మిషన్ భగీరథ శరవేగంగా యజ్ఞం | Mission bhagiratha as rapidly | Sakshi
Sakshi News home page

మిషన్ భగీరథ శరవేగంగా యజ్ఞం

Published Wed, Jun 1 2016 3:31 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

మిషన్ భగీరథ శరవేగంగా యజ్ఞం - Sakshi

మిషన్ భగీరథ శరవేగంగా యజ్ఞం

- ఇంటింటికీ తాగునీరు అందించేందుకు సర్కారు చర్యలు
- రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం వరకు పూర్తయిన పనులు
- ఆగస్టులోగా తొలిదశలో తొమ్మిది నియోజకవర్గాలకు నీరు
- 2018 డిసెంబర్ నాటికి 28 వేల గ్రామాలకు అందించడమే లక్ష్యం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక అయిన ఈ ప్రాజెక్టుకు 2014 డిసెంబర్‌లో ప్రణాళికలను సిద్ధం చేయగా 2015 ఆగస్టులో పనులు ప్రారంభమయ్యాయి. ఈ పది నెలల కాలంలో మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 25 శాతం పూర్తయినట్లు అంచనా. రూ.40 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు మొత్తం అంచనాలో 20 శాతం (రూ.8 వేల కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా అందిస్తుండగా... హడ్కో, నాబార్డ్ తదితర ఆర్థిక సంస్థలు, వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.32 వేల కోట్ల దాకా సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే హడ్కో రూ.10 వేల కోట్లు, నాబార్డ్ రూ.3,200 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు అంగీకరించాయి.

 వచ్చే ఎన్నికలలోపు పూర్తికి ప్రణాళికలు
 రానున్న సాధారణ ఎన్నికల్లోగా మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. పనులు పూర్తయిన ప్రాంతాల్లో దశల వారీగా నీరందించాలని నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి గజ్వేల్, దుబ్బాక, మేడ్చల్ నియోజకవర్గాలకు, జూలై ఆఖరుకు సిద్ధిపేట, ఆలేరు, భువనగిరి, ఆగస్టులోగా స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, పాలకుర్తి నియోజకర్గాలకు మంచినీరు అందనుంది. డిసెంబర్ కల్లా రాష్ట్రంలోని 6,100 గ్రామాలకు, 2017 డిసెంబర్ నాటికి 10 వేల గ్రామాలకు, 2018 డిసెంబర్ నాటికి మరో 12 వేల గ్రామాలకు కచ్చితంగా తాగునీరిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే 19 నీటి వనరుల వద్ద ఇంటేక్ వెల్స్ నిర్మాణం ఊపందుకోగా ప్రధాన పైప్‌లైన్ల ఏర్పాటు శరవే గంగా జరుగుతోంది. వ్యవసాయ భూముల నుంచి పైప్‌లైన్ ఏర్పాటు వలన రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. తొలిదశలో నీరందించే తొమ్మిది నియోజవర్గాల్లో అంతర్గత పైప్‌లైన్ల ఏర్పాటు తుదిదశకు చేరుకుంది.

 ప్రారంభం నుంచే అవార్డులు, ప్రశంసలు
 మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంది. హడ్కో, నాబార్డు తదితర ఆర్థిక సంస్థలు దీనికి అవార్డులూ ఇచ్చాయి. ఆరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఈ సంకల్పాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ ప్రాజెక్టును తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం విశేషం.

 నాణ్యతకు పెద్ద పీట
 ఈ ప్రాజెక్టు అంచనాలు, డిజైన్లతో పాటు పైప్‌లైన్ల నాణ్యతను తనిఖీ చేసే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ప్రతి సెగ్మెంట్‌లో తప్పనిసరిగా ఒక ప్రాజెక్టు మేనేజర్, ఇద్దరు సైట్ ఇంజనీర్లు ఉండేలా చర్యలు చేపట్టింది. డిజైన్ల తనిఖీకి తొమ్మిది మంది, పైపుల నాణ్యత పరిశీలనకు ఆయా కంపెనీల వద్ద 15 మంది సిబ్బందిని వ్యాప్కోస్ నియమించింది.
 
 ఆడబిడ్డల పాదాలు కడుగుతాం
  ‘‘రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డా మంచినీళ్ల కోసం నెత్తిన బిందె పెట్టుకుని రోడ్డెక్క కూడదనేది సీఎం కేసీఆర్ ఆశయం. వచ్చే సాధారణ ఎన్నికల్లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ న ల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీళ్లతో ఆడబిడ్డల పాదాలు కడగాలన్నది ఆయన సంకల్పం. ఇందులో భాగస్వామి కావడం నా అదృష్టం. ప్రాజెక్టుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా వర్క్ ఏజెన్సీలను, ప్రభుత్వ సిబ్బందిని సమన్వయం చేసే బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాం. అనుకున్న సమయానికే మిషన్ భగీరథ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం..’’
 - వేముల ప్రశాంత్‌రెడ్డి, మిషన్ భగీరథ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement