ఆదుకోండి.. మహాప్రభో!
* కరువుపై మోదీకి యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంల వినతి
* 11వేల కోట్లు అడిగిన అఖిలేశ్, 12వేల కోట్లు కోరిన సిద్ధరామయ్య
* దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు కలసి పనిచేద్దామన్న ప్రధాని
న్యూఢిల్లీ: కరువు ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రజలకు తాగునీటినీ అందించలేకున్నామని.. కేంద్రం సాయం చేయాలంటూ.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంల శనివారం ప్రధాని మోదీని వేర్వేరుగా కలసి విన్నవించారు. వివిధ కేంద్ర పథకాల కింద తమ రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఉదయం ప్రధానితో గంటసేపు సమావేశమైన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్..
కరువు కోరల్లో చిక్కుకున్న యూపీలోచేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వాటిని పూర్తి చేసి ప్రజలను ఆదుకునేందుకు రూ.11వేల కోట్ల నిధులు కావాలని కోరారు. ఇటీవల మహారాష్ట్రకు పంపినట్లే యూపీ (బుందేల్‌ఖండ్)కి కూడా రైళ్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి కేంద్రం ముందుకొచ్చినా.. యూపీ తిరస్కరించరించడాన్ని ప్రధాని ప్రశ్నించినట్లు తెలిసింది. దేశంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా కలసి ముందుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. అఖిలేశ్ మాట్లాడుతూ.. యూపీ కరువుపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, రెండ్రోజుల క్రితం పంపిన సాయంపై పంపిన ప్రతిపాదనలను ఆలస్యం జరగకుండా అమలు చేయాలని మోదీ అధికారులను ఆదేశించారని తెలిపారు.
12వేల కోట్లివ్వండి: కర్ణాటక సీఎం
గత 40 ఏళ్లలో ఎన్నడూ ఎరగని కరువును కర్ణాటక ఎదుర్కొంటోందని.. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రధానికి తెలిపారు. ఈ పరిస్థితులనుంచి బయటపడేందుకు రూ.12,272 కోట్లు ఇవ్వాలని కోరారు. 2015-16 రబీ సీజన్లో నష్టపోయిన పంటలకోసం రూ. 723 కోట్లు ఇవ్వాలకి కూడా కోరారు. ‘వీలైనంత ఎక్కువసాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అని మోదీని కలిశాక చెప్పారు. 11 కరువు రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యాక కేంద్రం తన సాయాన్ని అందజేస్తామని ప్రధాని చెప్పినట్లు తెలిసింది.
‘చెరువులు, నదుల పూడికతీతపై రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిపెట్టాలి. రుతుపవనాలు వచ్చేలోపే (మరో 30-40 రోజుల్లో) చెక్‌డ్యామ్‌లను నిర్మించుకోవాలి. రాష్ట్రాలు, కేంద్రం కలసి కరువునుంచి ప్రజలను ఆదుకోవాలి’ అని ముగ్గురు సీఎంలతో భేటీ అనంతరం పీఎంవో విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని వెల్లడించారు.
మహారాష్ట్రలో 28వేల గ్రామాల్లో కరువు
బీజేపీ పాలిత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కరువు నిధులపై ప్రధానిని కలసి విన్నవించారు. రాష్ట్రంలో 28వేల గ్రామాల్లో తీవ్ర కరువు ఉందని, అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించే పనులకోసం వివిధ కేంద్ర పథకాలకు నిధులు పెంచాలని కోరారు. మరాఠ్వాడా, పశ్చిమ విదర్భ, అహ్మద్‌నగర్, సోలాపూర్, సాంగ్లి జిల్లాల్లో నెలకొన్న దుర్భిక్షాన్ని ప్రజెంటేషన్‌లో ప్రధానికి చూపించిన ఫడ్నవిస్.. ఛత్రపతి శివాజీ పాటించిన పద్ధతుల ద్వారా కరువుకు శాశ్వత పరిష్కారం కోసం వేసుకున్న ప్రణాళికలను వివరించారు. అనంతరం ఫఢ్నవిస్ మాట్లాడుతూ.. వచ్చే 2-3ఏళ్లలో కరువును నిర్మూలించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల పూడికతీత పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు.