ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో మేనేజర్‌గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది.
‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను.
ఈవెంట్స్‌కి స్టీల్ గిన్నెల రెంట్
మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్‌తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్‌కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్‌షాప్స్‌లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి.
హస్తకళాకారుల నుంచి..
నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను.
ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను.
గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను.
ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్
కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్‌స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్‌లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను.
కార్పోరేట్ కంపెనీలలో వర్క్‌షాప్స్
కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్‌ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్‌షాప్స్ ఉంటాయి.
అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన.
– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి