అవాంఛిత కాల్స్ జరిమానా నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్‌కు విధించే జరిమానా నిబంధనలను ట్రాయ్ సరళీకరించింది. టెలీ మార్కెటింగ్ సంస్థల డిపాజిట్, రిజిష్ట్రేషన్ మొత్తాలను కూడా సగానికి తగ్గించింది. రూ. లక్షగా ఉన్న డిపాజిట్ మొత్తాన్ని రూ.50,000కు, రూ.10,000గా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును రూ.5,000కు తగ్గించింది. రిజిస్ట్రేషన్ కాల పరిమితిని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెం చింది. గతంలో ఒక్కో అవాంఛిత కాల్, ఎస్ఎంఎస్లపై ట్రాయ్ టెలికం ఆపరేటర్లపై రూ.5,000 వరకూ జరిమానా విధించేది. ఇప్పుడు దీనికి బదులుగా కొత్త స్లాబ్ ప్రకారం జరిమానాలు విధిస్తుంది.
అవాంఛిత కాల్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకునే మొబైల్ ఆపరేటర్లకు నజరానాగా జరిమానా నిబంధనలను సవరించామని ట్రాయ్ పేర్కొంది. ఏ టెలికం ఆపరేటర్‌కి వ్యతిరేకంగా ఒక వారంలో 50 వరకూ ఫిర్యాదులొచ్చినా ఎలాంటి జరిమానా ఉండదు. ఒక వారంలో ఫిర్యాదుల సంఖ్య 50-300 వరకూ ఉంటే ఒక్కో ఫిర్యాదుకు రూ. 1,000 చొప్పున జరిమానా విధిస్తారు. ఫిర్యాదుల సంఖ్య 301 నుంచి 700 వరకూ ఉంటే ప్రతీ ఫిర్యాదుపైనా రూ. 2,000 జరిమానా ఉంటుంది. ఇక ఫిర్యాదుల సంఖ్య 700కు మించితే ఒక్కో ఫిర్యాదుపై రూ.5,000 జరిమానా విధిస్తారు. అవాంఛిత కాల్స్‌కు సంబంధించి ఫిర్యాదుల సంఖ్య తగ్గుతోందని ట్రాయ్ పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో వారానికి 12,848గా ఫిర్యాదుల సంఖ్య నవంబర్ 17న ముగిసిన వారంలో 4,046కు తగ్గింది.
ఆటో రెన్యువల్‌కు అనుమతి తప్పనిసరి
డేటా ప్యాక్‌లు, ఎస్ఎంఎస్లకు సంబంధించి స్పె షల్ టారిఫ్ ఓచర్లు(ఎస్టీఓ) రెన్యువల్‌కు వినియోగదారుల సమ్మతి తప్పనిసరని ట్రాయ్ మంగళవారం స్పష్టం చేసింది. టెలికం ఆపరేటర్లందించే ఈ తరహా స్పెషల్ టారిఫ్ ఓచర్ల ఆటో రెన్యువల్ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ (7వ సవరణ) నిబంధనలు, 2013కు సంబంధించిన మార్గదర్శకాలను ట్రాయ్ వెల్లడించింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఇలాంటి ఎస్టీఓల గడువు తీరడానికి 3 రోజుల ముందే సంబంధిత ఎస్టీఓ రెన్యువల్ తేదీలు, చార్జీలు నిబంధనల వివరాలను వినియోగదారులకు తెలియజేయాలని ట్రాయ్ ఆదేశించింది.