ఇదేం పద్ధతి?
నల్లగొండ టూటౌన్: ‘కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించరా..?, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించరా..?, విధుల్లో బాధ్యతారాహిత్యం పనికిరాదు’ అంటూ తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.వాణీప్రసాద్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఎన్జీ కళాశాలలో జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల అకాడమిక్ సంబంధించిన షెడ్యూల్‌ను, ఆర్థిక వివరాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ... విద్యార్థులకు సరైన విద్యను అందించకపోతే ఎలా అని అధ్యాపకులను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ విద్యార్థులకు సరైన బోధన చేయకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. కళాశాలలో మంచి వాతావరణాన్ని కల్పించాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని సూచించారు. తాను గతంలో తనిఖీ చేసిన సమయంలో ఇక్కడి సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. అదేవిధంగా కొత్త కోర్సులు, కళాశాల సమస్యలపై చర్చించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.నాగేందర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఏడుకొండల్, దయాకర్ పాల్గొన్నారు.