Urdu literature
-
సాహితీ ధృవతార ఖమర్
మదనపల్లె సిటీ: రాయలసీమ ఉర్దూ సాహిత్యంలో ఖమర్ అమీని అలియాస్ ఖమర్ హజరత్ అంటే తెలియని వారుండరంటే అతిశయోశక్తి కాదు. సాహితీ ప్రపంచంలో ధృవతార ఆయన. 80 ఏళ్ల వయస్సులోనూ మాతృభాషలైన ఉర్దూ, జాతీయ భాషలైనా హిందీలకు సేవలందిస్తున్నారు. ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు, కవితా సంపుటాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించాయి. మైనార్టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉర్దూ అకాడమీ 2023 ఏడాదికి ఖమర్‌కు జీవిత సాఫల్య అవార్డు రాష్ట్ర సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన రచనలు గురించి కథనం. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం దేవళంవీధిలో నివసిస్తున్న ఈయన ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుడు. అసలు పేరు బాబా ఫకృద్దీన్. కలం పేరు ఖమర్ అమీని. 22 ఏళ్ల పాటు ఉర్దూ ఉపాధ్యాయునిగా , 18 ఏళ్లు హిందీ ఉపాధ్యాయునిగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేసి పదవీ విరమణ అనంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు. 1954లో మొదట కవిత్వం రాయం ప్రారంభించిన అమీని ఇప్పటి వరకు వేలాది కవిత్వాలు రాశారు. ఆయన రాసిన ‘అమ్మకు ఓ అక్షరం(మా)’ అను కవితకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. ఆయన ప్రసిద్ది చెందిన కడప పెద్ద దర్గాలో 30 సంవత్సరాలు సాహితీ సేవలు అందించారు. ఆయన రచించిన కవితలు ప్రఖ్యాత గాయకులు పంకజ్ఉదాస్, విఠల్‌రావు, అశోక్ఖోస్లాతో పాటు పలువురు ప్రసిద్ద ఖవ్వాల్లు పాడారు. ఖమర్అమీని రచించిన కవితల పుస్తకాలు గుల్దస్తే, తవాఫే–గజల్, నాత్కీ అంజుమన్,కష్కోల్–ఏ–ఖల్బ్–ఓ–నజర్, ఇర్తెకాజ్–ఏ–అప్కార్,కష్కోల్–కరమ్ బిరుదులు: అనీస్–ఉస్–షోరా, నఖీబ్–ఉష్–షోరా ప్రశంసలు: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ,మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్, ప్రముఖ గేయరచయిత సీ నారాయణరెడ్డిలచే పలు ప్రశంసలు అందుకున్నారు. సాహితీ సేవకు వయస్సు అడ్డురాదు సాహితీ సేవకు వయస్సు అడ్డంకి కారాదు. నాకు గుర్తింపునిచ్చిన భాష సేవకే జీవితాన్ని అంకితమిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు సాహితీ సేవలందిస్తాను. ఇప్పటివరకు వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దాను. –ఖమర్ అమీని, ప్రముఖ ఉర్దూ రచయిత -
నది దాహం
