V. Usha Rani
-
టీచర్ పరీక్షలకు ప్రత్యేక సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షలకు ప్రత్యేక సిలబస్‌ను పెడుతున్నామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పేర్కొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష రెండింటినీ కలిపి ఒకే పరీక్షగా నిర్వహిస్తున్నందున ప్రత్యేక సిలబస్‌ను అనుసరిస్తామని ఆమె బుధవారం ‘సాక్షి’కి వివరించారు. ఈ సిలబస్ అంశాలను త్వరలోనే తమ శాఖ వెబ్సైట్లో ప్రకటిస్తామన్నారు. ఈసారి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారిలో వివిధ సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని అంచనా వేయడంతో పాటు బోధనాపద్ధతులు, పాఠశాల నిర్వహణలోని మెలకువలను కూడా అంచనా వేస్తామని చెప్పారు. గతంలో టెట్, డీఎస్సీ ఉన్నప్పుడు వేర్వేరుగా సిలబస్‌ను అనుసరించి ప్రశ్నలు రూపొందించి ఇచ్చేవారని.. ఇప్పుడు ఒక్కటే పరీక్ష అయినందున పాత సిలబస్ కాకుండా ప్రత్యేక సిలబస్‌ను ప్రకటిస్తామని తెలిపారు. ఆర్థికశాఖ నుంచి అనుమతి వచ్చిన మేరకు 9,061 పోస్టులను భర్తీచేస్తున్నామని, ఆ సంఖ్య మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను రోస్టర్ పద్ధతిలో తెప్పిస్తున్నామన్నారు. టెట్ రాసినవారికి 20 శాతం వెయిటేజీ... గతంలో టెట్ పరీక్షలో అర్హులైన వారికి ఈసారి పరీక్షలో 20 శాతం మార్కులు వెయిటేజీగా ఇవ్వనున్నామని ఉషారాణి స్పష్టంచేశారు. వెయిటేజీ విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలపై ఆమె స్పందిస్తూ.. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే ఈ వెయిటేజీ నిర్ణయాన్ని తీసుకున్నామని వివరించారు. గతంలో టెట్ రాసిన వారికి వారు సాధించిన మార్కులను అనుసరించి ఆ తరువాత జరిగే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇచ్చేవారమని తెలిపారు. అదే విధానం ఇప్పుడూ కొనసాగుతుందన్నారు. ఈ 20 శాతం వెయిటేజీ అయితే గతంలో టెట్‌లో వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కులలో ఏది ఎక్కువగా ఉంటే దానినే కలుపుతామన్నారు. ‘‘ఉదాహరణకు గతంలో టెట్ రాసిన అభ్యర్థికి వందకు 60 మార్కులు వచ్చి ఉంటే అందులో 20 శాతం అంటే 12 మార్కుల మేరకు తదుపరి డీఎస్సీలో వెయిటేజీ ఉండేది. ఇపుడు టెట్, టెర్ట్ కలసి 200 మార్కులకు పెడుతున్నాం. ఇందులో ఆ అభ్యర్థికి 80 మార్కులు వస్తే గతంలోని వెయిటేజీ ప్రకారం 20 శాతం అంటే 16 మార్కులు ఉంటుంది. గతంలోని వెయిటేజీ 12 కన్నా ఇపుడు 4 మార్కులు ఎక్కువ వెయిటేజీ వచ్చినందున ఆ అభ్యర్థికి వచ్చిన 80 మార్కులకు 4 మార్కులు కలిపి 84 మార్కులు సాధించినట్లుగా పరిగణిస్తాం’’ అని వివరించారు. మునిసిపల్ పాఠశాలల్లోని 1,250 టీచర్ల పోస్టులను ఈ డీఎస్సీలోనే కలిపి భర్తీచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
సర్కార్ స్కూళ్లలో మెరుగైన విద్య
ఒంగోలు వన్‌టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య బోధించేందుకు రాజీవ్ విద్యా మిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి జూలై 31వ తేది వరకు సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వీ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా విద్యార్థుల్లో మాతృభాష(తెలుగు), గణితంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. బడి ఈడు బాలబాలికలందరినీ పాఠశాలలకు ఆకర్షించేలా స్కూళ్లను సిద్ధం చేయాలని చెప్పారు. పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు చివరి తరగతి వరకు కొనసాగేలా కృషి చేయాలన్నారు. నాలుగు భాషా నైపుణ్యాలు(వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం), గణితంలో చతుర్విద ప్రక్రియల(కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం)పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో ఉదయం పూట సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తెలుగు, గణితంలో కనీసం ఏ లేదా బీ గ్రేడు సాధించేలా తీర్చిదిద్దాలని చెప్పారు. విద్యార్థులతో రోజూ హోమ్ వర్క్ చేయించడంతో పాటు క్రమశిక్షణను పెంపొందించాలన్నారు. పాఠశాల, తరగతి సంసిద్ధత కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జిల్లా, మండలస్థాయిల్లో మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రాజెక్టు అధికారులను ఉషారాణి ఆదేశించారు. జిల్లా స్థాయిలో డైట్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉప విద్యాధికారులు, రాజీవ్ విద్యామిషన్ ఏఎంఓలు, ఏఏఎంఓలు, డీఆర్పీలు, జిల్లా స్థాయి మానిటరింగ్ టీం సభ్యులతో బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎమ్మార్పీలు, సీఆర్పీలతో కమిటీలు వేయాలని చెప్పారు. రాష్ట్రస్థాయి బృందాలు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయని తెలిపారు. సంసిద్ధత కార్యక్రమాలను పక్కాగా నిర్వహించండి జిల్లాలో పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని ఎంఈఓలు, హెచ్ఎంలను రాజీవ్ విద్యామిషన్ పీడీ వీ శ్రీనివాసరావు ఆదేశించారు. పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల అమలుకు సంబంధించి గత ఏడాది సరఫరా చేసిన మాడ్యూల్స్‌నే ఉపయోగించాలని చెప్పారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్ధుల కోసం వేసవి సెలవుల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల కోసం పంపిణీ చేసిన వర్క్‌బుక్‌లను ప్రతి పాఠశాలకు ఒకటి చొప్పున సరఫరా చేసి అందులోని అంశాలను విద్యార్థులకు వివరించాలని పీడీ శ్రీనివాసరావు సూచించారు.