్షణకు దూరంగా ఉంటున్నారు. ప్రతియేటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయులకు బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తుంటారు. ప్రతి ఉపాధ్యాయుడూ విధిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఏకోపాధ్యాయ స్కూళ్ల నుంచి మాత్రం హాజరుకావడం లేదు. పాఠశాలలు మూత పడతాయన్న కారణంగా అధికారులు కూడా వారిని పెద్దగా బలవంతం పెట్టడం లేదు. బోధనలో మెలకువలు నేర్చుకోవాలనే తపన ఉన్నా..అవకాశం లేకుండా పోతోందని కొందరు ఉపాధ్యాయులు వాపోతున్నారు.