దళిత హక్కుల కార్యకర్తకు పట్టం
అహ్మదాబాద్ : దళిత హక్కుల కార్యకర్త, లాయర్ జిగ్నేష్ మేవాని(36) గుజరాత్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. బనస్కంత జిల్లాలోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దళిత హక్కుల కార్యకర్త అయిన మేవాని వడ్గాం నుంచి పోటీకి నిలవడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అక్కడి నుంచి తమ అభ్యర్ధులను ఉపసంహరించుకున్నాయి.
దీంతో జిగ్నేష్, బీజేపీ అభ్యర్థి విజయ్ చక్రవర్తిల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించారు. అయితే, అంచనాలను తలక్రిందులు చేస్తూ 18,150 ఓట్ల భారీ మెజార్టీతో జిగ్నేష్ భారీ విజయం సాధించారు. గుజరాత్‌లోని ఉనా జిల్లాలో దళితులపై దారుణాలపై జిగ్నేష్ అనేక ఆందోళనలు నిర్వహించారు. తన జాతి వారికి జీవించడానికి భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 'ఆజాదీ కూచ్' పేరుతో మేవాని చేపట్టిన ర్యాలీ బాగా ప్రాచుర్యం పొందింది.
ఎవరి వాడిని కాదన్నారు..
దళితులపై దారుణాలను ఎండగట్టిన మేవాని.. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వానికి తాను వ్యతిరేకినని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇవ్వబోనని కూడా చెప్పారు. ఎవరికి ఓటు వేయాలనే విషయం ప్రజలకు తెలుసని, వారు అందరి కంటే స్మార్ట్ అని ఎన్నికలకు ముందు ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మేవాని.