విగ్గు వెనుక కథ!
ఫ్లాష్ బ్యాక్
సమాజంలోని పెద్ద తలకాయలను ఇంగ్లిష్లో ‘బిగ్ విగ్స్’ అనడం వాడుక. అయితే, సినిమాలు వచ్చాక గానీ మనకు విగ్గుల వాడకం గురించి పెద్దగా తెలీదు. వయసు మళ్లిన హీరోలు అరవైలో ఇరవైలా కనిపించేందుకు విగ్గు తప్పనిసరి అలంకారం అని అందరికీ తెలిసిందే. అయితే, ‘విగ్గు’ అనే కృత్రిమ శిరోజాలంకరణ సినిమాల ప్రభావంతో మొదలైన పరిణామమేమీ కాదు. ఆధునిక ఆవిష్కరణ కూడా కాదు. క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల నాడే విగ్గుల వాడకం విరివిగా ఉండేది.
వాటి తయారీకి మనుషుల కేశాలే కాదు, జంతువుల జుట్టునూ వాడేవారు. ఆధునిక యుగం మొదలయ్యాక కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన వెంట్రుకలను కూడా విగ్గుల తయారీకి వాడటం మొదలైంది.
మొదట్లో ప్రాచీన ఈజిప్షియన్లు విగ్గులను వాడేవారు. వాళ్లు తలను నున్నగా గొరిగించేసుకునేవారు. ఎండ తాకిడికి మాడు మాడిపోకుండా ఉండేం దుకు విగ్గులను కనిపెట్టారు. సహజ కేశా లతో అలరారే తలలను గొరిగించుకోవడ మెందుకో, వాటిపై విగ్గులు పెట్టుకోవడ మెందుకో అనకండి. అప్పట్లో అదే ఫ్యాషన్. ఇక క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలలో విగ్గుల వాడకం రాచ కుటుంబాలలో తప్పనిసరి ఫ్యాషన్. ఇంగ్లండ్ రాణి ఒకటో ఎలిజబెత్, ఫ్రాన్స్ రాజు పదమూడో లూయీ వంటి వారంతా విగ్గుధారులే.
పద్దెనిమిదో శతాబ్దిలో విగ్గుపై తెల్లపౌడర్ చల్లడం ఫ్యాషన్. అలా చల్లితే కాస్త వయసు మళ్లిన రూపం వచ్చేది. అలాంటి విగ్గును ధరించే వాళ్లను పెద్దమనుషులుగా పరిగణించేవాళ్లు. సినీ ఇండస్ట్రీ మొదలయ్యాక విగ్గులు ఎన్ని వేషాలు నేర్చాయో మనకు తెలిసిందే!