వాంకోర్‌లో ఓవీఎల్ వాటా పెంపు!
► ఇప్పటికే 15 శాతం వాటా కొనుగోలు
► మరో రష్యా చమురు క్షేత్రం టాస్‌లో వాటాలపై ఐవోసీ, ఆయిల్ దృష్టి
మాస్కో: రష్యాతో చమురు బంధాలను పటిష్టం చేసుకోవడంపై భారత కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. రష్యాలో రెండో అతిపెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో వాటాలు మరింత పెంచుకునేందుకు ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) చర్చలు జరుపుతోంది.
అటు, తూర్పు సైబీరియాలోని టాస్-యురియాఖ్ నెఫ్త్‌గాజొదొబైచా చమురు ప్రాజెక్టులో వాటాలు దక్కించుకునేందుకు ఇండియన్ ఆయిల్ (ఐవోసీ)-ఆయిల్ ఇండియా (ఆయిల్) కసరత్తు చేస్తున్నాయి. వాంకోర్‌లో తొలుత 25 శాతం వాటాలు కొనుగోలు చేయాలని ఓవీఎల్ భావించింది. అయితే, ఆ క్షేత్ర యాజమాన్య సంస్థ రాస్‌నెఫ్ట్ 1.26 బిలియన్ డాలర్లకు 15 శాతం వాటాలను అమ్మేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ప్రక్రియలో తొలి దశ పూర్తి కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా ఓవీఎల్, రాస్‌నెఫ్ట్ అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అదే సమయంలో వాంకోర్‌లో ఓవీఎల్ వాటాలు పెంచుకునే అంశంపైనా చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వాంకోర్ క్షేత్రంలో 476 మిలియన్ టన్నుల చమురు, 173 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉందని అంచనా. ఇందులో నుంచిరోజుకు 60,000 టన్నుల ఉత్పత్తి నమోద వుతోంది.
ఇక, టాస్-యురియాఖ్ ప్రాజెక్టులో వాటాల విక్రయ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రాస్నెఫ్ట్తో ఐవోసీ, ఆయిల్ విడిగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. టాస్-యురియాఖ్‌లో ఐవోసీ-ఆయిల్ 29 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో సుమారు 20 శాతం వాటాలను రాస్‌నెఫ్ట్ అక్టోబర్‌లో బ్రిటన్ సంస్థ బీపీకి 750 మిలియన్ డాలర్లకు విక్రయించింది.