వైఎస్సార్సీపీ నేత ‘వడ్డేపల్లి’ కన్నుమూత
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూకట్‌పల్లి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న నర్సింగరావు.. మొదట బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 1991లో కాంగ్రెస్‌లో చేరి పి. జనార్దన్‌రెడ్డి శిష్యుడిగా పేరొందారు. 1999 ఎన్నికల్లో పీజేఆర్ ఓటమితో తలెత్తిన మనస్పర్ధలతో అప్పటి సీఎల్పీ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి దగ్గరై ప్రధాన అనుచరుడిగా ఎదిగారు. అనంతరం ఏఐసీసీ సభ్యుడిగా, ఏపీఎండీసీ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించారు. 2009లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో గుండె కండరాలలో తలెత్తిన అనారోగ్యంతో నాలుగు నెలలుగా ఆస్పత్రి పాలయ్యారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, పీఎన్వీ ప్రసాద్, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులతో పాటు పలువురు ప్రముఖులు వడ్డేపల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం నర్సింగరావు అంత్యక్రియలు జరిగాయి.
వడ్డేపల్లి కుమారుడిని ఫోన్‌లో పరామర్శించిన జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు దివంగతులైన విషయం తెలుసుకొని వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో వడ్డేపల్లి తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్‌రావును పరామర్శించారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని నిలవాలని అందుకు ఆ దేవుడు ఆశీస్సులు కుటుంబానికి తప్పక ఉంటాయని ఫోన్‌లో అన్నారు. కుటుంబానికి ధైర్యవ చనాలు చెప్పారు.