కరువు కరాళ నృత్యం | Farmers Change Became Migration Workers In Prakasam | Sakshi
Sakshi News home page

కరువు కరాళ నృత్యం

Published Fri, Apr 6 2018 12:29 PM | Last Updated on Fri, Apr 6 2018 12:29 PM

Farmers Change Became Migration Workers In Prakasam - Sakshi

గుడ్లూరు మండలంలో వర్షాలు లేక బీడువారిన భూములు

గుడ్లూరు:గుడ్లూరు మండలంలో కరువు కరాళ నత్యం చేస్తోంది. వందలాది మంది కూలీలకు పనులు కల్పిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న అన్నదాతలు ఐదేళ్ల నుంచి కరువు ధాటికి విలవిల్లాడుతున్నారు. పంటలు పండక పోవడంతో వారే కూలీలుగా మారి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. వలస పోయిన రైతులు ఒక్కొక్కరికి 5 నుంచి 10 ఎకరాల భూములు ఉన్నాయి. ఉన్న ఊరిని, నమ్ముకున్న భూమిని వదిలేసి ముఠా కూలీలుగా, హోటళ్లలో సర్వర్లుగా మారారు. కూల్‌డ్రింక్‌లు విక్రయిస్తూ భారంగా జీవనం గడుపుతున్నారు. సోమశిల కాలువ పూర్తి చేసి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు అందించి ఉంటే భూములు బీడుగా మారేవి కావు. రైతులు ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సిన అవసరం ఉండేది కాదు.

వలసవెళ్లిన వందలాది రైతు కుటుంబాలు
రాళ్లపాడు ప్రాజెక్టు కుడికాలువ కింద గుడ్లూరు మండలంలోని పూరేటిపల్లి, దారకానిపాడు, చెంచిరెడ్డిపాలెం, వెంకంపేట, బసిరెడ్డిపాలెం, రాళ్లపాడు, గుండ్లపాలెం, గుడ్లూరు గ్రామాల్లో 6 వేల ఎకరాల భూమి సాగయ్యేది. వరి, పత్తి పంటలను ఇక్కడి రైతులు పండిస్తారు. ఐదేళ్ల నుంచి సక్రమంగా వర్షాలు కురవకపోవడం వలన ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో పంటలు పండటం లేదు. రాళ్లపాడుకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలుపెట్టిన సోమశిల కాలువ పనును ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఈ ఏడాది కూడా పంటలు పండకపోవడం వల్ల దారకానిపాడులో 100 కుటుంబాలు, బసిరెడ్డిపాలెంలో 120 కుటుంబాలు, వెంకంపేట, రాళ్లపాడు గ్రామాల నుంచి 70 కుటుంబాల చొప్పున రైతులు పొలాలను వదిలి బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్, విజయవాడ, ఒడిశా, నెల్లూరు, బెంగళూరు పట్టణాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. 

కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం
గుడ్లూరు మండలంలో ఉన్న 28 మేజర్, మైనర్‌ చెరువులు కింద 5 వేల ఎకరాల్లో పంటలు పండేవి. చెరువులకు కూడా చుక్క నీరు చేరకపోవడం వల్ల చెరువుల కింద ఉన్న మాగాణి భూములు కూడా బీడుగా మారాయి. పాజర్ల, స్వర్ణాజీపురం, అడవిరాజుపాలెం, చినలాటరపి, అమ్మవారిపాలెం గ్రామాల నుంచి వందల మంది ఇతర ప్రాంతాల్లో కూల్‌డ్రింక్‌ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. మండలంలో కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సోమశిల కాలువ పూర్తి అయ్యే వరకు తమ బతుకులు ఇలాగే ఉంటాయని రైతులు మనోవేదనతో చెబుతున్నారు. ఇప్పటికే ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతుండటం వల్ల గ్రామాలు నిర్మానుష్యంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ నెలాఖరుకు అన్ని గ్రామాల నుంచి పనులు కోసం వేలాది మంది వలస బాట పట్టే అవకాశం ఉంది. కొంత మంది మహిళా కూలీలు పనుల కోసం జరుగుమల్లి, టంగుటూరు, పొన్నలూరు, కొండాపురం, కందుకూరు మండలాలకు శనగ కోతలకు వెళ్తున్నారు. మండలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి 4,476 హెక్టార్లలో పంటలు పండాల్సి ఉండగా కేవలం 729 హెక్టార్లలో మాత్రమే పంటలు పండుతున్నాయి. ఈ గణాంకాలే మండలంలో కరువు ఎలా తాండవం చేస్తుందో అర్థం అవుతుంది.

ముఠా కూలీలుగా బతుకుతున్నారు
మాకు నాలుగెకరాల పొలం ఉంది. పంటలు పండకపోవడంతో నా కొడుకు, కోడలు విజయవాడకు వలసపోయారు. ముఠా కూలీలుగా పని చేసుకుని బతుకుతున్నారు. నలుగురుకి అన్నం పెట్టిన మేము ఈ రోజు అదే అన్నం కోసం వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామంలో 120కి పైగా కుటుంబాలు పనుల కోసం వలసపోయాయి. కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని పోయారు. కొందరేమో వృద్ధులను ఇళ్ల వద్ద వదిలిపోయారు.            – ఈశ్వరమ్మ, బసిరెడ్డిపాలెం

కూల్‌డ్రింక్‌ షాపు పెట్టుకున్నాం
రాళ్లపాడు ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో దారకానిపాడులో వంద కుటుంబాలు పనుల కోసం దూర ప్రాంతాలకు వలసపోయారు. కొంతమంది కూల్‌ డ్రింక్‌ దుకాణాలు నడుపుకుంటున్నారు. నేను కూడా 4 ఎకరాల భూమిని వదిలి వరంగల్‌లో జ్యూస్‌ దుకాణం నడుపుకుంటున్నా. అదే సోమశిల కాలువ పూర్తి చేసి ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు. ఇప్పటికైనా కాలువ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.        – హరిబాబు, దారకానిపాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement