ఎయిర్‌పోర్టులను షేక్ చేసింది గర్ల్‌ఫ్రెండ్ వల్లే..
హైదరాబాద్: తన గర్ల్‌ఫ్రెండ్‌ను టూర్‌కు తీసుకెళ్లే బాధ నుంచి తప్పించుకునేందుకే విమానాలకు హైజాక్ బెదిరింపులు పంపించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అసలు విషయం చెప్పాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఈ సమయంలోనే గర్ల్‌ఫ్రెండ్ ముంబయి, గోవా టూర్లకు విమానంలో తీసుకెళ్లమందని, అది ఎలా తప్పించుకోవాలో అర్థంకాక, ఆమె టూర్‌కు వెళదామని చెప్పిన రోజే హైఅలర్ట్ విధించేలా ప్లాన్ చేసినట్లు తెలిపాడు. ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్‌తోపాటు, ముంబయి, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో అప్రమత్తత విధించిన విషయం తెలిసిందే.
విమానాలు హైజాక్ వస్తున్నట్లు పలు మెయిళ్లు రావడంతో సంబంధిత ఎయిర్పోర్ట్ అధికారులు హైఅలర్ట్ విధించారు. అనంతరం మెయిల్ పంపించిన వ్యక్తి ఆధారాలకోసం సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ మెయిల్ హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అనంతరం మెయిల్ ఆధారంగా వంశీ చౌదరీ అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం చెప్పాడు.
తన గర్ల్‌ఫ్రెండ్ చెన్నైలో ఉంటోందని, ముంబయి, గోవా టూర్‌కు తీసుకెళ్లాలని కోరిందని చెప్పాడు. ట్రాన్స్పోర్ట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తన వద్ద డబ్బు లేక ఇబ్బంది తలెత్తడంతో ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఇలా చేశానని, ఆమె అడగగానే ప్రస్తుతం విమానాశ్రయాల్లో హైఅలర్ట్ విధించారని, విమానాలు రద్దయ్యాయని చెప్పి తప్పించుకున్నానని వివరించాడు. అంతకుముందు ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పినా ఆమె వినిపించుకోకపోవడంతోనే ఇలా చేసినట్లు తెలిపాడు. గతంలో ఇతడిపై రెండు సైబర్ కేసులు ఉన్నాయంట. ప్రస్తుతానికి సైబర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.