'జీవితాన్ని థ్రిల్‌గా గడపడం ఇష్టం'
ఒకరి కోసం ఒకరు వెయిటింగ్.
మాటల్లో తేడా వస్తే... ఫైటింగ్.
లీవు పెట్టి మరీ హస్కు.
లవ్యూ చెప్పకుంటే లైఫే రిస్కు!
అలకలొస్తే... క్షణమొక శిల.
చేతివేళ్ల చిలకలిస్తే.. ఎదలోపల కోయిల.
పెళ్లైన కొత్తలో ఇలాగే ఉంటుంది...
24 బై 7... బోలెడంత థ్రిల్!
మూడు పూటలా కవిత్వం!!
యంగ్ కపుల్ సాయి, వైష్ణవిలకు మాత్రం
ఇవన్నీ సాదాసీదా థ్రిల్స్.
హనీమూన్‌కి వీళ్లు ఎక్కడికెళ్లారో తెలుసా?
సునామీలొచ్చే ఏరియాకి!
పెళ్లికి ముందు సాయికిరణ్... వైష్టవికి
పరిచయం చేసిన ఫ్రెండెవరో తెలుసా?
హిస్ స్... చప్పుడు చేయకుండా...
కదలండి, టువర్డ్స్... ‘మనసే జతగా...’
సినిమా స్టార్‌గా, సీరియల్ స్టార్‌గా ప్రేక్షకులకు చిరపరిచితులు సాయికిరణ్. సాఫ్ట్వేర్ ఇంజినీర్ వైష్ణవిని మూడేళ్ల క్రితం (జూన్ 24, 2010) పెళ్లి చేసుకున్నారు. ‘జీవితాన్ని థ్రిల్‌గా గడపడం ఇష్టం’ అని సాయికిరణ్ అంటే, ‘నాదీ అదే మాట’ అన్నారు వైష్ణవి. ‘ఒకరి పనిలో ఒకరు తలదూర్చకుండా ఒకరికొకరుగా ఉంటున్నాం’ అని చెప్పిన ఈ జంట కబుర్లే ఇవి.
అలా మొదలైంది!
‘‘పెళ్లి చేసుకోవడానికి నూటతొమ్మిది మ్యాచ్‌లు చూశాను. ఏదో ఇంట్లో ఫలానా అమ్మాయి గురించి అనుకోవడం, నాకు తెలిసిన వారి గురించి ప్రస్తావనకు రావడం అలా...అలా సంఖ్య పెరిగిపోయింది! ఎవరూ నచ్చలేదు. కాని నాలుగేళ్ల క్రితం వైష్ణవి కలిసినప్పుడు మాత్రం నా మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందనిపించి, వెంటనే ఓకే చేశాను. అసలు మాకంటే ముందుగా మా ఇద్దరి కుటుంబాలూ కలుసుకున్నాయి. తర్వాత వైష్ణవి కలిసింది. అప్పటికే తను బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఇంటర్ నెట్లో చాట్ చేసుకోవడం, కుటుంబ వేడుకల్లో కలుసుకోవడం... అలా మొదలైంది మా ప్రేమ. పెళ్లికి మాత్రం ఏడాది పట్టింది. ఆ సమయం మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడటానికి ఉపయోగపడింది’’ గతానుబంధాలను గుర్తు చేసుకున్నారు సాయికిరణ్.
