Vaddepalli Narsinga rao
-
మనసెరిగిన నాయకుడు ‘వడ్డేపల్లి’
మూసాపేట, న్యూస్‌లైన్: కార్యకర్తల మనసు తెలిసిన నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు అని, కూకట్‌పల్లిలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని పలువురు నేతలు పేర్కొన్నారు. మూసాపేటలోని తూము పద్మారావు గార్డెన్లో మంగళవారం దివంగత వడ్డేపల్లి నర్సింగరావు సంతాప సభ ఏర్పాటు చేశారు. నేతలు సప్పిడి శ్రీనివాస్, ఖాజా పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వడ్డేపల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన వెన్నంటి ఉండి వారి కష్టాలను తీర్చే నాయకుడని ఈ సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు. ఆయన కూకట్పల్లి రాజకీయాలకు కేంద్ర బిందువు అని, ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. కూకట్‌పల్లిని రాష్ట్రమంతటా పరిచయం చేసిన నాయకుడు వడ్డేపల్లి అని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన కూకట్పల్లి అంటే వడ్డేపల్లి గురించి అడిగేవారని తెలిపారు. రాజకీయాల్లోనే కాక భక్తి, సేవలో కూడా తనదైన ప్రత్యేకతను ఏర్పరుచుకున్న నేత అని వారు కీర్తించారు. కార్యక్రమంలో కూకట్పల్లి కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, నేతలు దేవేందర్, కర్క పెంటయ్య, హరీష్‌రెడ్డి, వద్దిరెడ్డి చలమారెడ్డి, సత్యం, నాగిరెడ్డి, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత ‘వడ్డేపల్లి’ కన్నుమూత
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూకట్పల్లి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న నర్సింగరావు.. మొదట బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 1991లో కాంగ్రెస్‌లో చేరి పి. జనార్దన్‌రెడ్డి శిష్యుడిగా పేరొందారు. 1999 ఎన్నికల్లో పీజేఆర్ ఓటమితో తలెత్తిన మనస్పర్ధలతో అప్పటి సీఎల్పీ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి దగ్గరై ప్రధాన అనుచరుడిగా ఎదిగారు. అనంతరం ఏఐసీసీ సభ్యుడిగా, ఏపీఎండీసీ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించారు. 2009లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో గుండె కండరాలలో తలెత్తిన అనారోగ్యంతో నాలుగు నెలలుగా ఆస్పత్రి పాలయ్యారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, పీఎన్వీ ప్రసాద్, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులతో పాటు పలువురు ప్రముఖులు వడ్డేపల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం నర్సింగరావు అంత్యక్రియలు జరిగాయి. వడ్డేపల్లి కుమారుడిని ఫోన్లో పరామర్శించిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు దివంగతులైన విషయం తెలుసుకొని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఫోన్లో వడ్డేపల్లి తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్‌రావును పరామర్శించారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని నిలవాలని అందుకు ఆ దేవుడు ఆశీస్సులు కుటుంబానికి తప్పక ఉంటాయని ఫోన్లో అన్నారు. కుటుంబానికి ధైర్యవ చనాలు చెప్పారు. -
వడ్డేపల్లి కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. శుక్రవారం తెల్లవారుజామున వడ్డేపల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు.