మదనపల్లె సిటీ: రాయలసీమ ఉర్దూ సాహిత్యంలో ఖమర్ అమీని అలియాస్ ఖమర్ హజరత్ అంటే తెలియని వారుండరంటే అతిశయోశక్తి కాదు. సాహితీ ప్రపంచంలో ధృవతార ఆయన. 80 ఏళ్ల వయస్సులోనూ మాతృభాషలైన ఉర్దూ, జాతీయ భాషలైనా హిందీలకు సేవలందిస్తున్నారు. ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు, కవితా సంపుటాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించాయి.
మైనార్టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉర్దూ అకాడమీ 2023 ఏడాదికి ఖమర్‌కు జీవిత సాఫల్య అవార్డు రాష్ట్ర సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన రచనలు గురించి కథనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం దేవళంవీధిలో నివసిస్తున్న ఈయన ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుడు. అసలు పేరు బాబా ఫకృద్దీన్. కలం పేరు ఖమర్ అమీని. 22 ఏళ్ల పాటు ఉర్దూ ఉపాధ్యాయునిగా , 18 ఏళ్లు హిందీ ఉపాధ్యాయునిగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేసి పదవీ విరమణ అనంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు.
1954లో మొదట కవిత్వం రాయం ప్రారంభించిన అమీని ఇప్పటి వరకు వేలాది కవిత్వాలు రాశారు. ఆయన రాసిన ‘అమ్మకు ఓ అక్షరం(మా)’ అను కవితకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. ఆయన ప్రసిద్ది చెందిన కడప పెద్ద దర్గాలో 30 సంవత్సరాలు సాహితీ సేవలు అందించారు. ఆయన రచించిన కవితలు ప్రఖ్యాత గాయకులు పంకజ్‌ఉదాస్, విఠల్‌రావు, అశోక్‌ఖోస్లాతో పాటు పలువురు ప్రసిద్ద ఖవ్వాల్‌లు పాడారు.
ఖమర్‌అమీని రచించిన కవితల పుస్తకాలు
గుల్‌దస్తే, తవాఫే–గజల్, నాత్‌కీ అంజుమన్,కష్కోల్–ఏ–ఖల్బ్–ఓ–నజర్, ఇర్‌తెకాజ్–ఏ–అప్కార్,కష్కోల్–కరమ్
బిరుదులు: అనీస్–ఉస్–షోరా, నఖీబ్–ఉష్–షోరా
ప్రశంసలు: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ,మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్, ప్రముఖ గేయరచయిత సీ నారాయణరెడ్డిలచే పలు ప్రశంసలు అందుకున్నారు.
సాహితీ సేవకు వయస్సు అడ్డురాదు
సాహితీ సేవకు వయస్సు అడ్డంకి కారాదు. నాకు గుర్తింపునిచ్చిన భాష సేవకే జీవితాన్ని అంకితమిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు సాహితీ సేవలందిస్తాను. ఇప్పటివరకు వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దాను.
–ఖమర్ అమీని, ప్రముఖ ఉర్దూ రచయిత
Comments
Please login to add a commentAdd a comment