పాములబ్బాయి
‘‘సాయి చాలా కామ్‌గా ఉంటారు కాని, జోక్స్ చెప్పి బాగా నవ్విస్తారు. స్నేక్ షోలో కూడా అంతే!’’ అన్నారు వైష్ణవి. సాయికిరణ్ ‘ఫ్రెండ్స్ స్నేక్స్ సొసైటీ’లో మెంబర్ కూడా! పాములను మనుషుల నుంచి కాపాడి అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. ఆ సందర్భం గురించి సాయికిరణ్ చెబుతూ- ‘‘ఇప్పటి వరకు 900 పైగా పాములను కాపాడి ఉంటాను. పెళ్లికి ముందు ఒకసారి వైష్ణవిని స్నేక్పార్క్కు తీసుకెళ్లాను. ఈ అమ్మాయి ధైర్యమేంటో చూద్దాం అని ఆరడుగుల పే...ద్ద పామును తీసుకొచ్చి, ‘పట్టుకో’ అన్నట్టుగా ఇచ్చాను. పెళ్లయ్యాక పామును తెచ్చి ఇంట్లో పెడితే, తట్టుకోవాలిగా..! అందుకని ముందే ఆ ప్రయత్నం చేశాను! తను ఏమాత్రం జంకకుండా దాన్ని ధైర్యంగా చేతుల్లోకి తీసుకుంది. అప్పుడనిపించింది తనదీ నా తరహా మనస్తత్వమే
అని.’’ సంబరంగా చెప్పారు సాయికిరణ్!సీ‘రియల్’!
‘‘పెళ్లయిన ఆరునెలల వరకు ఉద్యోగరీత్యా నేను బెంగళూరులోనే ఉన్నాను. వారాంతంలో ఈయనే బెంగళూరు వచ్చేవారు. ఆరునెలల తర్వాత తనకు సీరియల్లో అవకాశం రావడంతో ఇద్దరం చెన్నైలో కాపురం పెట్టాం. అయితే, అక్కడ ఇద్దరికీ ఆర్థికంగా కటకట వచ్చింది. రోజులు ఎలా గడుస్తాయా అని భయపడ్డాం. అలాంటి సమయాల్లో భార్యాభర్తల మధ్య చికాకులు, కోపాలు చోటుచేసుకోవడం సహజం. అందుకు విరుద్ధంగా మేం మరింతగా కలిసిపోయాం. ఆ తర్వాత సాయికి హైదరాబాద్‌లో అవకాశాలు రావడంతో ఇద్దరం ఇక్కడకు షిఫ్ట్ అయ్యాం’’ అంటూ పెళ్లినాటి తొలిరోజులను గుర్తు చేసుకున్నారామె.
‘రిస్క్’ అంటే ఇష్టం
తమకు అడ్వంచర్స్ అంటే ఇష్టమని చెబుతూ...‘‘రిస్క్ లేకపోతే లైఫ్‌లో థ్రిల్ ఉండదని నా అభిప్రాయం. పెళ్లయ్యాక హనీమూన్‌కి అందరిలాగే ఊటీ, కొడెకైనాల్ వెళ్లాలనుకోలేదు. సునామీ వచ్చిన ప్లేస్‌కి వెళ్లాలనుకున్నాం. అలా మాల్దీవులకు వెళ్లాం. అక్కడ మాస్క్ వేసుకొని, సముద్రంలోకి వెళ్లిపోయాం. సముద్రంలో రకరకాల చేపలు, జలచరాల మధ్య గడపడం భలే మజాగా అనిపించింది’’ అని సాయికిరణ్ చెబుతుంటే ‘‘మా లైఫ్‌లో అది బెస్ట్ పార్ట్. ఈయనకు ఇలాంటి ఆసక్తి ఉందనే పెళ్లికి ముందు ప్రత్యేకంగా స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాను’’ అంటూ భర్త ఆలోచనలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న విధానాన్ని తెలియజేశారు వైష్ణవి.
పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి సాయికిరణ్ ప్రస్తావిస్తూ -‘‘పెళ్లి తర్వాత పాములు పట్టడం అనే ప్రమాదకరమైన హాబీని కొంత తగ్గించాను. ఎందుకంటే నన్ను నమ్ముకొని నాకోసం ఓ వ్యక్తి ఉన్నారు అనిపించేది. అయితే వైష్ణవి మాత్రం ‘ఏంటిది, ఇప్పటినుంచే అంకుల్‌లాగా..! ఇలాగైతే త్వరలో మన ఇంటికి రాబోయే బుజ్జిపాపకు మీరు అడ్వెంచర్స్ ఎలా పరిచయం చేస్తారు?’’ అంటూ ఆటపట్టిస్తోంది’’ మురిపెంగా చెప్పారు.
