వాంకోర్నెఫ్ట్లో ఓవీఎల్ వాటా కొనుగోలు పూర్తి
♦ 15% వాటాను 127కోట్ల డాలర్లకు కొనుగోలు
♦ మరో 11 శాతం వాటా కొనుగోలు!
న్యూఢిల్లీ: రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో 15 శాతం వాటా కొనుగోలును ఓఎన్‌జీసీ విదేశ్ పూర్తి చేసింది. వాంకోర్ చమురు క్షేత్రాన్ని నిర్వహించే జేఎస్‌సీ వాంకోర్‌నెఫ్ట్ కంపెనీలో ఈ 15% వాటాను ఓఎన్‌జీసీ విదేశ్ 126.8 కోట్ల డాలర్లకు రష్యా జాతీయ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఓఎన్‌జీసీ విదేశ్‌కు ఇది నాలుగో అతి పెద్ద కొనుగోలు లావాదేవీ. వాంకోర్‌నెఫ్ట్ డెరైక్టర్ల బోర్డ్‌లో రెండు డెరైక్టర్ల పదవులు ఓఎన్‌జీసీ విదేశ్‌కు లభిస్తాయి.
250 కోట్ల బ్యారె ళ్ల రికవరబుల్ రిజర్వ్‌లు ఉన్న ఈ చమురు క్షేత్రం నుంచి ఓవీఎల్ వాటా కింద ఏడాదికి 33 లక్షల టన్నుల చమురు వస్తుందని అంచనా. ఈ చమురు క్షేత్రంలో రోజుకు 4.42,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోందని, దీంట్లో ఓవీఎల్ వాటా రోజుకు 66 వేల బ్యారెళ్లుగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ వాటా కొనుగోలుతో రష్యాలో ఓవీఎల్ స్థితి మరింతగా పటిష్టమవుతుందని, భారత ఇంధన భద్రత మరింత మెరుగుపడుతుందని, అంతేకాకుండా ఇరు దేశాల మధ్య సహకారం మరింతగా బలపడుతుందని ఓవీఎల్ పేర్కొంది. మరో 11% వాటాను కూడా విక్రయించడానికి రాస్‌నెఫ్ట్ అంగీకరించింది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారు కావలసి ఉంది.