ఆయన నన్నిక్కడకు ‘రా’...‘రా’ అని పిలుస్తున్నారు - ఉపేంద్ర
‘‘నల్లమలుపు బుజ్జిగారితో ‘రా’ సినిమా చేశాను. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగ తంగా కూడా నా జీవితంలో గుర్తుండి పోయే సినిమా అది. ఎందుకంటే ఆ సినిమా సమయంలోనే తొలిసారిగా నా భార్య ప్రియాంకను కలిశాను. బుజ్జిగారు మళ్లీ ‘ఉపేంద్ర-2’తో ఆయన నన్నిక్కడికు ‘రా రా’ అని పిలుస్తున్నారు’’ అని ఉపేంద్ర అన్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఉపేంద్ర’ చిత్రానికి సీక్వెల్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘ఉపేంద్ర-2’.
ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తెలుగులో విడుదల చేస్తున్నారు. పారుల్ యాదవ్, క్రిస్టీనా అకీవా కథానాయికలు. గురుకిరణ్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు వీవీ వినాయక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ -‘‘ ‘ఓం’ సినిమా చూసినప్పటి నుంచి ఉపేంద్ర అంటే నాకు ఇష్టం. నాకే కాదు అప్పట్లో కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే దర్శకులకు ఉపేంద్ర అంటే చాలా క్రేజ్.
ఆయన డైరక్షన్ టెన్షన్‌ను పక్కన పెట్ట్టి సూపర్ స్టార్ అయ్యారు. మళ్లీ ఆయన ఈ ‘ఉప్రేంద-2’ సినిమాతో ఆపేయకుండా డైరక్షన్ను కొనసాగించాలని కోరుతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ‘స్రవంతి’ రవికిషోర్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, ‘ఠాగూర్’ మధు, దామోదర ప్రసాద్, దర్శకులు డాలీ, గోపీచంద్ మలినేని, రచయిత వక్కంతం వంశీ తదితరులు సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.