సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షలకు ప్రత్యేక సిలబస్‌ను పెడుతున్నామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పేర్కొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష రెండింటినీ కలిపి ఒకే పరీక్షగా నిర్వహిస్తున్నందున ప్రత్యేక సిలబస్‌ను అనుసరిస్తామని ఆమె బుధవారం ‘సాక్షి’కి వివరించారు.
ఈ సిలబస్ అంశాలను త్వరలోనే తమ శాఖ వెబ్‌సైట్లో ప్రకటిస్తామన్నారు. ఈసారి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారిలో వివిధ సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని అంచనా వేయడంతో పాటు బోధనాపద్ధతులు, పాఠశాల నిర్వహణలోని మెలకువలను కూడా అంచనా వేస్తామని చెప్పారు. గతంలో టెట్, డీఎస్సీ ఉన్నప్పుడు వేర్వేరుగా సిలబస్‌ను అనుసరించి ప్రశ్నలు రూపొందించి ఇచ్చేవారని.. ఇప్పుడు ఒక్కటే పరీక్ష అయినందున పాత సిలబస్ కాకుండా ప్రత్యేక సిలబస్‌ను ప్రకటిస్తామని తెలిపారు. ఆర్థికశాఖ నుంచి అనుమతి వచ్చిన మేరకు 9,061 పోస్టులను భర్తీచేస్తున్నామని, ఆ సంఖ్య మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను రోస్టర్ పద్ధతిలో తెప్పిస్తున్నామన్నారు.
టెట్ రాసినవారికి 20 శాతం వెయిటేజీ...
గతంలో టెట్ పరీక్షలో అర్హులైన వారికి ఈసారి పరీక్షలో 20 శాతం మార్కులు వెయిటేజీగా ఇవ్వనున్నామని ఉషారాణి స్పష్టంచేశారు. వెయిటేజీ విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలపై ఆమె స్పందిస్తూ.. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే ఈ వెయిటేజీ నిర్ణయాన్ని తీసుకున్నామని వివరించారు. గతంలో టెట్ రాసిన వారికి వారు సాధించిన మార్కులను అనుసరించి ఆ తరువాత జరిగే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇచ్చేవారమని తెలిపారు. అదే విధానం ఇప్పుడూ కొనసాగుతుందన్నారు. ఈ 20 శాతం వెయిటేజీ అయితే గతంలో టెట్‌లో వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కులలో ఏది ఎక్కువగా ఉంటే దానినే కలుపుతామన్నారు.
‘‘ఉదాహరణకు గతంలో టెట్ రాసిన అభ్యర్థికి వందకు 60 మార్కులు వచ్చి ఉంటే అందులో 20 శాతం అంటే 12 మార్కుల మేరకు తదుపరి డీఎస్సీలో వెయిటేజీ ఉండేది. ఇపుడు టెట్, టెర్ట్ కలసి 200 మార్కులకు పెడుతున్నాం. ఇందులో ఆ అభ్యర్థికి 80 మార్కులు వస్తే గతంలోని వెయిటేజీ ప్రకారం 20 శాతం అంటే 16 మార్కులు ఉంటుంది. గతంలోని వెయిటేజీ 12 కన్నా ఇపుడు 4 మార్కులు ఎక్కువ వెయిటేజీ వచ్చినందున ఆ అభ్యర్థికి వచ్చిన 80 మార్కులకు 4 మార్కులు కలిపి 84 మార్కులు సాధించినట్లుగా పరిగణిస్తాం’’ అని వివరించారు. మునిసిపల్ పాఠశాలల్లోని 1,250 టీచర్ల పోస్టులను ఈ డీఎస్సీలోనే కలిపి భర్తీచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
టీచర్ పరీక్షలకు ప్రత్యేక సిలబస్
Published Thu, Nov 27 2014 3:35 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement