Uttar Pradesh CM Akhilesh Yadav
-
‘నాన్నకు, నాకు తేడా అదే..’
‘కొడుకులు తన అడుగుజాడల్లోనే నడవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అందులో తప్పులేకపోవచ్చు. కానీ నేను మాత్రం కొంచెం తేడా. మా నాన్న మల్లయోధుడు. నేను ఫుట్‌బాలర్‌ని..’అని చమత్కరించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్. అదే సమయంలో ‘వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలిచినా, నేను సీఎం అవుతానో లేదో చెప్పలేను’అంటూ వైరాగ్యం ప్రదర్శించారు. ఓ జాతీయ చానెల్ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న అఖిలేశ్ పలు అంశాలపై సూటిగా సమాధానాలిచ్చారు.. ‘కష్టాల్లో ఉన్నప్పుడే మనకు నిజమైన స్నేహితులెవరో తెలుస్తుంది. కొద్ది రోజులుగా సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నుంచి వెలకట్టలేని పాఠాలు నేర్చుకున్నా. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలిచినా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పలేను. నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) నిర్ణయమే శిరోధార్యం. ఆయనను ఎవ్వరూ ధిక్కరించలేరు. అయితే నాపై సాగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని మాత్రం కచ్చితంగా ఖండిస్తా’ అని అఖిలేశ్ అన్నారు. అతను అంకుల్.. ఆమె అక్క! ములాయంకు అత్యంత ఆప్తుడు, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అయిన అమర్ సింగ్ తో విబేధాలపై స్పందిస్తూ..‘ఆయన(అమర్) నాకు చిన్నాన(అంకుల్)తో సమానం. ఒకవేళ నేను పార్టీ అధ్యక్షుడిని అయిఉంటే, అమర్ సింగ్ విషయంలో నేతాజీకి సలహా ఇచ్చేవాణ్ని. ఆయన(అమర్)పై చర్యలకు వెనకాడకపోయేవాణ్ని’ అని అఖిలేశ్ సమాధానమిచ్చారు. ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీఎస్పీనే అని, ఆ పార్టీ అధినేత్రి మాయవతి తనకు బువా(అక్క)తో సమానమని అఖిలేశ్ అన్నారు. ‘మాయావతిని కలవడానికి వెళ్లాలంటే ఆఫీసు బయటే చెప్పులు విడిచి వెళ్లాలి. ఆమె హయాంలో జరిగిన అక్రమాలు యూపీలోని ప్రతి ఊళ్లో ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. నా ఉద్దేశం ప్రకారం ఆమె యూపీలో తిరిగి కోలుకోవడం దాదాపు కలే’అని యూపీ సీఎం చెప్పుకొచ్చారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి నోట్ల రద్దు అంశంపై మాట్లాడానని యూపీ సీఎం అఖిలేశ్ వెల్లడించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా..‘అవును. ఇబ్బందులు ఉంటాయ్. త్వరలోనే పరిష్కరిస్తాం’అని మోదీ సమాధానమిచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఆర్థిక సంక్షోభం నుంచి ఇండియా బయటపడిందటే బ్లాక్ మనీ వల్లే’నని అఖిలేశ్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఫొటో: ములాయం యుక్తవయసులో, అఖిలేశ్ బాల్యంలో ఉన్నప్పటిది. -
ఆదుకోండి.. మహాప్రభో!
