28 నుంచి అరకు ఉత్సవ్
=గిరిజన సంస్కృతి ప్రతిబింబించాలి
=సందర్శకులకు సకల సౌకర్యాలు
=ఐటీడీఏ పీవో వినయ్ చంద్ ఆదేశం
అరకులోయ, న్యూస్‌లైన్: ఈ నెల 28, 29, 30 తేదీల్లో అరకు ఉత్సవ్ నిర్వహించనున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఉత్సవ్ నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ రచ్చబండ కార్యక్రమం వల్ల వాయిదా వేశారని చెప్పారు. ఉత్సవ్ నిర్వహణ ఏర్పాట్లపై పద్మాపురం ఉద్యానవనంలో పర్యాటక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఉత్సవ్ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించాలని ఆదేశించారు.
ఉత్సవ్ నిర్వహణకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవ్‌కు వచ్చే సందర్శకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పర్యాటక సమాచార అధికారి ఎస్.డి.అనిత మాట్లాడుతూ ఉత్సవ్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన సంప్రదాయ నృత్యాలు థింసా, కొమ్ము, కోయ, లంబాడా, సవర, గరగ, తప్పెటగుళ్లు, మయూర, ఒరియా భాగవతం, కోలాటం వంటి సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఈ సమావేశంలో ఏపీవో పి.వి.ఎస్.నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జున రెడ్డి, ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ భీమశంకరరావు, ఐటీడీఏ పీహెచ్‌వో కె.చిట్టిబాబు, టూరిజం సమాచార శాఖ సహాయ అధికారి రాజు, కో-ఆర్డినేటర్ మురళి, పద్మాపురం గార్డెన్ మేనేజర్ ఎల్.బొంజయ్య తదితరులు పాల్గొన్నారు.