కిష్వర్ నషీద్ ఇరవయ్యో శతాబ్దపు గొప్ప స్త్రీవాద రచయిత్రి. గత ఏడాది జూన్‌తో ఎనభై ఏళ్లు నించిన కిష్వర్ పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ శహర్ లో. దేశ విభజన అనంతరం వారి కుటుంబం పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ఉర్దూ, పర్షియా భాషలు చదువుకున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి ఆడపిల్లలను అనుమతించని రోజుల్లో చదువు కోసం కిష్వర్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత చదువు కొనసాగించడానికి ఇంట్లో పెద్ద సమావేశం... సుదీర్ఘ చర్చ. ఎట్టకేలకు ఆమె కాలేజ్‌లో చేరగలిగారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారామె. ఆమె రచనా వ్యాసంగం 1968లో మొదలైంది. పన్నెండు స్వీయ రచనలతోపాటు అనేక అనువాద రచనలు కూడా చేశారామె. ఆమె కలం నుంచి జాలువారిన గజల్లకు లెక్కే లేదు. ప్రపంచ సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కిష్వర్. ఆమె రచనలు ప్రధానంగా మహిళలను ఒత్తిడికి గురి చేస్తున్న మతపరమైన విధానాల మీదనే సాగేవి. స్టార్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, సాహిత్య విభాగంలో లైఫ్ టైమ అచీవ్మెంట్ అవార్డులతోపాటు ఇతర పురస్కారాలను కూడా అందుకున్నారు. గత ఏడాది కోవిడ్ బారిన పడి కోలుకున్న నషీద్ కోవిడ్ బారిన పడిన సమాజాన్ని అక్షరబద్ధం చేశారు. ‘దర్యా కీ తిష్ణాగీ(నది దాహం)’ పేరుతో ఉర్దూలో విడుదల చేసిన సంకలనంలో ఆమె కరోనా బారిన పడిన సమాజంలో ఆమె గమనించిన విషయాలను ప్రస్తావించారు. ఆ కవిత సారాంశం క్లుప్తంగా... డబ్బాలు నిండే రోజు ‘‘కరోనా ఆర్థిక వ్యవస్థను నిలువుగా చిదిమేసింది. ఇల్లు దాటి కాలు బయటపెట్టకపోతే రోజు గడవదు, కాలు బయటపెట్టినా పని కనిపించదు. ‘ఎవరినీ తాకవద్దు– సామాజిక దూరం పాటించాలి’ అనే మాటలను వింటూనే రోజులు వెళ్లిపోతున్నాయి. మధ్య తరగతి ఎట్టకేలకు సొంతం చేసుకున్న కారును కరోనా అమ్మేసింది. ఇంటి నుంచే పని చేయమని కోరుతోంది ప్రపంచం. ఇంట్లో కూర్చుని చేసే పనులు కాని వృత్తుల్లో వాళ్లకు పని చేసే దారి మూసుకుపోయింది. ఇంట్లో దినుసుల డబ్బాలు ఎప్పుడు ఖాళీ అయిపోతాయోనని భయం. అప్పటికే ఖాళీ అయిన డబ్బాలు... నిండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాయి. ఎవరి ముందూ చేయి చాచలేని మొహమాటం, అగ్గిపుల్లను కూడా అరువడగలేని ఆత్మగౌరవం. పిల్లల్ని ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి, ఏమీ తోచక ఏడుస్తున్న పిల్లలను రోజంతా సంతోషపెట్టాలి. ఇంటి పద్దులు చూసుకుంటూ అరుచుకుంటూ పరస్పరం కోపంతో విరుచుకుపడుతూ భార్యాభర్తలిద్దరూ అలసిపోతున్నారు. ఎవరినీ ఏమీ అడగడం చేతరానితనం, అడగడానికి అడ్డుపడే గౌరవాల మధ్య జీవితాలు నలిగిపోతున్నాయి. వాస్తవాలను అర్థం చేసుకున్న వృద్ధతరం మాత్రం ఈ కరోనా కష్టకాలానికి వారి జీవితానుభవాలను జోడించుకుని కొత్త భాష్యం చెప్పుకుంటోంది. ఇది ఇలా ఉంటే... ఇదే ఏడాది పాకిస్థాన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుగోలు జరిగింది. వార్ధక్యంలో వివాహం జరిగింది. వరుడు వివాహవేదికకు కిలో బంగారంతో వచ్చాడు. యూరప్ దేశాల వాళ్లు బాల్కనీలో నిలబడి గిటార్ వాయిస్తూ గడిపారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. నలుగురు మనుషులున్న కుటుంబం కనిపించడం కష్టమైంది. సంగీతంలో శ్రావ్యతలన్నీ ఏకమయ్యాయి కానీ పాటలే వేరయ్యాయి. గోడను మరొక గోడ కలుపుతోంది. గోడల ఆలంబనతో జీవిస్తున్న ఇరుగుపొరుగు మధ్య పలుకు భయం మాటున మూగబోయింది. మౌనంగా సంభవించిన మరణాలు... పూడ్చి పెట్టిన బారులు చైనా గోడలాగ ఆకాశం నుంచి కూడా కనిపిస్తాయి. కరోనా దూసుకుపోతోంది... మానవత్వం మరణిస్తోంది... ఏడాది దాటి పోయింది’’. -
ఉర్దూ సాహిత్యాభివృద్ధికి కృషి
కడప కల్చరల్ : రాయలసీమలో ఉర్దూసాహిత్యానికి ఇకపై రెట్టింపు కృషి జరగవలసిన అవసరం ఉందని ప్రముఖ ఉర్దూ కవి ఇక్బాల్ ఖుస్రో అన్నారు. కడప నగరంలో శుక్రవారం రాయలసీమ ఉర్దూ రైటర్స్ ఫెడరేషన్ కార్యాలయాన్ని స్థానిక కోటగడ్డవీధిలో ప్రముఖ ఉర్దూ కవి సత్తార్‌ఫైజి స్వగృహంలో ప్రారంభించి మాట్లాడారు. ఫెడరేషన్ ఏర్పాటై 30 ఏళ్లు పూర్తయినా రాయలసీమ స్థాయిలో దీనికి కార్యాలయం లేకపోవడం విచారకరమన్నారు. ఉర్దూ సాహిత్యంపై గౌరవం గల సత్తార్ఫైజీ తన స్వగృహాన్ని కార్యాలయానికి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇటీవల కాలంలో ఉర్దూ సాహిత్యాభివృద్ది విషయంగా కొద్దిగా స్తబ్దత ఏర్పడిందని, ఇకపై రెట్టింపు ఉత్సాహంతో ఆ లోటును పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఉర్దూ నాటక విషయంలో యూసఫ్ సఫీ, కవిత్వం ఇతర రంగాలలో రాయలసీమ స్థాయిలో కవులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. యువతను సాహిత్య విషయంలో ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. ప్రముఖ ఉర్దూ నాటక రచయిత యూసఫ్ సఫీ మాట్లాడుతూ రాయలసీమ ఉర్దూ సాహిత్య కృషికి కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువ రచయితలు ఉర్దూ సాహిత్యంలోని అన్ని విభాగాలలో ప్రతిభ చూపాలన్నారు. ఆస్థానె షహమీరియా పీఠాధిపతి సయ్యద్‌షా హుసేనీబాష షహమీరి మాట్లాడుతూ ముషాయిరాలలో జిల్లా కవులు సీమస్థాయిలో మంచి పేరు సాధిస్తున్నారని, జిల్లా నుంచి ఉర్దూలో ఉత్తమ స్థాయి కవిత్వం రాగలదన్న ఆశ ఉందన్నారు. ప్రొఫెసర్ సత్తార్ సాహిర్ మాట్లాడుతూ ఇకపై పాఠశాలలు, కళాశాలల్లో ఉర్దూబాష విషయంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం కేంద్రంగా కృషి చేయవలసి ఉందన్నారు.ఉర్దూ కవిసత్తార్ఫైజీ మాట్లాడుతూ తమ గురువు సాగర్ జయ్యది 30 ఏళ్ల ఆశయాన్ని నేడు పూర్తి చేయగలిగిన అవకాశం తనకు లభించడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో షకీల్, మహమ్మ ద్ షాహిద్‌తోపాటు పలువురు ఉర్దూకవులు, రచయితలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉర్దూ ఛానల్ ప్రారంభం వసీలా ఉర్దూ పత్రిక ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఛానల్ ప్రారంభమైన సందర్భంగా ఛానల్ అధినేత మహమూద్ షాహిద్‌ను ఉర్దూ కవులు, రచయితలు ప్రత్యేకంగా అభినందించారు. ఛానల్ రాయలసీమలో ఉర్దూ భాష,సాహిత్యాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.