చూపులతోనే భావాలు
పెళ్లయ్యాక భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి అవగాహన కలగాలంటే ఏడాది కాలం పడుతుందని చెబుతూ- ‘‘నాకు నా స్పేస్‌లో ఉండటం అంటే అమితమైన ఇష్టం. ఫ్లూట్ వాయిస్తూనో, పగటికలలు కంటూనో, డ్రాయింగ్ వేస్తూనో, పాటలు పాడుకుంటూ నో గంటలు గంటలు గడిపేసేవాడిని. దాంతో తను మూడీగా మారిపోయేది. అది గ్రహించి, నా హాబీస్‌లో వైష్ణవినీ ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టాక మా మధ్య ర్యాపో పెరిగింది. అలా వైష్ణవి అభిరుచులేంటో తెలిశాయి. తను సంగీతాన్ని ఇష్టపడుతుంది. యోగా చేస్తుంది. ఇంటర్నెట్లో చూసి రకరకాల వంటలు ట్రై చేస్తుంది. మా మధ్య ఎంత చనువు పెరిగినా, నన్ను తన అధీనంలో ఉంచుకోవాలి అని వైష్ణవి ఎప్పుడూ అనుకోలేదు’’ అని సాయికిరణ్ చెబుతుంటే ‘‘...అలా అనుకోవడం వెర్రితనం.
అలా అనుకోకపోవడం వల్లనే తను బయటకు వెళ్లడం బాగా తగ్గించేసి, నాతోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడ్డారు. అసలు భార్య భర్తను కంట్రోల్ చేయాలనో, భర్త భార్యను కంట్రోల్ చేయాలనో చాలామంది అనుకుంటారు. అలాంటి తలంపు ఉందంటే... వారి మీద నమ్మకం లేనట్టు. నమ్మకం లేని చోట బంధం బలహీనమే...’’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు వైష్ణవి. ఇద్దరికీ సాహసాలు చేయడం, జీవితాన్ని థ్రిల్లింగ్‌గా మార్చుకోవడమంటే ఇష్టం. ఇద్దరికీ ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని మసలుకోవడం ఇంకా ఇష్టం. మాటల కన్నా కళ్లతో మాట్లాడుకోవడం మరీ ఇష్టం. భార్యాభర్తల మధ్య విభేదాలు ఎందుకు వస్తుంటాయో, అవి తమ మధ్య రాకుండా ఉండటానికి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి ముప్ఫై ఏళ్లు అవసరం లేదు, మూడేళ్లు చాలు అని తమ మాటల్లో తెలిపారు జంట. బయట రాజాలా ఉన్నా, ఇంట్లో పట్టించుకునేవారు లేకపోతే జీవితంలో ఏమీ లేనట్టే! ఇంట్లో స్నేహితురాలిలా ఉండే భార్య దొరకడమే ఆ దేవుడు ఇచ్చిన కానుకగా భావిస్తాను.
- సాయికిరణ్
చాలామందిలా తన కాబోయే
భార్య ఫొటోలు తీసి పెట్టుకోకుండా నా రూపాన్ని చిత్రించి, దానికో అందమైన ప్రేమలేఖ జతచేసి తను ఇష్టపడే పెర్ఫ్యూమ్ అద్ది గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు. ఇప్పటికీ అది పెద్ద కానుకగా భావిస్తాను.
- వైష్ణవి
సాయికిరణ్ నటి ంచిన... సినిమాలు:
నువ్వేకావాలి, ప్రేమించు, మనసుంటే చాలు, డార్లింగ్ డార్లింగ్, సత్తా, హైటెక్ స్టూడెంట్స్, వెంగమాంబ, రామ్‌దేవ్, బుల్లబ్బాయ్, అజంతా, లెమన్, సువర్ణ, క్షణం, దేవీ అభయం.
సీరియళ్లు: శివలీలలు, వెంకటేశ్వరవైభవం, సృష్టి, పురాణగాధలు, శ్రీ నారాయణ తీర్థులు, సుందరకాండ, ఆటోభారతి, సుడిగుండాలు, తంగం(తమిళం)
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి