వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు
వేపనూనె... వేప పిండి... ఇవి రెండూ రైతులకు సుపరిచితమే. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా అవగాహన ఉంది. అయితే వినియోగంలో మాత్రం అంతగా చొరవ చూపడంలేదు. వేపనూనె వినియోగిస్తే పైరును చీడపీడలు ఆశించవు. రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సాగు ఖర్చులు కలిసొస్తాయి. వేపనూనె వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు కంకిపాడు ఏవో లంక శ్రీనివాస్ మాటల్లో..
వేపనూనెలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది. దీనిని వాడితే మొక్కలు కూడా చేదెక్కుతాయి. దీని వల్ల మొక్కలను తినేందుకు పురుగులు ఆశించవు. వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. దీంతో పురుగు మందుల వినియోగం ఖర్చు తగ్గుతుంది. వేపనూనె ద్వారా పంటకు అవసరమైన చేవ సమృద్ధిగా అందుతుంది. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గడంతో రైతుకు పెట్టుబడులపై వ్యయం ఆదా అవుతుంది. గతంలో వేపనూనె వినియోగం తక్కువగా ఉండేది. ప్రస్తుతం రైతుల్లో అవగాహన పెరగటంతో వినియోగం కొద్దిగా పెరిగింది. వేపనూనె వినియోగం, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
- కంకిపాడు
ఇలా వాడుకోవాలి..
వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించాలి.
పంట ఏదైనా సరే, ఏ సమయంలో నైనా వేప నూనె వాడితే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, పురుగు మందు, సూక్ష్మధాతు మిశ్రమాల్లో వేపనూనె కలిపి వాడుకోవచ్చు.
యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి వాడుకోవాలి.
యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది.
నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం.
నత్రజని వృథా కాకుండా నిరోధిస్తుంది.
పంటలకు కీడుచేసే పురుగు సంతతిని నివారిస్తుంది. పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు.
వేప నూనె వాడకంతో నత్రజని ఎరువులు వినియోగం తగ్గుతుంది. వ్యవసాయ పెట్టుబడుల్లో ఖర్చులో 20 శాతం, పురుగు మందుల వినియోగం ఖర్చులో 40 శాతం తగ్గుతుంది.
నత్రజని వృథా కాకుండా ఉండటమే కాకుండా, మొక్క చేదు ఎక్కటం వల్ల పురుగు వ్యాప్తి నిరోధించటానికి దోహదపడుతుంది.
పండ్ల తోటల్లో వినియోగం ఇలా..
పండ్ల తోటల్లో అయితే వేప నూనెను చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు తగిలించాలి. వేరు ద్వారా నూనె మొక్కకు నేరుగా చేరుతుంది. దీని వల్ల పురుగును నివారించుకోవచ్చు.
గానుగ నుంచి తెచ్చిన వేప పిండి పండ్ల తోటలకు పనికిరాదు. వేపనూనెనే వినియోగించాలి.
అరటి, పసుపు, కంద, మిర్చి తోటల్లో ఆముదపు పిండి, గానుగ పిండి, పొగాకు పిండితో పాటుగా వేప పిండి కలిపి చల్లుకుంటే పంటకు ఉపయుక్తంగా ఉంటుంది. మొక్క ఎదుగుదలకు, పురుగు నియంత్రణకు పిండి దోహదపడుతుంది.
వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై వేపనూనె అందిస్తుంది. లీటరు రూ.100 చొప్పున విక్రయిస్తోంది.
వేప పిండి మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా లేదు. బయటి మార్కెట్లో 40 కిలోల వేప పిండి బస్తా రూ.600 నుంచి రూ.800 వరకూ ధర పలుకుతోంది.
లంక శ్రీనివాస్
88866 13370