* కరువుపై మోదీకి యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంల వినతి * 11వేల కోట్లు అడిగిన అఖిలేశ్, 12వేల కోట్లు కోరిన సిద్ధరామయ్య * దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు కలసి పనిచేద్దామన్న ప్రధాని న్యూఢిల్లీ: కరువు ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రజలకు తాగునీటినీ అందించలేకున్నామని.. కేంద్రం సాయం చేయాలంటూ.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంల శనివారం ప్రధాని మోదీని వేర్వేరుగా కలసి విన్నవించారు. వివిధ కేంద్ర పథకాల కింద తమ రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఉదయం ప్రధానితో గంటసేపు సమావేశమైన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. కరువు కోరల్లో చిక్కుకున్న యూపీలోచేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వాటిని పూర్తి చేసి ప్రజలను ఆదుకునేందుకు రూ.11వేల కోట్ల నిధులు కావాలని కోరారు. ఇటీవల మహారాష్ట్రకు పంపినట్లే యూపీ (బుందేల్‌ఖండ్)కి కూడా రైళ్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి కేంద్రం ముందుకొచ్చినా.. యూపీ తిరస్కరించరించడాన్ని ప్రధాని ప్రశ్నించినట్లు తెలిసింది. దేశంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా కలసి ముందుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. అఖిలేశ్ మాట్లాడుతూ.. యూపీ కరువుపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, రెండ్రోజుల క్రితం పంపిన సాయంపై పంపిన ప్రతిపాదనలను ఆలస్యం జరగకుండా అమలు చేయాలని మోదీ అధికారులను ఆదేశించారని తెలిపారు. 12వేల కోట్లివ్వండి: కర్ణాటక సీఎం గత 40 ఏళ్లలో ఎన్నడూ ఎరగని కరువును కర్ణాటక ఎదుర్కొంటోందని.. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రధానికి తెలిపారు. ఈ పరిస్థితులనుంచి బయటపడేందుకు రూ.12,272 కోట్లు ఇవ్వాలని కోరారు. 2015-16 రబీ సీజన్లో నష్టపోయిన పంటలకోసం రూ. 723 కోట్లు ఇవ్వాలకి కూడా కోరారు. ‘వీలైనంత ఎక్కువసాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అని మోదీని కలిశాక చెప్పారు. 11 కరువు రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యాక కేంద్రం తన సాయాన్ని అందజేస్తామని ప్రధాని చెప్పినట్లు తెలిసింది. ‘చెరువులు, నదుల పూడికతీతపై రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిపెట్టాలి. రుతుపవనాలు వచ్చేలోపే (మరో 30-40 రోజుల్లో) చెక్‌డ్యామ్‌లను నిర్మించుకోవాలి. రాష్ట్రాలు, కేంద్రం కలసి కరువునుంచి ప్రజలను ఆదుకోవాలి’ అని ముగ్గురు సీఎంలతో భేటీ అనంతరం పీఎంవో విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని వెల్లడించారు. మహారాష్ట్రలో 28వేల గ్రామాల్లో కరువు బీజేపీ పాలిత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కరువు నిధులపై ప్రధానిని కలసి విన్నవించారు. రాష్ట్రంలో 28వేల గ్రామాల్లో తీవ్ర కరువు ఉందని, అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించే పనులకోసం వివిధ కేంద్ర పథకాలకు నిధులు పెంచాలని కోరారు. మరాఠ్వాడా, పశ్చిమ విదర్భ, అహ్మద్‌నగర్, సోలాపూర్, సాంగ్లి జిల్లాల్లో నెలకొన్న దుర్భిక్షాన్ని ప్రజెంటేషన్‌లో ప్రధానికి చూపించిన ఫడ్నవిస్.. ఛత్రపతి శివాజీ పాటించిన పద్ధతుల ద్వారా కరువుకు శాశ్వత పరిష్కారం కోసం వేసుకున్న ప్రణాళికలను వివరించారు. అనంతరం ఫఢ్నవిస్ మాట్లాడుతూ.. వచ్చే 2-3ఏళ్లలో కరువును నిర్మూలించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల పూడికతీత పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. -
అఖిలేశ్ సంచలన నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గంలోని ఏకంగా 8 మంది మంత్రులపై వేటు వేశారు. 8 మంది మంత్రులను తొలగించారు. ఉద్వాసనకు గురైన వారిలో ఐదుగురు మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు. అయితే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో భాగంగానే వీరిని తొలగించినట్టు తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త మంత్రులను నియమించే అవకాశముంది. ఈనెల 31న కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని, కొత్తవాళ్లను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. తన పాలనపై అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో దిద్దుబాట చర్యల్లో భాగంగా అఖిలేశ్ మంత్రులను తొలగించినట్టు తెలుస్తోంది. స్వయంగా తన తండ్రే తరచూ విమర్శలు చేయడం అఖిలేశ్ కు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో పనిచేయని మంత్రులను తొలగించి కేబినెట్ ను ప్రక్షాళన చేసేందుకు అఖిలేశ్ ఉపక్రమించినట్టు కనబడుతోంది.