ఉర్దూ సాహిత్యాభివృద్ధికి కృషి
కడప కల్చరల్ : రాయలసీమలో ఉర్దూసాహిత్యానికి ఇకపై రెట్టింపు కృషి జరగవలసిన అవసరం ఉందని ప్రముఖ ఉర్దూ కవి ఇక్బాల్ ఖుస్రో అన్నారు. కడప నగరంలో శుక్రవారం రాయలసీమ ఉర్దూ రైటర్స్ ఫెడరేషన్ కార్యాలయాన్ని స్థానిక కోటగడ్డవీధిలో ప్రముఖ ఉర్దూ కవి సత్తార్‌ఫైజి స్వగృహంలో ప్రారంభించి మాట్లాడారు. ఫెడరేషన్ ఏర్పాటై 30 ఏళ్లు పూర్తయినా రాయలసీమ స్థాయిలో దీనికి కార్యాలయం లేకపోవడం విచారకరమన్నారు.
ఉర్దూ సాహిత్యంపై గౌరవం గల సత్తార్‌ఫైజీ తన స్వగృహాన్ని కార్యాలయానికి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇటీవల కాలంలో ఉర్దూ సాహిత్యాభివృద్ది విషయంగా కొద్దిగా స్తబ్దత ఏర్పడిందని, ఇకపై రెట్టింపు ఉత్సాహంతో ఆ లోటును పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఉర్దూ నాటక విషయంలో యూసఫ్ సఫీ, కవిత్వం ఇతర రంగాలలో రాయలసీమ స్థాయిలో కవులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
యువతను సాహిత్య విషయంలో ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. ప్రముఖ ఉర్దూ నాటక రచయిత యూసఫ్ సఫీ మాట్లాడుతూ రాయలసీమ ఉర్దూ సాహిత్య కృషికి కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువ రచయితలు ఉర్దూ సాహిత్యంలోని అన్ని విభాగాలలో ప్రతిభ చూపాలన్నారు. ఆస్థానె షహమీరియా పీఠాధిపతి సయ్యద్‌షా హుసేనీబాష షహమీరి మాట్లాడుతూ ముషాయిరాలలో జిల్లా కవులు సీమస్థాయిలో మంచి పేరు సాధిస్తున్నారని, జిల్లా నుంచి ఉర్దూలో ఉత్తమ స్థాయి కవిత్వం రాగలదన్న ఆశ ఉందన్నారు.
ప్రొఫెసర్ సత్తార్ సాహిర్ మాట్లాడుతూ ఇకపై పాఠశాలలు, కళాశాలల్లో ఉర్దూబాష విషయంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం కేంద్రంగా కృషి చేయవలసి ఉందన్నారు.ఉర్దూ కవిసత్తార్‌ఫైజీ మాట్లాడుతూ తమ గురువు సాగర్ జయ్యది 30 ఏళ్ల ఆశయాన్ని నేడు పూర్తి చేయగలిగిన అవకాశం తనకు లభించడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో షకీల్, మహమ్మ ద్ షాహిద్‌తోపాటు పలువురు ఉర్దూకవులు, రచయితలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉర్దూ ఛానల్ ప్రారంభం
వసీలా ఉర్దూ పత్రిక ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఛానల్ ప్రారంభమైన సందర్భంగా ఛానల్ అధినేత మహమూద్ షాహిద్‌ను ఉర్దూ కవులు, రచయితలు ప్రత్యేకంగా అభినందించారు. ఛానల్ రాయలసీమలో ఉర్దూ భాష,సాహిత్యాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.