దీక్షబూని..
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణకు డిమాండు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి హైదరాబాద్‌లో శనివారం ఉదయం చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా నగరంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ నేతలు రాఘవయ్యపార్కు వద్ద నిరశన దీక్షా శిబిరానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పెడనలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ ఉప్పాల రాము కూడా నిరవధిక నిరశన చేపడుతున్నారు. జగన్మోహన్రెడ్డి జైలులో చేపట్టిన దీక్షకు సంఘీభావంగా రాము ఐదురోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పార్టీ జిల్లా కన్వీనరు ఉదయభాను చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరింది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సతీమణి లక్ష్మీపార్వతి, పెడన మాజీ శాసనసభ్యులు జోగి రమేష్ శుక్రవారం ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నేత దుట్టా రవిశంకర్ చేపట్టిన దీక్షను శుక్రవారం సాయంత్రం పోలీసులు భగ్నంచేశారు. మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కోనేరుసెంటరులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు రెండోరోజుకు చేరాయి. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు కుక్కల నాగేశ్వరరావు తదితరులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు.
మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడోరోజుకు చేరాయి. స్థానిక భద్రాచలం రోడ్డులో డాక్టర్ హనిమిరెడ్డి కాంప్లెక్స్ ఎదుట ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో శుక్రవారం కూర్చున్నవారికి పార్టీ మైలవరం పట్టణ కన్వీనర్ శీలం కోటిరెడ్డి, ఎన్. దుర్గాప్రసాద్, మహిళా నాయకురాలు వంగల పద్మ పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. నూజివీడు జంక్షన్లో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 39వ రోజుకు చేరాయి.
ఈ దీక్షలను నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ప్రారంభించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 59వ రోజుకు చేరాయి. పెడనలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అడ్‌హక్ కమిటీ సభ్యులు గూడవల్లి కేదారేశ్వరరావు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను విరమించారు.
అవనిగడ్డలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు దీక్షను పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేయడంతో ఈ శిబిరంలో కొందరు నాయకులు రిలే నిరశన చేపట్టారు. టీనోట్ ప్రకటనకు నిరసనగా చల్లపల్లిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చండ్ర వెంకటేశ్వరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నిడమానూరి దిలీప్‌కుమార్ శుక్రవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు నగరం, జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నాయకులు, కార్యకర్తలు 72 గంటల బంద్ నిర్వహించారు. రోడ్లపై టైర్లు తగలబెట్టి తమ నిరసన తెలిపారు. రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. షాపులు మూయించారు.
బొత్స ఇక బార్‌షాపుల్లో బ్రోకర్‌గా చేయాల్సిందే..
జగ్గయ్యపేట : రాష్ట్ర విభజనకు సహకరించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇకపై సీమాంధ్ర బార్‌షాపులో బ్రోకర్‌గా పనిచేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ విమర్శించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సమైక్యాంధ్రకు మద్దతుగా గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ బొత్స జోడు పదవులను అడ్డం పెట్టుకొని సీమాంధ్ర ప్రజల్ని పట్టించుకోకుండా ఢిల్లీలో సోనియా భజన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపాడన్నారు. ఇటువంటి సీమాంధ్ర ద్రోహులను క్షమించరాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విశ్వనాథం, నాగేశ్వరరావు, జిల్లా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు వేల్పుల పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు.