మారణాయుధాల వినియోగంలో, ధ్వంస రచనలో ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు నిరూపించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆరామ్‌కో ఆధ్వర్యంలో తూర్పు ప్రాంతంలో ఉన్న రెండు చమురు క్షేత్రాలపై శనివారం ద్రోన్‌లతో దాడులు జరిపి ఆ దేశానికి భారీ నష్టం కలగజేశారు. ప్రపంచంలో ప్రధాన ముడి చమురు ఉత్పత్తి దేశంగా ఉన్న సౌదీ అరేబియా ఈ ఉదంతంతో ఒక్కసారిగా తన ఉత్పత్తిని సగానికి తగ్గించుకోవాల్సి వచ్చిందంటే నష్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. సౌదీ సరిహద్దుల్లోకి తిరుగుబాటుదార్లు చొరబడి తమ సైనికుల్ని చంపేశారని ఆరోపిస్తూ నాలుగేళ్లక్రితం ఈజిప్టు, బహ్రైన్, కువైట్, జోర్డాన్, సుడాన్ తదితర పది దేశాలతో సౌదీ అరేబియా కూటమి కట్టి హౌతీ తిరుగుబాటుదార్లపై యుద్ధం ప్రారంభించింది. యుద్ధాలెప్పుడూ అనుద్దేశిత పర్యవసానాలకు దారితీస్తాయి. యెమెన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించి ఉత్తర యెమెన్‌లో షియా మైనారిటీ తెగ జైదీలకు చెందిన హౌతీ తిరుగుబాటుదార్ల పని పట్టాలని సంకల్పించిన సౌదీ అరేబియా చివరికిప్పుడు తన గగనతలాన్నే రక్షించుకోలేక అందరిలో నగుబాటుపాలైంది.
యెమెన్‌లో అధ్యక్షుడు హదిని పదవినుంచి తప్పించాలని సంకల్పించిన హౌతీ తిరుగుబాటుదార్ల వెనక ఇరాన్ హస్తమున్నదని సౌదీ అరేబియా శంకించి ఈ పోరు ప్రారంభించింది. అసలే యెమెన్ అంతక్రితం మూడేళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతుంటే సౌదీ తగుదునమ్మా అని తలదూర్చి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇంతవరకూ ప్రపంచ దేశాలన్నీ హౌతీ తిరుగుబాటుదార్లను తేలిగ్గా తీసుకున్నాయి. నాలుగేళ్లుగా సౌదీ దాడులను తట్టుకుని నిలబ డినా వారిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజా దాడులతో వారి శక్తిసామర్థ్యాలపై అందరిలో పున రాలోచన బయల్దేరింది. ఎందుకంటే వారు పది ద్రోన్‌లను సౌదీపై గురిపెడితే అరేబియా ద్వీపకల్పం పొడవునా ఎవరి నిఘాకూ చిక్కకుండా ఆ ద్రోన్‌లు లక్ష్యాన్ని ఛేదించాయి. ఇరాన్ హస్తం లేకపోతే హౌతీలకు ఇది అసాధ్యమని సౌదీతోపాటు అమెరికా కూడా విశ్వసిస్తోంది. ఏం జరిగిందో సౌదీ స్పష్టంగా చెబితే తాము యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ద్రోన్‌లు ఇరాన్ భూభాగం నుంచి వచ్చాయా, ఇరాక్‌లో షియా ఆధిపత్యం ఉన్న ప్రాంతం నుంచి వచ్చాయా అన్నది అమెరికా ఇంకా తేల్చుకోలేదు. ఇలాంటి బెదిరింపుల వల్ల ఇరాన్ పాదాక్రాంతమవుతుందని, పశ్చిమాసియాపై పూర్తి పట్టు సాధించవచ్చునని అమెరికా అంచనా వేస్తే అది ఘోర తప్పిదమే అవుతుంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ పోరును మరింత ఉగ్రరూపం దాల్చ కుండా ఎలా చల్లార్చడమన్నదే అందరి ధ్యేయం కావాలి.
పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధమే సంభవిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయో తాజా పరిణామాలను చూస్తేనే అర్ధమవుతుంది. ద్రోన్ దాడుల తర్వాత సౌదీ అరేబియా ఒక్కసారిగా తన దినసరి చమురు ఉత్పత్తిలో 57 లక్షల బ్యారెళ్ల కోత పెట్టాల్సివచ్చింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో 5 శాతం కన్నా ఎక్కువే. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారి పైపైకి ఎగబాకాయి. 55 డాలర్లున్న బ్యారెల్ చమురు ధర 67 డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పల్టీ కొట్టాయి. కరెన్సీ విలువలు పతనమయ్యాయి. బంగారం ధర మరోసారి భగ్గు మంది. మన దేశంపై కూడా పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు బాగా పెరిగి అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ విపత్కర స్థితిలో చిక్కుకుంటుంది. ఇప్పటికే 5శాతంగా ఉన్న వృద్ధి రేటులో మరింత కుంగుబాటు ఉంటుంది. మన చమురు అవసరాల్లో 83 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. ఈ దిగుమతుల్లో సౌదీ వాటాయే అధికం. తమ నుంచి వచ్చే చమురులో కోత విధించబోమని సౌదీ అరేబియా మన దేశానికి ఇప్పటికే హామీ ఇచ్చింది. వారం రోజుల్లో చమురు ఉత్పత్తి మళ్లీ యధా స్థితికి చేరుతుందని తెలిపింది. అయితే తనకు వచ్చి పడిన నష్టాలను పూడ్చుకోవడానికి ముందూ, మునుపూ ధరలు పెంచే ప్రమాదం లేక పోలేదు. అదే జరిగితే మన కష్టాలు మరింతగా పెరుగుతాయి.
ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదాల గురించి ఇన్నాళ్లూ అందరిలోనూ ఉంటున్న అంచనాలు వేరు. సిరియా సంక్షోభం సకాలంలో చల్లారకపోతే అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ తలెత్తు తుందని, అది ప్రపంచ దేశాలన్నిటినీ ఆర్థికంగా కుంగదీస్తుందని అనుకున్నారు. అక్కడ సంక్షోభం యథాతథంగానే ఉన్నా అగ్రరాజ్యాలు సంయమనం పాటించాయి. అయితే అమెరికా–చైనాల టారిఫ్‌ల యుద్ధం ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాల్చి ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ఊబిలోకి నెడుతుందని ఈమధ్యకాలంలో అందరూ ఆందోళనపడ్డారు. అది కూడా ఎంతో కొంత చల్లారింది. కానీ ఊహిం చనివిధంగా తాజా ద్రోన్ దాడులు పశ్చిమాసియాలో కయ్యానికి ఆజ్యం పోశాయి. అటు సిరియా సంక్షోభమైనా, ఇటు యెమెన్ రగడైనా సౌదీ అరేబియా పుణ్యమే. 2011లో జరిగిన అరబ్ విప్లవంలో ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ఊహించనివిధంగా పతనం కావడంతో ఇరాన్ ప్రాబల్యం పెరుగుతుందని భయపడ్డ సౌదీ... అందుకు సిరియాలో నిప్పు రాజేయడమే విరుగుడుగా భావిం చింది. అక్కడ పాలకుణ్ణి మారిస్తే అది తన చెప్పుచేతల్లోకి వస్తుందని అంచనా వేసింది. కానీ 2015లో రష్యా రంగప్రవేశంతో అది బెడిసికొట్టింది. ఆ తర్వాత సౌదీ అరేబియా యెమెన్‌లో వేలుపెట్టింది. ఈ నాలుగేళ్లలో అక్కడి ఘర్షణల్లో లక్షమంది మరణించగా, లక్షలాదిమంది శరణార్ధులుగా మారారు. ఇప్పుడు అమెరికా ఇరాన్‌పై దాడికి దిగితే అది పశ్చిమాసియాకు మాత్రమే కాదు...ప్రపంచానికే పెను ముప్పు కలిగిస్తుంది. అందుకే ప్రపంచ దేశాలూ, ఐక్యరాజ్యసమితి మొదలుకొని అన్ని ప్రపంచ సంస్థలూ పశ్చిమాసియాలో శాంతికి కృషి చేయాలి. ఏదో ఒక సాకుతో ఇరాన్‌పై ఒంటికాలిపై లేస్తున్న అమెరికాను అదుపు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment