24 కెమెరాలతో...
ఒకటి.. రెండు.. మూడు.. ఇక్కడెన్ని కెమెరాలున్నాయో లెక్కపెడుతున్నారా? ఫొటోలో కనిపించేవి డజను పైగా అయినా, కనిపించనివి ఇంకా ఉన్నాయి. మొత్తం 24 కెమెరాలు. కానీ, అన్నీ ఒక్క కెమేరాగానే పని చేస్తాయట! ఆ కెమేరాలన్నిటినీ ఒక్కదానిలో బిగించారు కదా... ఆ వీఆర్ (వీఆర్ అంటే వర్చ్యు వల్ రియాలిటీ) రిగ్ కెమేరా పేరు బీబీ360సీసీ. ఈ 360 డిగ్రీల కెమేరా రిగ్‌ను ఏయండీ రాడియన్ గ్రాఫిక్స్ సంస్థ ‘బాహుబలి-2’ వీఆర్ వీడియో కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. పేరుకి తగ్గట్టు 360 డిగ్రీల కోణంలో సన్నివేశాన్ని చిత్రీకరించగల సామర్థ్యం ఈ కెమేరా సొంతం. ఇంతకీ, ఈ కెమేరా ఎందుకంటారా? ప్రేక్షకులం దర్నీ మాహిష్మతి సామ్రాజ్యంలోకి తీసుకు వెళ్లడానికి, ఊహాలోకంలో విహరించే అవకాశం కల్పించడానికి.
సాధారణంగా ప్రేక్షకులు తెరపై చిత్రాన్ని మాత్రమే చూస్తారు. అయితే.. ఆ సన్నివేశం జరుగుతున్న ప్రాంతంలోనే తామూ భాగమై, పాత్ర ధారుల తరహాలో ప్రేక్షకులూ సంచరించగలి గితే... దాన్ని ‘వర్చ్యువల్ రియాలిటీ’ అంటారు. ‘ఆన్ ది సెట్స్ ఆఫ్ బాహుబలి’ పేరుతో దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ‘వీఆర్’ వీడియో టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి’ పేరిట వీఆర్ వీడియోను స్వయంగా ఈ బీబీ360తో తీస్తున్నారు. ‘‘ఈ కెమెరాతో చిత్రీ కరణ గొప్ప అనుభవం’’ అని కెమేరామన్ సెంథిల్‌కుమార్ చెప్పారు. ‘‘చిత్రసీమలో ప్రవేశించిన పాతికేళ్ల తర్వాత ‘వీఆర్’ పరిజ్ఞానం తొలిసారి వాడుతున్నా. ఇది ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి’ ఫస్ట్ డే షూటింగ్’’ అంటూ రాజమౌళి పైనున్న నటీనటులతో ఫొటోను ట్వీట్ చేశారు.
వీఆర్ చిత్రీకరణలో నటీనటులతో రాజమౌళి