ఉపాధి ‘కల్పనే’! | workers 10 per cent of the work has created a month | Sakshi
Sakshi News home page

ఉపాధి ‘కల్పనే’!

Published Tue, Dec 1 2015 12:57 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఉపాధి ‘కల్పనే’! - Sakshi

ఉపాధి ‘కల్పనే’!

 నెలరోజుల్లో పని కల్పించింది 10శాతం కూలీలకే
 కరువులోనూ ముందుకు సాగని పనులు
 రబీ సాగు మందగించడంతో పనికోసం కూలీల వెతలు

 ‘‘కరువు కాలంలో కూలీలను ఆదుకుంటాం.. వారికి ఉపాధి పనులు కల్పించి ఆసరాగా నిలుస్తాం.. వలసలు లేకుండా స్థానికంగానే పనులు కల్పిస్తాం’’. ఇవీ మంత్రులు రోజూ చెబుతున్న మాటలు.. కానీ, ఈ పరిస్థితి జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జాబ్‌కార్డులున్నా ఉపాధి పనులు లేక వందలాది మంది కూలీలు బతుకు దెరువు లేక ఆందోళన చెందుతున్నారు.

 పనులు కల్పించింది ఇలా...
 జిల్లాలోని ఉపాధి కూలీలు    4,00,115
 జాబ్‌కార్డులున్న వారు    2,86,832
 నవంబర్‌లో పనులు చేసింది    28,957

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘ఉపాధి’ పనులు పడకేశాయి. కరువు నేపథ్యంలో ప్రతి కూలీకి పనికి పని కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ.. వర్షాల జాడ లేకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ఉపాధి పనులు కల్పిస్తారని ఎదురు చూస్తున్న కూలీలకు యంత్రాంగం ఉత్తి చేతులే చూపిస్తోంది. ఈ నెల మొదటివారం నుంచే ఉపాధి పనుల జోరు పెంచి జాబ్ కార్డులున్న కూలీలందరికీ పని కల్పించాల్సి ఉండగా.. గతవారం చివరి నాటికి కేవలం 28,957 మందికి మాత్రమే పని కల్పించినట్లు ఆ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం జాబ్‌కార్డులున్న కూలీల్లో కేవలం 10శాతం మందికి మాత్రమే పని కల్పించినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో 33 గ్రామీణ మండలాలుండగా.. ఇందులో 28 మండలాల్లో ఉపాధి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత వార్షిక సంవత్సరంలో గ్రామాల వారీగా ప్రణాళికలు తయారు చేశారు. మట్టి రోడ్లు, సూక్ష్మనీటిపారుదల ట్యాంకులు, ఊట కుంటలు తదితర పనులతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశారు. ఈ పనుల్లో జిల్లా వ్యాప్తంగా 4లక్షల మందికి పని కల్పించాలనే లక్ష్యంతో కార్యాచరణకు ఉపక్రమించారు. అయితే ప్రణాళిక తయారు చేయడంలో వేగం.. పనుల కల్పనలో మాత్రం చూపడంలేదు.

 ముచ్చటగా మూడురోజులే..
 నవంబర్ నెలలో ఇప్పటివరకు 28,957 మంది కూలీలకు ఉపాధి పని కల్పించారు. అయితే వీరిలో 55.06శాతం మంది కేవలం మూడు రోజులపాటు మాత్రమే పనికి హాజరైనట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. 4 నుంచి 7రోజుల పాటు పనిచేసిన కూలీలు 15.55శాతం కాగా, 8 నుంచి 15రోజుల పాటు పనిచేసిన కూలీలు 14.2శాతం మంది ఉన్నారు. 10.58శాతం మంది కూలీలు మాత్రం 16 నుంచి 30 రోజుల పనిదినాల్లో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పనులు చేసేందుకు కూలీలు సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ సిబ్బంది మాత్రం శ్రద్ధ కనబర్చడం లేదు. చేవెళ్ల మండలం మల్‌రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ కూలీ పని కల్పించాలని అధికారులను కోరుతున్నప్పటికీ ‘మరో రెండ్రోజుల్లో పనులు ప్రారంభిస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు.

 నీరసించిన ‘ఉత్సాహం’
 ఉపాధి పనుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఉపాధి సిబ్బంది రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టిన సంగతి తెలిసింది.
 ఈ క్రమంలో ఉద్యోగ క్రమబద్ధీకరణతో పాటు వేతనాల పెంపు తదితర డిమాండ్లతో సమ్మె చేపట్టగా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో గత వేతనాలతోనే తిరిగి విధి నిర్వహణలో చేరిన ఆయా సిబ్బంది తాజాగా లక్ష్యసాధనలో ఉత్సాహం చూపడం లేదు. ఏళ్లుగా అరకొర వేతనాలతో పనిచేస్తున్నామని ఉపాధి ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఒకరు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement