పచపదరా(రాజస్థాన్): భారీ హామీలు, శంకుస్థాపనలతో ప్రజల్ని మోసగించడం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రూ. 43,129 కోట్లతో రాజస్థాన్‌లో నిర్మించనున్న బార్మర్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు పనుల్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పేరు కోసం రైల్వే ప్రాజెక్టుల్ని ప్రకటించేవారు. అవి కనీసం వెలుగు చూడలేదు.
రాజస్థాన్‌లో కరవు, కాంగ్రెస్‌లు కలిసికట్టుగా సాగేవి, ఆ పార్టీ తప్పుకున్నాక రాష్ట్రానికి కరవు నుంచి విముక్తి దొరికింది’ అని మోదీ పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రూ. 500 కోట్లతో హాడావుడిగా ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ ప్రకటించిందని, కనీసం లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేయలేదని ప్రధాని తప్పుపట్టారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 10,700 కోట్లు చెల్లించిందని చెప్పారు.
కాంగ్రెస్ కేవలం గరీబీ హటావో నినాదాలు మాత్రమే ఇస్తే.. దాన్ని సాధ్యం చేసేందుకు పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, 4 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బార్మర్ ప్రాజెక్టు ఘనత తమదేనంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రకటించుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2013లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మరోసారి మోదీ శంకుస్థాపన చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment