15 నిమిషాల్లో పని మనిషి..
ఆన్లైన్ డెలివరీ అన్నది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. మనిషి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయింది. ఫుడ్ డెలివరీతో మొదలైన ఆన్లైన్ డెలివరీ సేవలు క్రమంగా కిరాణాతో పాటు అనేక రకాల వస్తువులు, సర్వీసులు నిమిషాల వ్యవధిలో ఇంటి ముంగిటకు చేర్చే వరకూ వచ్చేశాయి. ఈ సేవలు ఇక్కడితో ఆగేలా లేవు.తాజాగా ప్రముఖ హోమ్ సర్వీసెస్ సంస్థ అయిన అర్బన్ కంపెనీ ‘ఇన్‌స్టా మెయిడ్స్ / ఇన్‌స్టా హెల్ప్’ అనే సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వరా 15 నిమిషాల పనిమనిషి మీ ఇంటి ముంగిటకు వస్తారు. ఈ సర్వీస్ ప్రారంభంతో అర్బన్ కంపెనీ ఆన్లైన్ సేవలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.ప్రస్తుతానికి ముంబైలో ఈ సేవను ప్రవేశపెట్టామని, ఇది 'పైలట్ దశలో' ఉందని అర్బన్ కంపెనీ పేర్కొంది. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఈ సేవలో భాగస్వాములకు అంటే పని మనుషులకు 'గంటకు రూ .150 నుండి 180' లభిస్తుందని, అయితే ప్రస్తుతానికి ఈ సేవను గంటకు రూ .49 లకే అందిస్తున్నట్లు వివరించింది."అర్బన్ కంపెనీలో, మా సేవా భాగస్వాముల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ కొత్త సర్వీస్ ఆఫర్ లో, భాగస్వాములు ఉచిత ఆరోగ్య బీమా, ఆన్-ది-జాబ్ లైఫ్ & యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు గంటకు రూ. 150-180 సంపాదిస్తారు. నెలకు 132 గంటలు (22 రోజులు × రోజుకు 6 గంటలు) పనిచేసే భాగస్వాములకు నెలకు కనీసం రూ.20,000 ఆదాయం లభిస్తుంది" అని రాసుకొచ్చింది. అర్బన్ కంపెనీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వచ్చాయి. ఆన్లైన్ సర్వీస్‌కి ఇది పరాకాష్ట అని పలువురు కామెంట్లు చేశారు.