చాకిబండ గ్రామంలో కుళాయి వద్ద బారులు తీరిన బిందెలు
కరువు.. దరువు
Published Sat, Mar 25 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
కనికరం లేని సర్కారు
– కరువు మండలాల్లో చర్యలు శూన్యం
– పనుల్లేక వలస పోతున్న గ్రామీణ ప్రజలు
– మేత లేక కబేళాలకు తరలుతున్న పశువులు
– సాంకేతిక కారణాలతో రైతులకు అందని ఇన్‌పుట్ సబ్సిడీ
– తాగునీటికి అల్లాడుతున్న పల్లెలు
– నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
హాలహర్వి మండలంలోని చాకిబండ గ్రామంలో శిరుగాపురం పంప్‌హౌస్ నుంచి రోజు విడిచి రోజు నీరు సరఫరా కావాల్సి ఉండగా.. పది నుంచి 20 రోజులకోసారి సరఫరా జరుగుతోంది. స్థానికంగా ఒక్కో బిందె నీరు రూ.20లకు విక్రయిస్తుండటంతో గ్రామస్తులు గొంతెండుతోంది. విధిలేని పరిస్థితుల్లో నాలుగు కిలోమీటర్ల దూరంలోని బేవినహాలు వక్రేణి నుంచి ట్రాక్టర్, ఎద్దుల బండిపై అతి కష్టంపై నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించినా.. చేపట్టిన చర్యలు నామమాత్రమే. మేత లేక పశువులను కబేళాలకు తరలిస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి రైతులు పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. అనేక మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇప్పటికే దాదాపు 140 గ్రామాల్లోని ప్రజలు చుక్కనీటి కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ప్రస్తుత వేసవిలో ఈ గ్రామాలకు ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీటిని అందించేందుకు రూ.10.62 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే గత ఏడాదికి సంబంధించిన నిధులే ఇప్పటికీ అందని పరిస్థితుల్లో ఈ వేసవిలో చేపట్టే కార్యక్రమాలకు నిధులు విడుదల అవుతాయా? లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ నెలాఖరుకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. అలాగే ఫిబ్రవరి నెల నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేస్తున్న పనులకు కూడా కూలీలకు వేతనాలు అందని పరిస్థితి. దాదాపు రూ.10కోట్ల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉండటం.. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు జంకుతున్నారు.
కరువు మండలాల్లో చర్యలు శూన్యం
జిల్లాలోని 36 కరువు మండలాల్లో పశువులకు మేత, నీరు, నీటి తొట్ల నిర్మాణాలు, ఇతరత్రా పనులు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం రూ.16.20 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం కేవలం రూ.6 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ఈ అరకొర నిధులతో పలు ప్రాంతాల్లో గడ్డి విత్తనాలు, పశుగ్రాసం, మొలకగడ్డి పెంచుకునేందుకు చర్యలు చేపట్టారు. మెజారిటీ గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల్లోని రైతులు పశువులను కబేళాలకు తరలించి వలసలు వెళ్తున్నారు.
రైతులకు అందని ఇన్‌పుట్ సబ్సిడీ
2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 40 మండలాలకు చెందిన రైతులకు రూ.275 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలైనా, పలు సాంకేతిక కారణాలతో 20 శాతం మినహా మిగిలిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందని పరిస్థితి నెలకొంది. అలాగే 2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా జిల్లాలోని పత్తికొండ, దేవనకొండ, మద్దికెర, తుగ్గలి, ఆలూరు మండలాల్లోని రైతులకు రూ.77 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందాల్సి ఉంది.
తాగునీటికి కటకట
వేసవి ప్రారంభంలోనే జిల్లాలో తాగునీటికి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే దాదాపు 140 గ్రామాలు తీవ్ర దాహార్తిని ఎదుర్కొంటున్నాయి. మున్సిపల్ ప్రాంతాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో సైతం వారానికి ఒకటి లేక రెండు సార్లు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది 100 మజరా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, 40 మజరా గ్రామాలకు హైరింగ్ ద్వారా నీటిని అందించాలని, 846 బోర్లలో ఫ్లషింగ్, 1151 బోర్లలో డీపెనింగ్ చేయాలని.. ఇందుకు రూ.10.62 కోట్లు అవసరమవుతాయని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2.78 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
చతికిల పడిన ఎన్టీఆర్ గృహ నిర్మాణం
జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం చతికిల పడింది. ఈ నెలాఖరు నాటికి జిల్లాకు మంజూరైన గృహాలన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాకు జీఓలు 103, 114 ప్రకారం 14,850 గృహాలు కేటాయించగా.. 13,534 గృహాలు మంజూరయ్యాయి. అయితే క్షేత్ర స్థాయి సిబ్బంది లేకపోవడం, గృహ నిర్మాణ లబ్ధిదారుల వాటా ఉన్న కారణంగా గృహ నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి. అలాగే జీఓ నెంబర్ 104 ప్రకారం 4,246 గృహాలు కేటాయించగా.. 3,437 మందిని అర్హులుగా తేల్చారు. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ వివిధ కారణాల వల్ల ఈ పథకం పనులు చురుగ్గా సాగడం లేదు.
Advertisement